Jokes Day ..July 1:  సరదాగా కాసేపు..  మనసారా జోకులు వేసుకుందాం.... అన్నీ మరిచిపోదాం..నవ్వుకుందాం..

Jokes Day ..July 1:  సరదాగా కాసేపు..  మనసారా జోకులు వేసుకుందాం.... అన్నీ మరిచిపోదాం..నవ్వుకుందాం..

జోక్​లు వేయి.. జోక్​లను ఆస్వాదించవచ్చు.  అవును జోక్​ లు వేసి నవ్విస్తే ..  మన సొమ్మేం పోదుగా.. ఒక్క జోక్ వేసి నవ్విస్తే .. యుద్దాలెన్నో ఆపేయచ్చు అని  ఓ కవి రాశాడు. జోక్​ వేయడానికి  పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. అలా అని జోక్​అంత ఈజీగా ఏమీ వచ్చేయదు. పెళ్ళాంతో గొడవ పడిన వాడి దగ్గరకు వెళ్లి ఓ జోక్​ వేసి ..  నవ్వరా బాబూ.. అన్నామంటే మన మూతి పళ్ళు రాలిపోతాయి. కానీ, కష్టంలోనూ చిరునవ్వుతో ఉండగలిగిన వారిని ఆ కష్టాలు ఏమీ చేయలేవు. అది సరే.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, జులై 1 అంతర్జాతీయ జోకుల  దినోత్సవం. ఏదో జోకుల  దినోత్సవం కదా అని నాలుగు   జోకులతో నవ్వులు పంచుదామని ఈ ప్రయత్నం.

జోకుల రోజు అమెరికాలో మొదలైంది. తర్వాత అదే ప్రపంచ దేశాలకు పాకింది. జోకులను గ్రీకులు సృష్టించారని అంటారు. క్రీస్తు పూర్వం 350లో గ్రీకులో కామెడీ క్లబ్​ ఏర్పాటు చేశారు. అక్కడ ఫ్రెండ్స్ అంతా చేరి జోకులు షేర్ చేసుకునేవాళ్లు. ఒకరు నిలబడి జోక్ చెప్తే..క్లబ్​ లో  కూర్చున్న వాళ్లు అందరూ నవ్వేవాళ్లు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వేలకొద్ది నవ్వుల క్లబ్లు వెలిశాయి. అక్కడ జోక్స్ పూస్తున్నాయి. గ్రీకులు జోకుల పుస్తకాలు ఎన్నో వారసత్వంగా అందించారు.

ప్రస్తుతం సరదాగా చెప్పుకునే  వార్తల్లో ఒక్క జోక్​  కనిపించడం లేదు. ఎటు చూసినా గందరగోళం. ఈ కాలంలో కాస్త ఊపిరి పీల్చుకుందాం...  సరదాగా కాసేపు జోకులు వేసుకుందాం.. నవ్వుకుందాం. అన్నట్టు జోకులంటే  గుర్తొచ్చింది.. మొన్న ఎక్కడో ఒకావిడ వాళ్ళాయనను ”పెళ్లికాక ముందు నన్ను సినిమాలకు, పార్కులకు భలే షికార్లు తిప్పేవారు.. పెళ్లయ్యాక మీరు ఎక్కడికీ తీసుకెళ్లట్లేదు..!” అంటూ గట్టిగా గొడవేసుకుంది. ఆయనకు ఏం చెప్పాలో అర్ధం కాలేదు.. కూల్ గా ” పిచ్చదానా.. ఎలక్షన్లు అయ్యాకా ఇంకా ఎవరన్నా ప్రచారం చేస్తారా?” అన్నాడు. తరువాత ఏమైందని అడగొద్దు. మీరే ఊహించుకోండి ఏం జరిగి ఉంటుందో.

ఈ మధ్య ఒకమ్మాయి పానీ పూరీ తినడానికి వెళ్ళింది. ఎక్కువగా అక్కడే ఆ అమ్మాయి పానీపూరీ తింటుంది. ఎప్పుడూ ఓ ప్లేట్ తినే ఆమె మూడు ప్లేట్లు లాగించేసింది. బిల్లు కట్టేసింది.. తర్వాత ”అన్నా..ఏమి ఈరోజు పానీ పూరీ ఈరోజు ఇంత బావుంది.” అని అడిగింది. ”అంటే ఈ రోజు గిన్నెలు కొంచెం.. సర్ఫ్​ వేసి కడిగాను  అంతే.” అన్నాడు. మరి ఇక ఆ అమ్మాయి జీవితంలో పానీ పూరీ జోలికి వెళుతుందో లేదో తెలీదు.

ఇక చిన్న పిల్లలు మాట్లాడుకుంటే భలే ఉంటుంది. ఓ ఇద్దరు గడుగ్గాయిలు మాట్లాడుకుంటే విన్నామంటే మనకి పొట్ట చెక్కలు అవ్వడం ఖాయం. ఓ గడుగ్గాయి పక్కనే ఉన్న మరొకడికి ఇలా చెప్పాడు. ”చేపలు తిన్నవెంటనే నీళ్ళు తాగకూడదు తెలుసా” రెండో వాడు అడిగాడు ”అవునా? ఎందుకు?” వెంటనే మొదటి గడుగ్గాయి సీరియస్ గా ఇలా చెప్పాడు ” ఎందుకేంట్రా.. చేపలు తిన్న తరువాత నీళ్ళు తాగితే కడుపులో చేప ఈదడం మొదలు పెడుతుంది..దాంతో కడుపులో చక్కిలిగిలి పుడుతుంది.” నిజమే కదా.. చిన్నారులు వారికీ తెలిసీ తెలియక అనే ఇలాంటి మాటలు మనకి ఒక్కసారిగా రిలీఫ్ తెస్తాయి.

