మగవాళ్లతో పోటీపడి ఆడవాళ్లు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఆమె కష్టానికి గుర్తింపుగా మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే చేసుకుంటున్నారు. మరి మగవాళ్ల త్యాగానికి గుర్తింపు ఉండక్కర్లేదా?. అందుకే మెన్స్ డే జరుపుతున్నారు. అలాగని ఇది మహిళా దినోత్సవానికి పోటీగానో.. లేదంటే ఆడవాళ్లకు వ్యతిరేకంగానో నిర్వహిస్తోంది కాదు. మగవాళ్ల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉంటే తప్పేంటి?.. అనే ఆలోచన నుంచి పుట్టింది.
కుటుంబం కోసం.. సమాజం కోసం త్యాగం :
కుటుంబం, సమాజం కోసం మగవాళ్లు చేస్తున్న త్యాగాల్ని, సాధిస్తున్న విజయాల్ని గుర్తు చేసుకోవడమే 'మెన్స్ డే' ఉద్దేశం. నవంబర్ 19వ తేదీ ప్రత్యేకించి మగవాళ్లకు సెలవంటూ ఏం ఉండదు. వాళ్ల కోసం కొన్ని లక్ష్యాల్ని నిర్దేశించుకుంటారు. జెండర్ ఇక్వాలిటీ ప్రచారం మెన్స్ డే ప్రాథమిక లక్ష్యం. పాజిటివ్ రోల్ మోడల్స్ (మగవాళు మాత్రమే) ప్రచారం చేయడం, వాళ్ల విజయాలను మగవాళ్లంతా కలిసి సెలబ్రేట్ చేసుకోవడం ఈ రోజు ప్రత్యేకతలు. అంతేకాదు మగవాళ్ల ఆరోగ్యం, ఎదుర్కొంటున్న సమస్యలు, ఒత్తిళ్లు. ఇతర సమస్యలపై ప్రత్యేకంగా చర్చిస్తారు. అన్నింటికీ మించి సొసైటీలో మగాళ్లంటే దుర్మార్గులు.. అని కొందరిలో ఉన్న భావనను తొలగించడం కోసం మెన్స్ డే జరుపుతున్నారు. మరి 'ఈ డే ఎవరు నిర్వహిస్తారు' అంటారా?.. ఇంటర్నేషనల్ మెన్స్ డేకి ఐక్యరాజ్య సమితి ఆమోద ముద్ర ఉంది. యునెస్కో సహకారంతో కొన్ని దేశాల్లోని ఎన్జీవోలు, మరికొన్నిదేశాల్లో ఏకంగా ప్రభుత్వాలే అధికారికంగా మెన్స్ డేను నిర్వహిస్తున్నాయి.
ఫ్రెష్ థీమ్ తో.. :
2001 నుంచి మెన్స్ డే ఒక్కొక్క నేపథ్యాన్ని ముందుకు తీసుకువస్తోంది. 'నేటి పురుషుడే... రేపటి భవిష్యత్తు', 'శాంతి'.. ఇలా ఒక్కో ఏడాది ఒక్కో థీమ్ తో జరుపుతున్నారు. మెన్స్ డే- 2024 కోసం Positive Male Role Models.. పాజిటివ్ మేల్ రోల్ మోడల్స్.. అనే థీమ్ ఇచ్చారు. పురుషుల మానసిక ఆరోగ్యం గురించి బహిరంగ చర్చించటం.. బహిరంగంగా మాట్లాడటం.. పురుషుల మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం వంటి అంశాల ప్రాముఖ్యత వివరిస్తుంది ఈ ఏఢాది థీమ్. మగాళ్లు అభివృద్ధి చెందడానికి.. వారికి సహాయ సహకారాలు అందించే విధంగా సరైన వాతావరణాన్ని సృష్టించడం 2024 మెన్స్ డే లక్ష్యంగా నిర్ణయించారు. ఈసారి మెన్స్ డే ప్రత్యేకత ఇదే..
అలా మొదలైంది :
మహిళల కోసం ప్రత్యేకంగా ఒకరోజు ఉండటం... 'మనుషులందరూ సమానం' అనే సిద్ధాంతాన్ని బ్యాలెన్స్ లేకుండా చేసింది. దీంతో మగవాళ్లకూ ఒక రోజు ఉండాలని భావించారు కొందరు మేధావులు. యూఎస్ కన్సాస్లోని మిస్సోర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ థామస్, సమాజానికి మగవాళ్లు చేస్తున్న సేవల్ని అభినందించేందుకు ఒక రోజు అవసరం అని భావించాడు. మగాళ్లు కూడా మనుషులే. అలాంటప్పుడు వాళ్లకు ఒక గౌరవప్రదమైన రోజు అవసరం. ఈ ఆధునిక యుగంలో అది ఇంకా అట్టడుగునే ఉండిపోవడం బాధాకరం అని థామస్ తన రచనల్లో స్పష్టం చేశారు. చివరికి ఆయన ఆధ్వర్యంలోనే ఫస్ట్ టైం 1992, ఫిబ్రవరి 7న ఇంటర్నేషనల్ మెన్స్ డే జరిగింది. దక్షిణ యూరప్ కి చెందిన మాల్టా దీవి మాత్రం ఈ ఉత్సవాల్ని 1994 నుంచి రెగ్యులర్ గా నిర్వహిస్తోంది. అయితే ప్రజెంట్ ప్రపంచం మొత్తం ఫాలో అవుతున్న 'మెన్స్ డే'కి మాత్రం ట్రినిడాడ్ - టొబాగో కారణం. డాక్టర్ జెరోమో తిలక్ సింగ్ అనే వ్యక్తి.. ట్రినిడాడ్ -టొబాగోలో అక్రమంగా జైలు పాలైన మగవాళ్ల కోసం ఉద్యమించాడు. మగవాళ్ల సమస్యలతోపాటు హక్కుల గురించి కూడా అతను అవగాహన ర్యాలీలు నిర్వహించాడు.
తిలక్ సింగ్ తండ్రి పుట్టిన రోజు నవంబర్ 19. అదేరోజు ట్రినిడాడ్ టొబాగో టీమ్ వరల్డ్ కప్ సాకర్ టోర్నీకి ఎంపికైంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకున.. నవంబర్ 19ని మగవాళ్ల రోజుగా నిర్వహించారు. 1999లో ఐక్య రాజ్య సమితి అదే రోజున 'మెన్స్ డే' నిర్వహించుకునేందుకు ఆమోదం తెలిపింది. 80కి పైగా దేశాలు.. ఇప్పుడు మెన్స్ డే నిర్వహిస్తున్నాయి. ఆ లిస్టులో భారతదేశం కూడా ఉంది. కానీ, మన దగ్గర ఇదొక చిన్న విషయం. కొందరు మగవాళ్లే దీన్ని జోక్ గా ఫీలవుతుంటారు. 'మహిళలు తమ రోజుని ఎంత ప్రత్యేకంగా జరుపుకుంటారో.. సమస్యల గురించి ఎంత బాగా చర్చిస్తారో.. మెన్స్ డే రోజు మగవాళ్లు కూడా అదే స్థాయిలో చర్చించాలన్నది కొందరు జెంటిల్ మెన్స్ అభిప్రాయం.
=== V6 వెలుగు, లైఫ్