కవర్ స్టోరీ : వెకేషన్ @ విదేశం.. వీసా లేకుండా ఈ దేశాలకు వెళ్లొచ్చు

కవర్ స్టోరీ : వెకేషన్ @ విదేశం.. వీసా లేకుండా ఈ దేశాలకు వెళ్లొచ్చు

విజయ్​కి కొత్త ప్లేస్​లంటే చాలా ఇష్టం. తను చేసే జాబ్​ నుంచి ఫ్రీ టైం దొరికినప్పుడల్లా టూర్లకు వెళ్తుంటాడు. శ్రీజకి ఇన్​స్టాగ్రామ్​లో అందమైన చోటు కనిపిస్తే చాలు.. వెంటనే అక్కడికి వెళ్లి ఫొటోలకు పోజులిస్తుంటుంది. ఫ్యామిలీతో కలిసి టూర్​ వెళ్లాలనుకునే రంజిత్​.. ఇంట్లో వాళ్లు ప్లాన్ చేయగానే లాంగ్​ లీవ్​ పెట్టి మరీ వెళ్తుంటాడు. అయితే, వీళ్ల ముగ్గురి వ్యక్తిత్వాలు, చేసే ఉద్యోగాలు వేరైనా.. టూర్ విషయంలో వాళ్ల ఆలోచన మాత్రం ఒకటే. ఎందుకంటే ఎలాగూ కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకుంటున్నాం. 

అలాంటప్పుడు అదే ఖర్చుతో కొత్త దేశానికి వెళ్తే బాగుంటుంది కదా! అనేది వీళ్ల ఆలోచన. ప్రస్తుతం చాలామంది ఆలోచన కూడా ఇదే. ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలి అనిపిస్తుంటుంది.  వెకేషన్, పిక్నిక్, టూర్​, ట్రిప్​.. పేర్లు ఏవైనా గానీ ఓ సరదా ప్రయాణం వెలకట్టలేని సంతోషాన్నిస్తుంది. మరపురాని జ్ఞాపకాలను అందిస్తుంది. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అందుకే.. టైం దొరికితే ఏడాదికి ఒకసారైనా టూర్​కి వెళ్లమని చెప్పేవాళ్లు ఎక్స్​పర్ట్స్. అయితే ఇది గతంలో మాట.

ఇప్పుడు... ట్రెండ్ మారింది. టైం కేటాయించుకుని మరీ టూర్​లకు వెళ్తున్నారు చాలామంది. సోలో ట్రిప్​, ఫ్రెండ్స్​ టూర్, ఫ్యామిలీ వెకేషన్​.. ఇలా రకరకాల పేర్లతో ఏడాదికి మూడు లేదా నాలుగు సార్లు వెళ్లేవాళ్లు కూడా ఉన్నారు. అయితే, ప్రపంచ దేశాల పర్యాటకులు ఒక ఎత్తు. భారతీయులు మరో ఎత్తు అనేలా ఉంది ఇప్పుడు పరిస్థితి. దానికి కారణం భారతీయులు టూర్​ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. పైగా విదేశాలకు టూర్​లు వేసేవాళ్లు ఎక్కువని రిపోర్ట్​లు చెప్తున్నాయి. మరి మనవాళ్లు టూర్​ అంటే ఎందుకు విదేశాలకే ఓటు వేస్తున్నారు అనేది తెలుసుకోకపోతే ఎలా?

మనదేశంలోని టూరిస్ట్​ ప్లేస్​లు ఎప్పుడూ పర్యాటకులతో కళకళలాడుతుంటాయనే విషయం తెలిసిందే. కాకపోతే చాలా వరకు ఆధ్యాత్మిక ప్రదేశాలు కావడంతో మధ్య వయసు నుంచి వృద్ధుల వరకు ఫ్యామిలీలతో కలిసి వెళ్తుంటారు. అయితే, ఇప్పుడు అలా లేదు. కొవిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-–19 తర్వాత యువతలో కూడా ట్రావెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఆసక్తి పెరిగింది. ఇండియాలో టూరిస్ట్​ ప్లేస్​లకు  వెళ్లడమే కాకుండా విదేశాలకూ వెళ్లేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే... ఐదేండ్ల ముందు అంటే 2018–2019లలో ఒక నెలకు విదేశీ టూరిజం ఖర్చు 3,300 కోట్లు. కాగా దానితో పోలిస్తే 2023–2024 డేటా షాక్​కి గురిచేస్తోంది. 

