- ఈఎంఆర్సీ డైరెక్టర్‌ను అభినందించిన ఓయూ వీసీ
ఓయూ, వెలుగు: యూజీసీ-– సీఈసీ16వ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఓయూలోని ఎడ్యుకేషన్ అండ్ మల్టీమీడియా రీసర్చ్ సెంటర్ (ఈఎంఆర్సీ ) సత్తా చాటింది. డిసెంబర్ 4 నుంచి 6 వరకు రాజస్థాన్ జోధ్‌పూర్‌లో జరిగిన ఫెస్టివల్‌లో అవార్డు గెలుచుకుంది. దీంతో ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతిరెడ్డిని ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ బుధవారం అభినందించారు. సమాజానికి దూరంగా అడవుల్లో బతుకుతున్న గుత్తికోయ చిన్నారులపై తీసిన “ రీచింగ్ ది అన్ రీచ్డ్ ” షార్ట్ ఫిల్మ్అభివృద్ధి విభాగంలో ట్రోఫీ, ప్రైజ్ మనీ అందుకుందన్నారు. అలాగే మానవహక్కుల విభాగంలో స్క్రీనింగ్‌కు ఎంపిక కావడం ఓయూకు గర్వకారణమని ఈ సందర్భంగా వీసీ అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఫెస్టివల్‌లో వచ్చిన ప్రైజ్ మనీ రూ.50 వేలను వీసీ ప్రొఫెసర్ కుమార్ చేతుల మీదుగా గుత్తి కోయ చిన్నారుల విద్యాభ్యాసం కోసం శ్రమిస్తున్న సంతోష్ ఇస్రం మిత్ర బృందానికి విరాళంగా అందించారు. ఓయూ ఈఎంఆర్సీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ వేదికపై మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థులపై తీసిన షార్ట్‌ఫిల్మ్ కు గుర్తింపు రావటం పట్ల ప్రోగ్రాం ప్రొడ్యూసర్, ఈఎంఆర్సీ డైరెక్టర్ రఘుపతి ఆనందం వ్యక్తం చేశారు. తమకు దక్కిన అవార్డు సామాజిక బాధ్యతను మరింత పెంచిందన్నారు. తమ కష్టానికి అంతర్జాతీయ గుర్తింపు రావటం సంతోషంగా ఉందని సంతోష్ ఇస్రం, శశింధర్ రెడ్డి, దూడపాక నరేశ్, చందా గున్మంతరావు తెలిపారు. ఓయూ నేర్పిన సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నామన్నారు.