మార్పు దిశగా మరో అడుగు .. బాలికల్లో చైతన్యానికి వనితా వాక్కు ఫౌండేషన్​ కృషి

మార్పు దిశగా మరో అడుగు .. బాలికల్లో చైతన్యానికి వనితా వాక్కు ఫౌండేషన్​ కృషి

మంచిర్యాల, వెలుగు: మార్పు దిశగా మరో అడుగు అనే నినాదంతో వనితా వాక్కు ఫౌండేషన్​ మంచిర్యాల జిల్లాలో మహిళలు, బాలికల్లో చైతన్యానికి కృషి చేస్తోంది. మంచిర్యాలకు చెందిన అడ్వొకేట్, సైకాలజిస్ట్​ రంగు వేణుకుమార్​ ఫౌండర్​గా, తాళ్లపల్లి కవిత, కూర్మ సునీత కో ఫౌండర్స్​గా మూడేండ్ల కిందట ఈ సంస్థను స్థాపించారు.  నేటి సమాజంలో మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వివక్ష, దాడులను ఆదిలోనే అడ్డుకోవడం, వారిలో చైతన్యం పెంపొందించడమే లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేశారు. 

అప్పటినుంచి వివిధ మహిళా సంఘాలను కలుపుకొని అనేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, మోటివేషనల్​ స్పీకర్లు, బిజినెస్​ ఉమెన్స్​ ఇందులో సభ్యులుగా ఉన్నారు. గౌరవాధ్యక్షురాలిగా జ్యోత్స్నచంద్రదత్, అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్​గా డాక్టర్​ అన్నపూర్ణ మార్గదర్శనం చేస్తున్నారు. ' ఒక సంఘటన జరిగిన తర్వాత బాధితురాలి తరఫున న్యాయం కోసం నిరసనలు, క్యాండిల్​ ర్యాలీలు చేయడం, తరువాత మర్చిపోవడం, మళ్లీ అలాంటి సంఘటన జరిగినప్పుడు స్పందించడం సాధారణం అయిపోయింది. అసలు అలాంటి సంఘటనలు జరగకుండా నివారించాలి. ప్రివెన్షన్​ ఈజ్​ బెటర్​ దాన్​ క్యూర్​ ప్రతి ఒక్కరి నినాదం కావాలి' అని వేణుకుమార్​, కవిత పేర్కొన్నారు. 

బాలికలకు ఆత్మరక్షణ విద్య..

వనితా వాక్కు ఫౌండేషన్​ ఆధ్వర్యంలో బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంచడానికి, ఆపద సమయంలో తమను తాము రక్షించుకోవడానికి ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇస్తున్నారు. అమ్మాయిలను ఫిజికల్​గా, మెంటల్​గా ధృడంగా చేయడానికి మోటివేషనల్​ క్లాస్​లు, సెమినార్లు, యోగా, మెడిటేషన్, కరాటే, కర్రసాము, బాక్సింగ్ వంటి ఆత్మరక్షణ విద్యల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ మార్పు కోసం మూడు సంవత్సరాలుగా ఫ్రీ సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. మహిళా సాధికారిత కోసం తమ వంతు కృషి చేస్తూ అందరి మనన్నలు పొందుతున్నారు. వనితా వాక్కు ఫౌండేషన్​ ద్వారా కవిత చేస్తున్న సేవలకు గుర్తింపుగా పోష్​ యాక్ట్​ 2013 లోకల్​ కంప్లయింట్స్​ కమిటీ జిల్లా చైర్​ పర్సన్​ (ప్రిసైడింగ్​ ఆఫీసర్​)గా నియమితులయ్యారు. ఫౌండేషన్​ సేవలను పలువురు అభినందిస్తున్నారు.