- ఏడేళ్లలో మొత్తం టెలికం సెక్టార్ రూపురేఖలు మార్చేసిన కంపెనీ
- చౌకగా మారిన డేటా..అన్‌లిమిటెడ్ కాల్స్
- వేగంగా 5జీ రోల్అవుట్..ఏఐపై ఫోకస్
- వైర్‌లెస్, బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్‌లలో నెంబర్ వన్ స్థానానికి
బిజినెస్ డెస్క్, వెలుగు: కేవలం ఏడేళ్లలోనే ఒక కంపెనీ మొత్తం టెలికం ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేసింది. ఫ్రీ సిమ్ కార్డులు, అన్‌లిమిటెడ్ ఫ్రీ డేటా, కాల్స్, నో రోమింగ్ ఛార్జీలు..ఇలాంటి చాలా ఆఫర్స్‌తో 2016, సెప్టెంబర్ 5 న రిలయన్స్ జియో కస్టమర్ల ముందుకొచ్చింది. లాంచ్ అయిన ఆరు నెలల్లోనే 10 కోట్ల మంది కస్టమర్లను సంపాదించుకుంది. ప్రస్తుతం జియో సబ్‌స్క్రయిబర్లు 45 కోట్లకు చేరుకున్నారు.
బ్రాడ్ బ్యాండ్ సెగ్మెంట్‌లోనూ జియో నెంబర్ వన్‌గా కొనసాగుతోంది. జియో రాకముందు ఒక జీబీ డేటా, లిమిటెడ్ టాక్‌టైమ్ మినిట్స్ కోసం సుమారు రూ.1,200 వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు 50 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ డేటా కాల్స్ రూ. 400 లోపే ఖర్చవుతోంది. జియో దెబ్బకు మిగిలిన టెలికం కంపెనీలు కూడా తక్కువ రేటుకే డేటా, వాయిస్ కాల్స్‌ను ఆఫర్ చేయాల్సి వచ్చింది. రిలయన్స్ జియో రాకముందు టాటా డొకొమో, యూనినార్, ఎయిర్‌సెల్ వంటి వివిధ టెలికం కంపెనీలు ఉండేవి. జియో వచ్చాక ఈ కంపెనీలు తమ దుకాణం సర్దుకోవడమో లేదా ఇతర కంపెనీల్లో విలీనం కావడమో జరిగింది.
డేటాతో కాల్స్..
జియో రాకముందు టెలికం కంపెనీలు డేటాను, వాయిస్ కాల్స్‌ను సపరేట్‌గా ఇచ్చేవి. జియో వాయిస్ ఓవర్ ఎల్‌టీఈ (వోల్టె) సర్వీస్‌లను తీసుకొచ్చింది. అంటే ఫోన్ కాల్స్‌కు టాక్‌టైమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. డేటాతో అన్‌లిమిటెడ్ కాల్స్‌ను జియో ఆఫర్ చేయడం ప్రారంభించింది. అంతేకాకుండా జియోఫై పేరుతో మొబైల్ డాంగిల్ తీసుకొచ్చింది. ఈ మొబైల్ రూటర్‌లో సిమ్ కార్డు పెట్టుకొని, వైఫై మాదిరి ఇంటర్నెట్ వాడుకోవడానికి వీలుండేది. ఇలాంటి డివైజ్‌లో 2016 లో చాలా తక్కువ.
జియో వర్సెస్ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా
జియో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాక టెలికం ఇండస్ట్రీలో కేవలం మూడే పెద్ద కంపెనీలు మిగిలాయి. ట్రాయ్ డేటా ప్రకారం, ఈ ఏడాది జూన్ 30 నాటికి దేశంలో 144 కోట్ల మొబైల్ సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. ఇందులో 55 శాతం సబ్‌స్క్రయిబర్లు అర్బన్‌లో, 45 శాతం రూరల్ ప్రాంతాల్లో ఉన్నారు. ఈ మొబైల్ సబ్‌స్క్రయిబర్లలో జియోకి 38.35 శాతం వాటా ఉంది. ఎయిర్‌టెల్‌కు 32.68 శాతం, వొడాఫోన్ ఐడియాకు 20.08 శాతం వాటా ఉంది. రిలయన్స్ జియోకి 2022–23 లో రూ.1,19,791 కోట్ల రెవెన్యూ వచ్చింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏకంగా రూ.50,286 కోట్లకు పెరిగింది. కేవలం ఏడేళ్లలోనే కంపెనీ రెవెన్యూ రూ.1.20 లక్షల కోట్లకు చేరుకోవడం విశేషం. జియో యూజర్లు సగటున నెలకు 25 జీబీ వాడుతున్నారు. కంపెనీ యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ 174.80 కి ఎగిసింది.
బ్రాడ్‌బ్యాండ్‌లోనూ అదే దూకుడు..
బ్రాడ్‌బ్యాండ్ సెగ్మెంట్‌లో కూడా జియో దూకుడు కొనసాగుతోంది. 2018 లో జియో ఫైబర్‌తో ఈ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తక్కువ రేటుకే సర్వీస్‌లను అందిస్తూ నెంబర్ వన్ పొజిషన్‌కు చేరుకుంది. ట్రాయ్ రిపోర్ట్ ప్రకారం, జియో బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు 97.1 లక్షలకు చేరుకున్నారు. ఇది 51.98 శాతం మార్కెట్ వాటాకు సమానం. మరోవైపు 28.79 శాతం మార్కెట్ వాటాతో ఎయిర్‌టెల్ రెండో ప్లేస్‌లో, 14.5 శాతం వాటాతో వొడాఫోన్ ఐడియా మూడో ప్లేస్‌లో ఉన్నాయి. జియో సొంతంగా స్మార్ట్‌ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను కూడా తీసుకొస్తోంది. జియో భారత్ హ్యాండ్‌సెట్, జియో నోట్‌బుక్, జియో డైవ్, వైఫై మెష్ ఎక్స్‌టెండర్, జియో రిమోట్ వంటివి లాంచ్ చేసింది.
మెట్రో స్టోర్లు అందరికీ ఓపెన్..
ఇప్పటి వరకు హోల్‌సేల్ బిజినెస్‌లోనే ఉన్న మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్లు కస్టమర్లంద రికీ అందుబాటులోకి రానున్నాయి. రిలయన్స్ రిటైల్ ఈ స్టోర్లను కస్టమర్లందరి కోసం ఓపెన్ చేయనుంది. ఇండియన్ కంపెనీ కావడంతో ఎఫ్‌డీఐ రూల్స్‌ను రిలయన్స్ రిటైల్ ఫాలో కావాల్సిన అవసరం ఉండదు. కాగా, ఫారిన్ కంపెనీ ఇండియాలో రిటైల్ సర్వీస్‌లను బిజినెస్ టు బిజినెస్ (బీ2బీ), ఆన్‌లైన్ ద్వారానే అందించడానికి వీలుంటుంది. డీల్ ప్రకారం మెట్రో బ్రాండ్ కిందనే కొన్నేళ్ల వరకు మెట్రో క్యాష్ అండ్ క్యారీ స్టోర్లను నడపనుంది. కాగా, ఈ స్టోర్లను రూ.2,850 కోట్లకు కిందటేడాది డిసెంబర్‌లో రిలయన్స్ రిటైల్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. 21 సిటీలలోని 31 స్టోర్లను దక్కించుకుంది.