నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

ఎప్పటి మాదిరే ఈసారీ అంతర్జాతీయంగా మహిళా దినోత్సవ నిర్వహణ తేదీ మార్చి ఎనిమిది. నిజానికిది శ్రామిక వనితలకు సంబంధించింది. శారీరకం, మానసికం ఏదైనా శ్రమే. ఆ రీత్యా చూసినప్పుడు, దీనికి శతాధిక సంవత్సరాల ఘనచరిత ఉంది. మహిళలకైనా, పురుషులకైనా చైతన్య దృక్పథం, హక్కుల అవగాహన ప్రధానం. ఈ రెండూ ఉన్నప్పుడే ఇంటా బయటా గెలుపు సుసాధ్యమవుతుంది. తాను జాగృతమై తోటివారినీ చైతన్యపరిచినప్పుడే ముందడుగు. ఎదుటి వ్యక్తి హక్కులకు భంగం కలిగించకుండా, తన హక్కుల్ని తాను కోల్పోకుండా మెలిగినప్పుడే పురోగతి. వీటిని సమన్వయం చేసుకోవడంలోనే మహిళాశక్తి దాగుంది.  రాజకీయ స్వతంత్రత, ఆర్థిక సమానత, నిస్వార్థ ప్రభుత, ద్వేషరహిత జాతీయత ఉంటేనే దేశం రాణిస్తుంది. లేకుంటే దుర్బలమై క్షీణిస్తుంది. ఇప్పటికిప్పుడు మనకు కావాల్సిందీ మనమంతా కోరుకోవాల్సిందీ ఇంకా చర్చోపచర్చల్ని కాదు, ఇంకెంతో ఆచరణని. మాటల మూటల్ని కట్టి పెట్టి, చేతలు మొదలు పెడితేనే దినోత్సవానికి సార్థకత.

కెప్టెన్ ​లక్ష్మీ సెహెగల్​తో మొదలై..

వనితల జాగృతికి భారత్‌‌లో మూలకేంద్రం గుజరాత్‌‌. అక్కడే కెప్టెన్‌‌ ‌‌లక్ష్మీసెహగల్‌‌, ‌‌మరికొందరు నేతలుగా శ్రామిక సంఘం మొదలైంది. అటు తర్వాత పని పరిస్థితులు ఎప్పటికప్పుడు మరింతగా మెరుగవుతూ వచ్చాయి. అంతకుముందు ఎప్పుడో రష్యన్‌‌ ‌‌శ్రామిక మహిళల ఆందోళన రాజ్యాధికారాన్నే ఓడించింది. తదుపరి ప్రభుత్వం ఓటుహక్కును అనుమతించింది. మహిళలు పోరు పతాక చేపట్టిన తేదీ అలనాటి గణన ప్రకారం మార్చి 8 కాబట్టే, అది అంతర్జాతీయత సంతరించుకుంది. అప్పటినుంచీ మన దేశంలోను ఉత్సవ నిర్వహణ జరుగుతున్నది. గత పాతికేళ్లను తరచిచూస్తే, ఏటా ఒక ప్రచారాంశాన్ని ఐక్య రాజ్యసమితి ప్రకటిస్తూ వస్తోంది. ప్రస్తుత అంశం – లింగ సమానత్వం.  పాశ్చాత్య వైద్యంలో సుశిక్షణ అందుకున్న తొలి భారతీయ వనితారత్నం ఆనందీబాయి. అమెరికాకు మొదటగా ప్రయాణం చేసిన మహిళామణీ తానే. మొట్టమొదటి ఆటోరిక్షా సారథిగా పేరొందిన మరొక భారతీయురాలు షీలా. అంగవైకల్యం ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసంతో ప్రథమంగా అత్యున్నత ఎవరెస్ట్ ‌‌శిఖరాన్ని అధిరోహించిన పర్వతారోహకురాలు ఆరుణిమ. మోడలింగ్‌‌ ‌‌రంగానికే తలమానికంగా నిలిచారు రీటా. స్విమ్మర్‌‌గా భారత, ఆసియా క్రీడాకారిణిగానూ చరిత్ర సృష్టించారు ఆర్తి. టెస్టు క్రికెట్‌‌లో తొలిసారి డబుల్‌‌ ‌‌సెంచరీ చేసిన క్రీడారమణి క్రికెటర్‌‌ ‌‌మిథాలీరాజ్‌‌. ‌‌మొదటగా అంతరిక్షానికి చేరుకున్న భారతీయ సాహసి కల్పనా చావ్లా. తొలి మహిళా పోలీస్‌‌ అధికారిణిగా రికార్డు నెలకొల్పారు కిరణ్‌‌బేడీ. భారత వైమానిక దళానికి వన్నె తెచ్చిన పడతి అంజలి. వీరందరి స్ఫూర్తినేపథ్యం మహిళా దినోత్సవానికి మరింత శోభనిచ్చింది, ఇస్తోంది. 