రిజర్వ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ) ఇటీవల విడుదల చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో విదేశీ ప్రయాణాల కోసం భారతీయులు చేస్తున్న ఖర్చు రూ. 12,500 కోట్లు అని తెలిసింది. అది ఒక్క నెలకు మాత్రమే కావడం గమనార్హం! ఈ లెక్కలు చాలు.. మనవాళ్లకు ప్రయాణాలు అంటే ఎంత ఇష్టమో చెప్పడానికి. వయసు భేదం లేకుండా అందరూ విదేశీ టూర్లకు వెళ్లడం వెనుక కారణాలేంటి? అని ఒకసారి పరిశీలిస్తే.. ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రధాన కారణాలు ఇవే.

వీసా ఇబ్బంది లేదు

విదేశాలకు వెళ్లాలంటే వీసా ఉండాలని తెలిసిందే. కానీ, కొన్ని దేశాలకు వీసా అవసరం లేదు అనే విషయం చాలామందికి తెలియదు. ఆ విషయంపై ఈ మధ్యకాలంలో అవగాహన పెరిగింది. దాంతో దూరదేశమైనా వీసా తలనొప్పులు లేకుండా వెళ్లిరావొచ్చు అనే ధీమా వచ్చింది. పైగా ఇతర దేశాన్ని చూసొచ్చామనే సంతృప్తి ఉంటుంది. అందుకే విదేశాలకు వెళ్లాలనుకుంటారనేది మొదటి రీజన్.

జర్నీ.. కొన్ని గంటలే 

ఇతర దేశాలంటే కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి వస్తుందని అనుకుంటారు. అయితే మన దేశానికి దగ్గర్లో ఉన్న దేశాలకు వెళ్లడానికి ఎక్కువ టైం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. రోజులో ఒక పూట జర్నీ చేసినా చాలు.. గమ్యస్థానానికి చేరుకోవచ్చు. ఈ కారణం చేత కూడా చాలామంది విదేశీ పర్యటనలు చేయాలనుకుంటున్నారు. 

తక్కువ ఖర్చుతో..

టూర్​లకు వెళ్లినప్పుడు ప్రయాణ ఖర్చుల కంటే అక్కడ ఉన్నన్ని రోజులు స్టే చేయడానికే ఎక్కువ ఖర్చు చేయాల్సివస్తుంది. దాంతో దూర ప్రాంతాలకు వెళ్తే అక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ ఉండాలి అనే ఆలోచనతో లగ్జరీ స్టే కోరుకోవడం సహజం. అయితే, లగ్జరీ అంటే ఖర్చుతో కూడిన విషయం కాబట్టి అసలు ఇతరదేశాలకు వెళ్లడం మీద ఆసక్తి చూపేవాళ్లు కాదు. కానీ, దగ్గర్లో ఉండే దేశాలకు వెళ్లడం వల్ల ఇది కూడా ఒక బెనిఫిట్. కజకిస్తాన్ వంటి దేశాల్లో హోటల్​లో స్టే చేయడానికి రెండు వేల నుంచి చార్జీలు మొదలవుతాయి. కాబట్టి ఖర్చు తగ్గే పని అంటే ఎంతదూరమైనా వెళ్లడానికి సిద్ధపడతారు మనవాళ్లు.

సినిమాల ప్రభావం!

