![ప్రపంచ పర్వతాల దినోత్సవం](https://static.v6velugu.com/uploads/2024/01/international-mountain-day-2024_tBh3guQTPW.jpg)
ప్రపంచ పర్వతాల దినోత్సవాన్ని డిసెంబర్ 11న నిర్వహించారు. 2023 ఏడాది థీమ్ రీస్టోరింగ్ మౌంటేన్ ఏకో సిస్టమ్. 2030 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా పర్వత ప్రాంత ప్రజల పురోభివృద్ధికి తగిన గమ్యాలు నిర్దేశించుకుని ప్రచారం చేయడం ప్రపంచ పర్వతాల దినోత్సవం ముఖ్యోద్దేశం. సుమారు 110 కోట్ల జనాభాకు పర్వతాలు, పర్వతపాద భూభాగాలు ఆవాస స్థానంగా ఉన్నాయి. వీరిలో 90శాతానికి పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే నివసిస్తున్నారు. మొత్తం మానవాళిలో సగానికి పైగా పర్వత పర్యావరణ వ్యవస్థల నుంచి లభిస్తున్న నీటి వనరులపై ఆధారపడి బతుకుతున్నారు.
అందుకే యునెస్కో వీటిని ప్రపంచ నీటి కోటలు(వాటర్ టవర్స్)గా అభివర్ణించింది. ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో అనేకం పర్వతాల నుంచి వచ్చే మంచినీటిపైనే ఆధారపడ్డాయి. జీవనదుల పుట్టుక పర్వత ప్రాంతాల్లోనే చోటు చేసుకుంది. విశ్వవ్యాప్తంగా ఉన్న కీలకమైన జీవవైవిధ్య ప్రాంతాల్లో 30 శాతం పర్వతాల్లోనే ఉన్నాయి. జల, సౌర, పవనశక్తి తదితర వనరులకు ఇవి కేంద్రస్థానాలు.
పర్వత వ్యవసాయంలో ఆచరించే పద్ధతులు మైదాన ప్రాంతాల వ్యవసాయ పద్ధతుల కంటే అతి తక్కువ కర్బన ఉద్గారాలను విడుదల చేస్తూ నేటికీ శతాబ్దాల నాటి సుస్థిరాభివృద్ధి నమూనాలుగా ఉన్నాయి.