అంతర్జాతీయ సంస్థలు అయిన ఐక్యరాజ్యసమితి, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంక్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, యూఎన్సీసీసీ, యునెస్కో వంటివి కూడా అభివృద్ధి చెందిన దేశాల అదుపు ఆజ్ఞలతో నడుస్తూ, ఇతర దేశాలకు న్యాయం చేయడంలో విఫలమవుతున్నాయి. విమర్శల పాలవుతున్న ఈ సంస్థలు ఇకనైనా తమ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసేలా భారత్ ఒత్తిడి తేవాలి.
డబ్లూహెచ్ఓ సాఫల్యం తక్కువే
కొన్ని విషయాలు పరిశీలన చేస్తే.. ఇటీవల కాలంలో ప్రపంచాన్ని వణికించిన, ఇంకా వణికిస్తున్న ‘కరోనా వైరస్’ ఎలా, ఎక్కడ ఉద్భవించింది అనే విషయం డబ్ల్యూహెచ్ఓ నేటికీ తేల్చలేకపోవడం తాజా ఉదాహరణ. సహజంగా కరోనా వైరస్ పుట్టిందా, లేక కృత్రిమంగా సృష్టించిందా అని తేల్చలేకపోవడం నిజంగా నేటికీ అందరినీ వేధిస్తున్న ప్రశ్న. ఇదే అదనుగా భావించిన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డబ్ల్యూహెచ్ఓ కు నిధులు తగ్గించడంతో, నిధుల లేమితో అనేక దేశాల్లో చేపట్టవలసిన ఆరోగ్య, వ్యాక్సినేషన్ కార్యక్రమాలు నిలిచిపోయాయి.
చైనా కూడా కరోనా విషయంలో సరైన సమాచారం అందివ్వకపోవడం శోచనీయం. ముఖ్యంగా పేద దేశాలు, ఆఫ్రికా దేశాల ప్రజలకు ఎంత నష్టం వాటిల్లిందో చెప్పలేని స్థితి. మన భారతదేశమే అనేక దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందించింది. అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక సహకారంతో నడిచే ఇటువంటి అంతర్జాతీయ సంస్థలు నేడు దిక్కుతోచని స్థితిలో ఉంటున్నాయి. దీంతో వీటి లక్ష్యాలు గాలిలో దీపంలా మారుతున్నాయి.
యూఎన్ఓ పాత్ర నామమాత్రం
ఇక ప్రపంచ పర్యావరణాన్ని చూసే సంస్థ యుఎన్సీసీసీ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ‘కాప్’ సదస్సు నిర్వహిస్తూ ఆయా సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు నేటికీ ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేయడం లేదు. 2012లో కార్బన్ ఉద్గారాలు తగ్గించాలి అని తీసుకున్న ‘క్యోటో ప్రోటోకాల్’ నిర్ణయం నేటికీ అమలు కావడం లేదు. గతంలో ఇరాక్, వియత్నాం, క్యూబా, లిబియా, ఆఫ్గనిస్తాన్, ఇతర కొన్ని గల్ఫ్ దేశాలపై అమెరికా దాడులు, పెత్తందారీ విధానాన్ని ఐక్యరాజ్యసమితి కట్టడి చేయలేకపోయింది. ఇక తాజాగా రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్ని అరికట్టడంలో కూడా నేటికీ ఐక్యరాజ్యసమితి సరైన చర్యలు చేపట్టలేకపోయింది. దీంతో ఈ సంస్థ పైనా ప్రజలకు విశ్వాసం సన్నగిల్లుతుంది.
విశ్వగురు పాత్ర పోషించాలి
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా, వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న మన భారతదేశం తాజాగా ‘ జి-20’ ప్రధాన బాధ్యతలు చేపట్టింది. సుమారు 85 శాతం ప్రపంచ జీడీపీ కలిగిన ఇరవై దేశాలు, ప్రపంచంలో మూడవ వంతు జనాభా కలిగి 75 శాతం వ్యాపార సామర్థ్యం కలిగిన జీ-20 దేశాలకు నాయకత్వం వహిస్తున్న నేటి భారతదేశం కొన్ని విషయాల్లో నిర్ణయాత్మక శక్తిగా మారుతుంది. వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అనే నినాదంతో తలకెత్తుకున్న మన భారతదేశం ప్రపంచ భవిష్యత్తును మార్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలి.