ఇండియన్స్ మూవీ లవర్స్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే, ఇండియన్ టూరిస్ట్​ల మీద సినిమాల ప్రభావం ఉంటుందని తేలింది. అందుకు ఇవే ఉదాహరణలు.. బాలీవుడ్​ సినిమా ‘జిందగీ నా మిలేగీ దొబారా’లో స్పెయిన్ లొకేషన్స్ కనిపిస్తాయి. ఆ సినిమా ప్రభావం వల్ల 2011లో వీసా నిబంధనలు ఉన్నప్పటికీ 40 శాతం టూరిస్ట్​ల సంఖ్య పెరిగింది. అలాగే, యాభై ఏండ్లుగా సినిమాల్లో స్విట్జర్లాండ్ లొకేషన్స్ ఎక్కువగా చూస్తున్నారు ఆడియెన్స్. సినిమాల్లో చూసిన లొకేషన్స్​ని రియల్​ లైఫ్​లో ఎక్స్​పీరియెన్స్ చేయాలనే ఉద్దేశంతో చాలామంది స్విట్జర్లాండ్ వెళ్తున్నట్టు తెలిసింది. అంతేకాదండోయ్.. స్విస్ టూరిస్ట్​ బోర్డ్​ బాలీవుడ్ టూర్స్ పేరుతో ఆయా ప్రాంతాలకు కూడా వెళ్లే అవకాశం కల్పిస్తోందట. అంతేకాదు.. స్టార్​ హీరోలు ఆయా దేశాల టూరిజం ప్రమోషన్లలో భాగం కావడం కూడా టూరిస్ట్​లను ప్రభావితం చేయొచ్చు. 

ప్రజెంట్ సిచ్యుయేషన్ ఇది

ఇండియాలో ఏటా ఎక్కువ ఇంటర్నేషనల్​ టూర్స్​కి వెళ్లేవాళ్ల సంఖ్య గతంతో పోలిస్తే 32 శాతం పెరిగింది. మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ టాప్​లో ఉన్నాయి. అందులోనూ యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ వంటి దేశాలు స్టూడెంట్స్​ ఎక్కువగా ఎంచుకుంటున్నారు. యునైటెడ్ నేషన్​ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి ఏటా దాదాపు 50 మిలియన్ల మంది ఇండియన్స్ విదేశాలకు వెళ్తున్నారు. విదేశంలో అందమైన ప్రదేశాలు, చరిత్ర, వన్యప్రాణులు, కల్చర్, వెరైటీగా అనిపించే లోకల్ ఫుడ్, అడ్వెంచర్స్ వంటి వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. మనదేశంలో ఇలాంటివన్నీ ఉన్నప్పటికీ ఇతర దేశాల్లో వాటిని ఎక్స్​పీరియెన్స్​ చేయాలనే కోరిక ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో టూరిస్ట్​లను ప్రభావితం చేసే కారణాలు ఏవంటే...

    గతంలో అది సినిమాల ప్రభావం అనుకున్నా.. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్​ఫ్లుయెన్స్ పెరిగింది. చాలామంది బయటి దేశాలు వెళ్లి అక్కడ ఫొటోలు, వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తుంటారు. దీంతో చూసేవాళ్లకు కూడా అక్కడికి వెళ్లాలనే ఇంట్రెస్ట్ ఆటోమెటిక్​గా కలుగుతుంది. 
    మనదేశంలోని ఏదైనా టూరిస్ట్​ ప్లేస్​కి వెళ్లి అక్కడ లగ్జరీ హోటల్​లో రూం బుక్​ చేసుకోవాలంటే ఖరీదు చాలా ఎక్కువ. దానికి పెట్టే ఖర్చుతో ఒక విదేశం చూసి రావొచ్చు అనుకుంటారు. ఆ కారణంగా బడ్జెట్​ ఫ్రెండ్లీగా ఉండే విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు చాలామంది.  ఇందులో ఎక్కువగా పంజాబ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, తమిళనాడు వాళ్లు బడ్జెట్ సెలక్షన్ వైపు మొగ్గుచూపుతున్నారు.

    అడ్వెంచర్స్ చేసేవాళ్లకు సేఫ్టీ చాలా ముఖ్యం. ఈ విషయంలో ఇండియన్​ టూరిస్టులు ఇతరదేశాల వైపే మొగ్గుచూపుతున్నారు. మనదేశంలో స్కీయింగ్, బంగీ జంపింగ్, స్కై డైవింగ్, పారా సెయిలింగ్ వంటివి చేయాలంటే సరైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారో లేదోనని డౌట్ పడుతున్నారు. క్వీన్స్ టౌన్, సౌత్ ఆఫ్రికా దేశాలు ఇలాంటి అడ్వెంచర్స్​కు బెస్ట్ అని నమ్ముతున్నారు. 

