- అయినప్పటికీ కనిపించని పెద్ద పులి జాడ
- నేడు అంతర్జాతీయ పెద్ద పులుల దినోత్సవం
జన్నారం,వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్లో పులుల జాడ కనిపించడంలేదు. వాటి రాకపోకలు సాగించేందుకు అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ఈ వైపు రావడంలేదు. జులై 29న పులుల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా హడావిడిగా కార్యక్రమాలు నిర్వహించే ఫారెస్ట్ ఆఫీసర్లు.. వాటిని రప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. నాలుగేండ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 26 పెద్ద పులులున్నాయని ప్రకటించింది. అందులో కవ్వాల్టైగర్జోన్ఫరిధిలో 6 నుంచి 8 వరకు ఉన్నట్లు అంచనా వేసింది. కానీ కొంత కాలంగా వాటి జాడ కనిపించడమే లేదు.
కలప స్మగ్లింగ్‌తో..
కేంద్ర ప్రభుత్వం 2012 ఏప్రిల్10న కవ్వాల్రిజర్వ్ ఫారెస్ట్‌ను టైగర్ జోన్‌గా ఏర్పాటు చేస్తూ జీవో నెం.27 విడుదల చేసింది. అప్పటికి కవ్వాల్ పరిధిలో పెద్దపులులు లేవు. అంతకుముందు మహారాష్ట్ర తాడోబాలోని టైగర్ రిజర్వ్ నుంచి కవ్వాల్ అటవీ ప్రాంతంలోకి రాకపోకలు సాగించేవి. కాలక్రమేణా అడవిలో కలప స్మగ్లింగ్ పెరిగిపోవడం, అలికిడి ఎక్కువ కావడంతో పులులు ఈ వైపునకు రావడం మానేశాయి. టైగర్ జోన్ ఏర్పడిన మూడేండ్లకు 2015లో దొంగపెల్లి, కవ్వాల బీట్‌లో పులి సంచరించినట్టు అడుగులను అటవీ అధికారులు గుర్తించారు. 2016లో కడెం అడవిలో ఓ ఆవుపై దాడి చేయడంతో పులి సంచరిస్తున్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. కానీ కొద్ది రోజులకే ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం వైపు వెళ్లి అక్కడి నుంచి మహారాష్ట్రకు రాకపోకలు సాగిస్తున్నాయి.
తాడోబాలో 97 పెద్ద పులులు
కవ్వాల్ టైగర్ జోన్‌కు సమీపంలోని మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లాలో ఉన్న తాడోబా టైగర్ జోన్లో 97 పులులున్నట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్ టీసీఏ) అంచనా వేసింది. 625.82 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న తాడోబా టైగర్ జోన్లో 97 పులులుంటే.. 892.23 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ఉన్న కవ్వాల్ టైగర్ జోన్లో ఒక్క పులి కూడా లేకపోవడం ప్రశ్నార్థకంగా మిగిలింది.
చేయని ప్రయత్నం లేదు..
కవ్వాల్ టైగర్ జోన్లో పులి ఆవాసం ఏర్పాటు చేసుకోవడానికి ఫారెస్ట్ ఆఫీసర్లు దాని ఆహారం కోసం శాకాహార జంతువుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. అడవిలో లభించే ఆహారమే కాకుండా అదనంగా900 హెక్టార్లలో గడ్డి క్షేత్రాలను (గ్ర్యాస్ ల్యాండ్)ను జన్నారం అటవీ డివిజన్లోని తాళ్లపేట రేంజ్మహ్మదాబీట్, ఇందన్‌పెల్లి రేంజ్లో పెంచుతున్నారు. దీంతో జోన్ పరిధిలో శాకాహార జంతువుల సంఖ్య పెరిగింది. పెరిగిన గడ్డి క్షేత్రాల్లో మేసేందుకు వచ్చే వన్యప్రాణులను వేటాడేందుకు పులికి అనువుగా ఉంటుందని అధికారులు భావించినప్పటికీ కవ్వాల్ వైపు పులులు
అడుగుపెట్టడంలేదు. పులులను ఆకర్శించేలా అధికారులు మరిన్ని ప్రయత్నాలు చేయాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.