రైతు సమస్యలపై పోరాడేందుకు కిసాన్ సంయుక్త మోర్చా ఫిబ్రవరి 13న ‘ఛలో ఢిల్లీ’ పార్లమెంట్ ముట్టడి పాదయాత్రకు పిలుపునిచ్చింది. హర్యాన, పంజాబ్ రాష్ట్రాల సరిహద్దు జిల్లాలైన జింద్, ఫతేహాబాద్, శుంబు ఖనౌరీ, దబ్వాలీ, అంబాల రైతులు పాదయాత్ర చేయడానికి సిద్ధమైతున్నారు. వ్యవసాయ కార్మికుల పెన్షన్, పంటకు మద్దతు ధర, వ్యవసాయ చట్టాల సవరణ డిమాండ్లతో ఛలో ఢిల్లీకు బయల్దేరుతున్నారు. పాదయాత్రలో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలీసు బలగాలు భద్రతలు చేపట్టారు. హర్యానా రాష్ట్రంలో 7 జిల్లాలో ఈ రోజు (ఆదివారం) ఉదయం 6గంటల నుంచి ఫిబ్రవరి 13 రాత్రి వరకూ ఇంటర్ నెట్ సర్వీసెస్ పై ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన అంబాలా, కురుక్షేత్ర, కైథాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్, సిర్సా జిల్లాల్లో వాయిస్ కాల్స్ మినహా మెసేజ్ లు, ఇంటర్ నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.
అంబాలా, జింద్, ఫతేహాబాద్ జిల్లాల్లో బారికేట్స్ ఏర్పాటు చేశారు. హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్, అంబాల ఎస్పీ శివాస్ కవిరాజ్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. గొడవలు జరిగే ప్రాంతాల్లో 50 పారామిలటరీ దళాలను మోహరించారు. పాదయాత్ర చేస్తున్న రూల్ లో ప్రయాణికులను వేరే మార్గాలకు మార్చారు. పంచకులతో పాటు హింస చెలరేగే అవకాశాలు ఉన్న ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.