    కొత్త ప్రదేశాలకు వెళ్తే కచ్చితంగా అక్కడి గుర్తుగా నచ్చిన వాటిని తెచ్చుకుంటారు. పైగా విదేశాలకు వెళ్తే ఫేమస్ బ్రాండ్ వస్తువులు తక్కువకే లభిస్తాయని అనుకుంటారు. అందుకే ఇక్కడ డిస్కౌంట్లు ఇచ్చినా బ్యాంకాక్, దుబాయ్, లండన్, అమెరికా వంటి దేశాల్లో షాపింగ్ చేయడం చాలా బెటర్ అని ఇప్పటికీ నమ్ముతున్నారు. 23 శాతం మంది షాపింగ్, లగ్జరీపై ఇంట్రెస్ట్​ చూపిస్తున్నారు. 

    విదేశాల్లో ఎంటర్​టైన్​మెంట్​కు సంబంధించి యూనివర్సల్ స్టూడియోస్, డిస్నీ ల్యాండ్, ఓషన్ పార్క్ వంటివి ఉంటాయి. అలాంటివి ఇండియాలో లేకపోవడం వల్ల ఫ్యామిలీతో కలిసి టూర్ వెళ్లాలనుకునేవాళ్లు విదేశాలకు ఓటు వేస్తున్నారు. 

    మూడింట ఒక వంతు మంది భారతీయులు నైట్ లైఫ్ ఉండే బ్యాంకాక్, పట్టాయా, కౌలాలంపూర్, అబుదాబి, హో చి మిన్ సిటీలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. 
    జపాన్, యూరప్, యుఎస్, దక్షిణ కొరియాలు జీరో క్యాన్సిలేషన్ ఫ్లైట్ బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు బెస్ట్ ఆప్షన్లుగా కనిపిస్తున్నాయి. యూఏఈ, థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్, యూరప్, యుఎస్​లో కూడా టూరిస్ట్​ పాలసీకి అధిక డిమాండ్ ఉంది.

    అంతర్జాతీయ పర్యటనలలో 55 శాతం విశ్రాంతి కోసం విదేశాలకు వెళ్తున్నారు. అందులో థాయిలాండ్ అగ్రస్థానంలో ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రయాణికులకు థాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రత్యేక అభిమానం ఉంది. యూఏఈ, యూరప్, ఇండోనేసియా, సింగపూర్, వియత్నాం కూడా ఫేమస్.

అప్పుడు అవి.. ఇప్పుడు ఇవి

ఆన్​లైన్ ట్రావెల్​ కంపెనీ మేక్​ మై ట్రిప్​ ‘హౌ ఇండియా ట్రావెల్స్ అబ్రాడ్​’ అనే పేరుతో ఈ మధ్య ఒక రిపోర్ట్ విడుదల చేసింది. అందులో ఇండియన్ టూరిస్ట్​లు ఎక్కువగా వెళ్లే పది దేశాల లిస్ట్​ ఇచ్చారు. అందులో మొదటిది కజకిస్థాన్, రెండోది అజర్ బైజాన్, మూడోది భూటాన్​ కాగా.. హాంగ్​కాంగ్, శ్రీలంక, జపాన్, మలేసియా, నేపాల్, రష్యా, సౌదీ అరేబియా వంటివి ఉన్నాయి. అయితే, ఈ రిపోర్ట్ చూస్తే, గతంతో పోలిస్తే ఇప్పుడు టూరిస్ట్​ల ఆలోచన మారిందని తెలుస్తోంది. 
ఒకప్పుడు ఒక దశాబ్దం పాటు వెస్టర్న్​ యూరప్, స్విట్జర్లాండ్ దేశాలకు మాత్రమే వెళ్లే ఇండియన్ టూరిస్ట్​లు 9 శాతం ఉండేవారని ఒక రిపోర్ట్ చెప్తోంది. అయితే, ఇప్పుడు అభివృద్ధి చెందుతోన్న దేశాలపై అట్రాక్షన్ పెరుగుతోందని తాజా రిపోర్ట్​ ద్వారా వెల్లడయ్యింది. ఈ లిస్ట్​లో ఉన్న అల్మాటి, బాకు వరుసగా 527 శాతం, 395 శాతం వృద్ధి రేటును కూడా సాధించాయి. అంతేకాదు.. ఆ విదేశాలకు బిజినెస్ క్లాస్ విమానాల కోసం చూసేవాళ్లు10 శాతం పెరిగారు. హాంకాంగ్, శ్రీలంక, జపాన్, సౌదీ అరేబియా, మలేసియా కూడా విలాసవంతమైన ప్రయాణాలు చేయడానికి మొగ్గు చూపే దేశాలుగా ఉన్నాయి. 

