India vs Sri Lanka: రాణించిన పఠాన్ సోదరులు.. ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం

India vs Sri Lanka: రాణించిన పఠాన్ సోదరులు.. ఉత్కంఠ పోరులో టీమిండియా విజయం

ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‍లో టీమిండియా బోణి కొట్టింది. శనివారం(ఫిబ్రవరి 22) శ్రీలంక మాస్టర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఇండియా మాస్టర్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. ఆఖరి ఓవర్ లో లంక విజయానికి 9 పరుగులు అవసరం కాగా, మాజీ పేసర్ అభిమన్యు మిథున్ అద్భుతంగా కట్టడి చేశాడు. కేవలం 5 పరుగులిచ్చి జట్టుకు మంచి విజయాన్ని అందించాడు.

ఈ మ్యాచ్‪లో పఠాన్ సోదరులు ఇద్దరూ రాణించారు. అన్న బ్యాటింగ్‍లో రాణించగా.. తమ్ముడు బౌలింగ్‌లో సత్తా చాటాడు. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది. స్టువర్ట్ బిన్నీ(31 బంతుల్లో 68; 3 ఫోర్లు, 7 సిక్స్‌లు), యూసుఫ్ పఠాన్(22 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్స్‌లు) అర్ధ శతకాలు బాదారు. గుర్కీరత్ సింగ్(44), యువరాజ్(22 బంతుల్లో 31 టౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) పర్వాలేదనిపించారు. రాయుడు(5), సచిన్ టెండూల్కర్(10) నిరాశ పరిచారు. లంక బౌలర్లలో లక్మల్ 2.. ఉదాన, చతురంగ చెరో వికెట్ పడగొట్టారు. 

Also Read : షమీ చెత్త రికార్డ్.. తొలి ఓవర్ లోనే 11 బంతులు

లంక బ్యాటర్ల పోరాటం..  

ఎదుట కొండ లక్ష్యం ఉన్నప్పటికీ.. లంక బ్యాటర్లు తలొగ్గింది లేదు. వికెట్లు పడుతున్నా.. కావాల్సిన రన్‌రేట్ పెరుగుతున్నా ఎక్కడా మ్యాచ్ వదిలేసింది లేదు. నిజానికి చివరి బంతి వరకు మ్యాచ్ లంక చేతుల్లోనే ఉంది. గెలిచేశామన్న అత్యుత్సాహానికి పోయి చేజేతులా చేజార్చుకున్నారు. చివరి 8 బంతుల్లో లంక విజయానికి కావలసింది.. 10 పరుగులు. చిన్న బౌండరీలు.. అప్పటికే అలసిపోయిన భారత బౌలర్లు.. అయినప్పటికీ, లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు.

లంక బ్యాటర్లలో కుమార్ సంగక్కర(51), జీవన్ మెండిస్(42), అసేల గుణరత్నే(37), లాహిరు తిరిమన్నే(24), ఇసురు ఉదాన(23) పరుగులు చేశారు. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ 3 వికెట్లు పడగొట్టగా.. వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, ధవల్ కులకర్ణి త్రయం రెండేసి వికెట్లు తీసుకున్నారు. 

ఈ టోర్నీలో టీమిండియా తదుపరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. మంగళవారం(ఫిబ్రవరి 25) రాత్రి7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.