![శత సహస్ర సూర్య నమస్కారాల్లో.. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్](https://static.v6velugu.com/uploads/2025/02/international-wonder-book-of-record-of-sata-sahasra-suranamaskarams_mcyMa6oVkL.jpg)
- సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రదర్శన నిర్వహణ
- వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న 1, 484 మంది యోగా సాధకులు
సిద్దిపేట, వెలుగు: శత సహస్ర సూర్య నమస్కారాల ప్రదర్శన సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం ఘనంగా కొనసాగగా.. వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు నమోదైంది. లక్ష టార్గెట్ గా పెట్టుకోగా.. 4, 02,154 సూర్య నమస్కారాలు చేసి యోగా సాధకులు ఆరోగ్య సందేశాన్ని ఇచ్చారు. వండర్ బుక్ ఆఫ్ రికార్డు ఇంటర్నేషనల్ ప్రతినిధి జ్యోతి సర్టిఫికెట్, మెడల్ అందజేశారు . రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 1,484 మంది యోగా సాధకులు పాల్గొన్నారు.
సిద్దిపేట జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో శత సహస్ర సూర్య నమస్కారాల ప్రదర్శన చేపట్టగా.. జాతీయస్థాయిలో రికార్డు నెలకొల్పింది. రాష్ట్రస్థాయి పోటీలు 25 ఏండ్లలోపు, ఆపైబడిన వయస్సు వారికి పురుష, మహిళా విభాగాల్లో నిర్వహించారు. నాలుగు విభాగాల్లో ఐదేండ్ల నుంచి 72 ఏండ్లలోపు వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమాన్ని అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించి మాట్లాడుతూ.. యోగా శారీరక ధృఢత్వాన్ని, మానసిక ప్రశాంతతను చేకూర్చుతుందన్నారు.
సిద్దిపేట జిల్లా కీర్తిని ప్రపంచానికి సగర్వంగా చాటి చెప్పిన నిర్వాహకులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో సిద్దిపేట సీనియర్ సివిల్ జడ్జ్ స్వాతి రెడ్డి, వ్యాస మహర్షి యోగా సొసైటీ చైర్మన్ అరవింద్ , సిద్దిపేట జిల్లా యోగాసనా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట అశోక్ , యోగ సొసైటీ అధ్యక్షుడు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.