బడ్జెట్​ ఫ్రెండ్లీ టూర్స్

ఇండియన్స్ చాలావరకు బడ్జెట్ ఫ్రెండ్లీ టూర్లనే కోరుకుంటారు. కాబట్టి ఆయా దేశాలు అందుకు వెసులుబాటు కల్పించాయి. అందుకే టూరిస్ట్​లు పెరిగారు. ఇంకా ఎవరైనా విదేశాలు వెళ్లాలంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందనే ఆలోచనలో ఉంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే విదేశాలు ఎంచుకోవాలి. అలాంటి దేశాలు ఏమున్నాయంటే...  

శ్రీలంక 

శ్రీలంక టూరిజం డెవలప్​మెంట్ అథారిటీ విడుదల చేసిన డేటా ప్రకారం, ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల్లో మొత్తం 1.36 మిలియన్ల మంది పర్యటించారు. అందులో భారత్ నుంచి శ్రీలంకకు వెళ్లిన పర్యాటకులు దాదాపు 2.6 లక్షల మంది ఉండడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే పర్యాటకుల సంఖ్య 50.7 శాతం పెరిగింది. 2025 నాటికి మూడు మిలియన్ల విదేశీ పర్యాటకులను అట్రాక్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుంది. రమణీయమైన ప్రదేశాలతో, సుందరమైన ప్రకృతి సోయగాలతో అట్రాక్ట్ చేస్తుంది శ్రీలంక. రామాయణంతో ముడిపడి ఉండడంతో భక్తులు మరింత ఆసక్తి చూపిస్తుంటారు. శ్రీలంకకు వెళ్లాలంటే ఈ–వీసా ఉండాలి. దాని గడువు 30 రోజుల వరకు ఉంటుంది. అలాగే, ప్రయాణానికి డైరెక్ట్ ఫ్లైట్​ అయితే హైదరాబాద్​ నుంచి కొలొంబోకు రూ.5000 నుంచి 7,500 రూపాయలు ఖర్చవుతుంది. చెన్నై నుంచి రూ.8000.

నేపాల్

ఎవరికైనా మంచు పర్వతాలను చూస్తే ముచ్చటేస్తుంది. ఆ ఎక్స్​పీరియెన్స్​ కోసం నేపాల్​ టూర్ బెస్ట్​. పైగా అది ట్రెక్కింగ్​కి బెస్ట్ ప్లేస్ కూడా. నేపాల్ వెళ్లాలంటే ఈ–వీసా ఉంటే చాలు. పాస్​పోర్ట్​, ఓటర్ కార్డ్ తప్పనిసరి. ప్రయాణానికి డైరెక్ట్ ఫ్లైట్ అయితే న్యూఢిల్లీ, ముంబై నుంచి ఖట్మాండుకి రూ.8000. హైదరాబాద్​ నుంచి అయితే రూ. 6000 నుంచి రూ. 9,200 మధ్య ఉంది. అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య వెళ్తే టూర్ ఎంజాయ్ చేయొచ్చు. 

మలేసియా

ఐలాండ్​లు, బీచ్​లు, అడ్వెంచర్స్ స్పాట్స్ మలేసియా టూరిజాన్ని అట్రాక్ట్ చేస్తాయి. మలేసియా కల్చర్, ప్రకృతి అందాలు చూస్తూ.. ఎంజాయ్ చేయొచ్చు. మలేసియాకు కూడా ఈవీసా ఉంటే చాలు. తక్కువ ధరతోనే టూర్​ వేయొచ్చు. సినిమాల్లో మలేసియా రిఫరెన్సులు ఎక్కువ కనిపిస్తుంటాయి. కాబట్టి ఇండియన్స్ ఎక్కువగా మలేసియాను సందర్శించడానికి ఇష్టపడుతుంటారు. అక్కడి ఫేమస్ బీచ్​లు, సిటీలను చూడాలంటే మలేసియా విజిట్ చేయాల్సిందే. న్యూఢిల్లీ, కొచ్చి, భువనేశ్వర్, అహ్మదాబాద్, అమృత్ సర్, వైజాగ్, త్రివేండ్రం నుంచి కౌలాలంపూర్ వెళ్లాలంటే రూ.8000. అదే హైదరాబాద్​ నుంచి అయితే రూ. 7,700 టికెట్ ఛార్జీ.

సింగపూర్

సమ్మర్ లో చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు చాలా మంది. అయితే కొందరు మాత్రం దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు అయిన జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లడాఖ్ వంటి చల్లని ప్రదేశాలకు వెళ్ళడానికి ఆసక్తి కనపరుస్తుంటారు. మరికొందరు మాత్రం ఇతర దేశాలకు వెళ్లి సేదతీరాలని భావిస్తారు. ఆలాంటి దేశాల్లో టాప్​ లిస్ట్​లో సింగపూర్​ కూడా ఉంటుంది. ఇండియన్స్ ఎక్కువగా వెళ్లే విదేశాల్లో ఇది ఒకటి. గత ఏడాది సింగపూర్ టూరిజం బోర్డ్ (ఎస్​టీబీ) డేటా ప్రకారం భారత్​ నుంచి 6.12లక్షల మంది టూరిస్ట్​లు వెళ్లినట్టు పేర్కొంది. ఇక్కడకు ఇండియన్స్ ఎక్కువగా వెళ్లడానికి ఖర్చు తక్కువ అనేది కూడా ఒక కారణం. ఇండియా నుంచి సింగపూర్ వెళ్లాలంటే ఈవీసా తప్పనిసరి. చెన్నై, భువనేశ్వర్, కొయంబత్తూర్, త్రివేండ్రం, అమృత్ సర్, తిరుచిరాపల్లి నుంచి అయితే రూ. 8000. హైదరాబాద్​ నుంచి అయితే రూ. 8000 నుంచి రూ.9000.

ఒమన్

ఒమన్ ఎడారి దేశం అయినా.. అక్కడ ఉన్న సాంస్కృతిక వారసత్వ కట్టడాలు అట్రాక్ట్ చేస్తాయి. అలాగే ప్రధాన నగరాలైన మస్కట్ వంటి ప్రదేశాలు చూపరులను కట్టిపడేస్తాయి. ఒమన్ దేశానికి ఈ – వీసా ద్వారా వెళ్లొచ్చు. అక్కడ పర్యటించాలంటే ఆ దేశ టూరిజం గైడ్ లైన్స్ పాటించాలి. ఇక్కడికి వెళ్లాలంటే సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు బెస్ట్​ టైం. ముంబై నుంచి మస్కట్​కి డైరెక్ట్ ఫ్లయిట్ రూ. 8000. హైదరాబాద్​ నుంచి మస్కట్​కు రూ. 9,000  నుంచి. ఇవే కాకుండా మరి కొన్ని దేశాలకు కూడా తక్కువ ఖర్చుతోనే టూర్​కి వెళ్లొచ్చు. అది కూడా వీసా లేకుండానే. టూర్ వివరాలు, బుకింగ్స్ కోసం టూరిజం సైట్స్​లో చూడొచ్చు.

చివరి నిమిషంలో బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు

దాదాపు 50 శాతం అంతర్జాతీయ విమానాలు, 56 శాతం హోటల్ గదులు బయలుదేరడానికి 14 రోజుల కంటే ముందే బుక్ అవుతుంటాయి. ఒమన్, నేపాల్, యూఏఈ చివరి నిమిషంలో విమాన బుకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు ఫేమస్. అయితే ఖతార్, ఒమన్, అజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బైజాన్ హోటల్ రిజర్వేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ముందున్నాయి. 