బాధ్యత అందరిదీ

వనిత అనే పదం వయో విభాగానికే మితం కాదు. బాలిక, యువతి, మహిళ, వృద్ధురాలు అందరూ ఆ కోవవారే. ఇంట్లోని ఆడవారిని గమనించి, గుర్తించి, ఆదరించి, గౌరవించడం తెలిస్తే బయట కూడా అదే విధమైన ప్రవర్తన ఉంటుంది. బాధ్యతల నుంచి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, బంధుమిత్రులు, అధికార, అనధికారులు ఎవరూ తప్పించుకోలేరు. ఒక స్త్రీ మూర్తి పట్ల ఏదైనా అపచారం జరిగిందంటే, స్పందన అత్యంత తీవ్రంగా ఉండి తీరాల్సిందే. ఇలా జరుగుతుందని తెలియదు, మేం అనుకోలేదు అని కన్నవాళ్లంటే సరిపోదు.  మాకు తెలిసినంతవరకు బాగానే ఉండేవాడు, ఎందుకో ఇప్పుడిలా అని నిందితుడి బంధువులు, స్నేహితులు సన్నాయి నొక్కులు నొక్కితే కుదరదు.  మాకూ చాలా బాధగా ఉందని ప్రజాప్రతినిధులు సంతాప సానుభూతులు తెలిపినంత మాత్రాన ఏదీ ఒరిగి పడదు. సామాజిక బహిష్కరణ, చట్టపరమైన కఠిన శిక్షలే మహిళలను నేరగాళ్ల నుంచి పరిరక్షిస్తాయి. ప్రసార సమాచార సాధనాలూ పడికట్టు పదాలను వదులుకోవాలి. అబల, నిర్భాగ్యురాలు, పాపం ఆడపిల్ల వంటి ఊకదంపుడు ప్రయోగాలు ఎంత త్వరగా మానితే అంత మంచిది.  

స్త్రీ ఎక్కడ పూజింపబడుతుందో ..

‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత’ అని ఆర్యోక్తి. దీనికి అర్థం ఎక్కడ స్త్రీలు పూజలందుకుంటారో అక్కడ దేవతలు కొలువై ఉంటారు అని. కానీ దేవతగా కొలవాల్సిన స్త్రీ మూర్తిపై అత్యాచార సంస్కృతి నేటి పరిస్థితుల్లో ఆందోళన కలిగిస్తోంది. సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం.  విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు.  తాము ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు దీటుగా విజయాలు సాధిస్తున్నారు. ‘కార్యేషు దాసీ.. కరణేషు మంత్రీ.. భోజ్యేషు మాతా.. శయనేషు రంభా’ అని కవి చెప్పినట్టుగా ప్రతి మగాడి విజయంలో స్త్రీ పాత్ర లేనిదే అతడికి మనుగడే లేదు.ఇక ఈ ఏడాది(2023) థీమ్ ఏంటంటే ‘డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ఫర్ జెండర్ ఈక్వాలిటీ’. భారత్​లో మార్చి 1 నుంచి 8వ తేదీ వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి. మహిళా సాధికారత, లింగ సమానత్వంలో సాధించిన విజయాల కోసం పోరాడిన నారీ మణులకు నారీ శక్తి పురస్కారాలు అందజేస్తారు. ఆ పురస్కారాలే  భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు చేసేందుకు మహిళాశక్తికి  ఆదర్శంగా నిలబడతాయి.

సమానత్వం ఎక్కడుంది!

ఆకాశంలో, అవకాశాల్లో సగం అన్నది నినాదంగా మిగలాల్సిందేనా? ఇది చెవికి ఇంపు కలిగించడమే తప్ప, నేత్రానందం ప్రసాదించే అవకాశమే లేదా? జనాభా లెక్కల ప్రకారం, పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య తక్కువన్నది ప్రపంచ స్థితి. స్త్రీలు ప్రవేశించని రంగం లేదని, నిపుణత కనబరచని పని లేదని పదే పదే చెప్పడం సరే. వారు నిలబడగలిగేలా చేస్తున్నామా, ఆత్మ విశ్వాసం కోల్పోకుండా చూస్తున్నామా? అన్నదే మన దేశంలో నాటికీ నేటికీ ప్రశ్న. స్త్రీలంటే అప్పటికీ ఇప్పటికీ చిన్నచూపే. విధి నిర్వహణ ప్రదేశాల్లో రక్షణ అంతంత మాత్రమే. శ్రమకు సరిపడా ప్రతిఫలం లభిస్తోందా అన్నది ఈనాటికీ సందేహాస్పదమే. కాకుంటే.. గతంలో కంటే వర్తమానంలో ప్రశ్నించే తత్వం పెరిగింది. నిలదీసి, నిగ్గదీసి నిలువునా కడిగిపారేసే ధీరత అలవాటుగా మారింది. ఆడవారిని కించపరిచే దుష్టశక్తుల పనిపట్టే తెగువా విస్తృతమవుతుంది. వీటన్నింటితోపాటు, స్త్రీల పట్ల ఆలోచనా ధోరణిని ఇంకా మార్చుకోవాల్సిన అగత్యమైతే ఇతర సమాజానికి చాలా ఉంది.

ఆచరిస్తే సరి

సాధికారత గురించి మాట్లాడనివారు లేరు. మహిళలూ మీకు జోహార్లు అంటూ ఏటేటా కవితలల్లే వారికీ కొదవలేదు. ఆకాశం, అవకాశం నినాదాల జోరు సరేసరి. టన్నుల కొద్దీ పదజ్ఞానం కన్నా, ఎంతో కొంతైనా ఆచరించి చూపడం మిన్న. అది సాకారమైనప్పుడే ఆడపిల్ల పెదవి మీద దరహాసం మెరుస్తుంది. అంతేకానీ- ఇంటా బయటా, మాటలు చేతలూ ఆమె కన్నీటికి కారణమైతే, జాతికి నిష్కృతి ఉండదు. ప్రాంతీయం నుంచి అంతర్జాతీయం దాకా ఇంతే.

- చింతకాయల ఝాన్సీ, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి