నేడు (జూన్ 21) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా యోగా వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కర్ణాటక మైసూరులో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఆసనాలు వేసి అందర్నీ ఉత్తేజపరిచారు. యోగా ఫర్ హ్యుమానిటీ అనే నినాదంతో ఈ ఏడాది యోగా వేడుకలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులు యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరికొందరు తమ ఇళ్లలోనే ఉండి యోగాసనాలు వేసి, అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ యోగా తప్పనిసరిగా చేయాలని సూచిస్తున్నారు. వీరే కాదు.. భారత సరిహద్దులో విధులు నిర్వహిస్తూ.. తమ ప్రాణాలను సైతం దేశానికి అర్పించేందుకు సిద్ధంగా ఉండి... ధైర్యానికి మారుపేరుగా నిలుస్తోన్న జవాన్లు కూడా ఎముకలు కొరికే చలిలో, మంచుకొండల్లో కొన్ని వేల ఎత్తులో ఉండి యోగాసనాలు చేసి, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.