క్లీన్​గా లేకపోవడం వల్లే  

గోవా లాంటి బీచ్​లు ఉండే ప్రదేశాలకు వెళ్లాలని చాలామంది కోరుకుంటారు. కానీ, అక్కడ చెత్తా చెదారంతో నిండిపోతే ఒక్క క్షణం కూడా ఉండాలనిపించదు. అలాగే, కేరళ, కోల్​కతా, సిమ్లా వంటి ప్రదేశాలకు వెళ్తే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువగా కనిపిస్తాయి. దీంతో మనదేశంలో అందమైన ప్రదేశాలకు వెళ్లాలనే ఆలోచనే చేయట్లేదు. 

కజకిస్తాన్​ 

ఇండియన్ టూరిస్ట్​ల కోసం కజకిస్తాన్​14 రోజుల వీసా ఫ్రీ పాలసీని 2022లోనే ఆమోదించింది. దీని ప్రకారం..  భారత పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోర్టు ఉంటే చాలు.180 రోజులలో ఒక భారతీయుడు మూడు సార్లు14 రోజులపాటు అక్కడ వీసా లేకుండా విహరించొచ్చు. అదీగాక ఇక్కడ ప్రయాణాలకు అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. ఢిల్లీ నుంచి కజకిస్తాన్​లోని అతి పెద్ద నగరమైన అల్మాటికి ఢిల్లీలో ఇండిగో, ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆస్తానా విమానాల్లో ప్రయాణం చేస్తే మూడు గంటలు మాత్రమే. మేక్​ మై ట్రిప్ కంపెనీ ఇచ్చిన రిపోర్ట్​లో కజకిస్థాన్ మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 

అంతేకాదు.. 2023లో భారత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి 28,300 ప్రయాణీకులు కజకిస్తాన్​ అందాలను చూసేందుకు వెళ్లినట్టు రిపోర్ట్​లు చెప్తున్నాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే ఇది ఏకంగా 400 శాతం అధికం! అని కజకిస్తాన్​ టూరిజం కమిటీ చైర్మన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డస్టన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైస్పెకొవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లడించారు. కజకిస్తాన్​లో హోటల్లో స్టే చేయాలంటే దాదాపు రూ. 5 వేల దాకా ఉంటుంది. అక్కడ చూడదగ్గ ప్రదేశాలు కజకిస్థాన్​లోని అతిపెద్ద నగరం అల్మాటి.1997 నుంచి రాజధానిగా ఉంది. ఈ నగరం టియాన్ షాన్ పర్వతాలకు సమీపంలో ఉంటుంది. ఈ దేశ అందాలను చూడాలంటే సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వేసవిలో మార్చి, ఏప్రిల్, మే నెలలు అనుకూలంగా ఉంటాయి.

అజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బైజాన్

అజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బైజాన్ టూరిజం బోర్డు ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు భారతదేశం నుంచి 1,40,000 మంది ప్రయాణికులను కలిగి ఉన్నట్లు వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే ఇది 2.7 రెట్లు ఎక్కువ. మేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మై ట్రిప్ రిపోర్ట్​ కూడా దీన్ని రెండో స్థానంలో పేర్కొంది. ఇక్కడ తూర్పు ఐరోపా, పశ్చిమ ఆసియా కూడలిలో దక్షిణ కాకసస్ ప్రాంతంలో ఉన్న బాకు తూర్పులోని అత్యంత పురాతన నగరాల్లో ఒకటి. ఇది గొప్ప చరిత్ర కలిగిన ఒక మనోహరమైన నగరం. అలాగే పురాతన చరిత్ర, సహజ ప్రకృతి దృశ్యాల సమ్మేళనానికి ప్రసిద్ధి చెందింది గోబస్తాన్ సిటీ. ఈ నగరం నడిబొడ్డున దాని పెట్రోగ్లిఫ్స్ ఉన్నాయి. ఇవి 2007లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి చేరాయి. 