ఇరుగూ పొరుగూ అన్నాకా కాస్త అవీ..ఇవీ మాట్లాడుకుంటారు కదా. అందులోనూ ఆడవాళ్లు.. ఒకావిడ పక్కింటావిడ దగ్గరకు వచ్చి ఏమండీ ఇది తెలుసా పక్క వీధిలో సుబ్బారావు గారు కోమాలోకి వెళ్లిపోయారట అంది కంగారుగా. దానికి ఆ పక్కింటావిడ బోలెడు డబ్బుంది కదా ఆయన కోమాలోకైనా వెళతారు.. ఎక్కడికన్నా వెళతారు. మనమే ఇలా కొట్టుకుంటూ చావాలి అంది కాస్త నిరాశగా.. పాపం ఆమెకు అలా అర్ధం అయింది.

చివరగా చిన్న జోక్. మనసారా నవ్వుకోండి.. ”భార్య: “ఏవండి.. నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. భయంగా వుంది…!” భర్త: దానికి అంత భయం ఎందుకు? నీ బ్యాగులో వాటర్ బాటిల్ ఉందా? భార్య: ”ఉంది”. భర్త: ” ఈసారి వాడు నీ వెంట పడితే వాటర్ బాటిల్‌తో.. నీ మొహం కడుక్కో, మేకప్ పోయిన తర్వాత చూసి భయపడి వాడే పారిపోతాడు.. అన్నాడు కూల్ గా. హ్యాపీ జోక్స్​ డే! ఇలాగే నవ్వుతూ గడిపేయండి!

ఇలా చెప్పుకుంటూ పొతే నిజ జీవితంలోనే బోలెడు  హాస్యం జోకులతో పుడుతుంది. మనం హాయిగా పాజిటివ్ గా ఉండాలి కానీ, ప్రతి సంఘటన లోనూ హాస్యం చూడొచ్చు. హాస్యం అంటే పడీ పడీ నవ్వేదే కానక్కర్లేదు. మనసును ఉల్లాసపరిచే చిన్న పంచ్ కావచ్చు.. అనుకోకుండా పెదవుల మీదకు చిరునవ్వు తీసుకొచ్చే చిన్న సందర్భం కావచ్చు. ఎప్పుడన్నా బాధ..లేదా మనసు కలవరంగా ఉన్నపుడు సరదాగా మీరు చూసిన సినిమాల్లోని ఓ మంచి కామెడీతో కూడిన  జోక్​సన్నివేశాన్ని గుర్తు తెచ్చుకోండి. మీకు కచ్చితంగా కొంత ఆందోళన తగ్గి.. మనసు బరువు తీరుతుంది. జోక్ లు చెప్పలేకపోతే కనీసం.. ఎవరైనా జోక్ చెప్తే ఆస్వాదించండి.

 

జోక్ ... వేస్తే ...

నిద్ర రావాలంటే.. జోకొట్టాలి. నవ్వు రావాలంటే జోక్ కొట్టాలి. నవ్వుకు జోక్ పెద్ద ముడిసరుకు. నవ్వడమే జోక్ అసలు ఉద్దేశం. జోక్ ని ఎంజాయ్ చేయాలి. జోక్ లో కూడా సీరియస్​ ను వెతికితే.. ఎప్పటికీ నవ్వలేరు. భూమి మీద ఉన్న సకల జీవరాశిలో మనిషి మాత్రమే నవ్వగలడా? అంటే కానే కాదు! మనిషి కోతి నుంచి పుట్టినట్టే.. నవ్వు కూడా కోతిని చూసే నేర్చుకున్నామని ఆలస్యంగా తెలుసుకున్నాడు మనిషి, కరెక్ట్ గా గమనిస్తే... జంతువుల నవ్వుని కూడా అర్థం చేసుకోవచ్చు. క్లాస్ రూంకు వెళ్లి నేర్చుకునే చదువు కాదు నవ్వు. అది పుట్టుకతో వచ్చే లక్షణం. అందుకే మనసు బాగోలేనప్పుడు ఒక జోక్ వేసి నవ్వించండి...  కుదుటపడతారు. 

ఇలా నిజ జీవితపు హాస్యాన్ని ఎంజాయ్ చేస్తూ.. జోకుల  దినోత్సవం ఒక్కరోజే కాకుండా.. ఎప్పుడూ జోకులు వేసుకుంటూ చిరునవ్వుతో ఉండాలని.. కష్టాల కన్నీటిని నవ్వుల పువ్వులతో పక్కకు నేట్టేయాలనీ సంకల్పం తీసుకోండి. అంతే.. జీవితమంతా చిరునవ్వుల నావలో హాయిగా సాగిపోతుంది.