ప్రస్తుతం ప్రపంచాన్ని పీడిస్తున్న పేదరికం, పర్యావరణ సమస్యలు, ఆకలి కేకలు, ఉగ్రవాదం, ఆర్థిక అసమానతలు, ఆర్థిక మాంద్యం, సైనిక పోరు, ఆధిపత్య ధోరణి, నిరుద్యోగం, నీటి కొరత, అడవుల నరికివేత, ప్రకృతి వనరుల దోపిడీ, వివిధ కాలుష్యాలు, కుల, మత,జాతి, లింగ, భాషా, ప్రాంతీయ అసమానతల వంటి సమస్యలపై మంచి అవగాహనతో శాశ్వత ప్రాతిపదికన మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా తమ సామర్థ్యాన్ని ప్రపంచ చరిత్రలో ( నాటు నాటు పాటకి అంతర్జాతీయ ఆస్కార్ అవార్డు అందుకుని తెలుగు సినిమా చరిత్ర సృష్టించినట్లు) చిర స్థాయిగా నిలిచేటట్లు చేయాలి.
ఇప్పటికే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ రూపుదిద్దుకుంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముఖ్యంగా అంతరిక్ష పరిశోధనలో, ఫార్మా రంగంలో, సాఫ్ట్వేర్ రంగంలో ముందుకు సాగుతున్నది. అయితే కొన్ని అంతర్గత లోపాలు, మతపరమైన అంశాలు, అణచివేత ధోరణులు సవరించుకుంటూ, ప్రపంచ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయటంలో జి-20 సారథ్యంలో మంచి నిర్ణయాలు తీసుకుని, అంతర్జాతీయ సంస్థలకు, దేశాలకు దీటుగా భారత్ ఉంటుంది అని ఆశిద్దాం. జి-20 సారథ్యం ద్వారా ప్రపంచ ప్రజలకు నూతన జవసత్వాలు ఇద్దాం. విశ్వగురు అనే ఆశయం నెరవేరుతుంది అని భావిద్ధాం.
సంపన్న దేశాల పెత్తనంలో సంస్థలు
ప్రపంచ కార్మిక సంస్థ కూడా, వివిధ దేశాల్లో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలపై నోరు మెదపకుండా ఉంటున్నది. పని ప్రదేశాల్లో సరైన సౌకర్యాలు లేకపోయినా, సరైన వేతనాలు ఇవ్వకపోయినా, మహిళలు, బాలికలపై దాడులు జరుగుతున్నా, పనిగంటలు పెంచుతూ యాజమాన్యం శ్రమదోపిడి చేస్తున్నా, నియమ నిబంధనలు పాటించకున్నా ఐఎల్ఓ తగు రీతిలో స్పందించకపోవడంతో ఈ సంస్థ పనితీరుపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐఎమ్ఎఫ్, వరల్డ్ బ్యాంక్ అభివృద్ధి చెందిన దేశాలు చెప్పినట్లు, వారి చెప్పుచేతల్లో ఉన్న దేశాలకు ఆర్థిక సహకారం అందిస్తుంటాయి.
అధిక వడ్డీలు విధిస్తూ పేద, వర్ధమాన దేశాలకు ఋణాలు అందించటం జరుగుతుంది. దీంతో ఆ దేశాలు అన్నీ జీవితాంతం వారి కనుసన్నల్లో నడిచే పరిస్థితి. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, పాక్ దేశాలు తాజా ఉదాహరణ. ప్రపంచ దేశాలు అన్నీ సమానంగా అభివృద్ధి సాధించాలి అనే లక్ష్యం కోసం పనిచేసే ఈ అంతర్జాతీయ సంస్థల ఆశయాలు అన్నీ అడియాశలు అవుతున్నాయి. దీని అంతటికీ ప్రధాన కారణం ఈ అంతర్జాతీయ సంస్థలు నేటికీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఐదు లేదా ఆరు దేశాలు ఇచ్చే ఆర్థిక సహకారం మీదనే ఆధారపడి ఉండటం ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఈ సంస్థల ప్రధాన కార్యాలయాలు యూరప్, అమెరికా దేశాల్లో ఉంటాయి. దాదాపు అన్ని అర్హతలు ఉన్నా, భారత్కు భద్రతామండలిలో ఇప్పటికీ శాశ్వత సభ్యత్వం ఇవ్వకపోవడం గమనార్హం. - ఐ. ప్రసాదరావు, సోషల్ ఎనలిస్ట్