భూటాన్

భూటాన్​.. ప్రకృతి అందాలకు నెలవు. అక్కడ పారొ, గ్యాంగ్టే, థింపూ, పునఖా, భుంథంగ్ పర్వత ప్రాంత అందాలు చూపు తిప్పుకోనివ్వవు. పురాతన బౌద్ధ సాంప్రదాయ కట్టడాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. హనీమూన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా ఇది అనుకూలమైన ప్రదేశం. వేసవిలో ఈ ప్రాంతం ఎంతో చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇండియా, నేపాల్ ప్రజలు భూటాన్ వెళ్లేందుకు వీసా అక్కర్లేదు. అయితే, అక్కడి ఏజెన్సీలు, హోటల్ ద్వారా మాత్రమే దేశాన్ని సందర్శించాలి. కానీ, భూటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ రోజులు ఉండటం కష్టమే. అక్కడ మినిమమ్ డైలీ ప్యాకేజీ కింద రూ.4 వేలకు పైగా చెల్లించాలి. హోటల్, ట్రావెల్ ఖర్చులు అదనం.

విదేశాలు వెల్​కమ్​

భారతీయ పర్యాటకులు 2023లో 33.3 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు ఆయా దేశాలు గుర్తించాయి. ఉదాహరణకు ఏప్రిల్​లో రాకపోకలను పెంచాలనే ఉద్దేశంతో జపాన్, ఇండియన్​ టూరిస్ట్​ల కోసం కొత్త ఇ–వీసా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మధ్యనే దుబాయ్​, ఇండియన్ టూరిస్ట్​లకు అనుగుణంగా ఐదేండ్ల వరకు మల్టిపుల్ ఎంట్రీ విజిటింగ్ వీసాలు రూపొందించింది. ఇదిలా ఉంటే.. మలేసియా, కెన్యా, థాయ్​లాండ్, ఇరాన్​ వంటి దేశాలు భారతీయ పర్యాటకుల కోసం వీసా అక్కర్లేదని ప్రకటించాయి. అంటే ఆ దేశాలకు వీసా లేకుండా వెళ్లిరావొచ్చు. దక్షిణాఫ్రికా సింప్లిఫైడ్ వీసా స్కీమ్​ 2025లో ప్రారంభం అవుతుంది. 

ఈ పథకాలు పనిచేస్తాయని అంచనా వేస్తున్నారు. 2014 –15లో ఇండియాలో ఇ–వీసా విధానం రావడంతో  అప్పటినుంచి హాలీడేస్ కోసం వెళ్లే వాళ్ల సంఖ్య ఏడాదికి 600 శాతం పెరిగిందని మే నెలలో వచ్చిన రిపోర్ట్​లో వెల్లడించారు టూర్​ ఆపరేటర్ థామస్ కుక్​. ఇండియన్ టూరిస్ట్​లు చాలావరకు చివరి నిమిషంలో బుకింగ్స్ చేసుకుంటారని బుకింగ్ డాట్ కామ్ అనే ఆన్​లైన్ ట్రావెల్ ప్లాట్​ఫామ్​ తెలిపింది. గత ఏడాదిలో (2023)గూగుల్ ట్రెండ్స్ ప్రకారం, అత్యధిక ఇండియన్ టూరిస్ట్​లు వెతికిన డెస్టినేషన్ వియత్నాం అని గుర్తించారు. 

ఆ ఏడాది వియత్నాం ‘నేషనల్ అథారిటీ ఆఫ్ టూరిజం’ 2019తో పోల్చితే ఇండియా నుంచి వచ్చే టూరిస్ట్​ల సంఖ్య 231 శాతం పెరిగిందని రిపోర్ట్​లో పేర్కొంది. ఇతర ఆగ్నేయాసియా దేశాలైన థాయ్​లాండ్, సింగపూర్, ఇండోనేసియా దేశాలు రాకపోకల్లో భారీ పెరుగుదల కనిపిస్తోందని వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే భారతీయుల ఆసక్తిని చూసి ఆయా దేశాలు వెల్​కమ్ చెప్తున్నాయి.  

- మనీష పరిమి