- మున్సిపల్ చైర్మన్తో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా..
- బీజేపీలో చేరేందుకు మరి కొంతమంది రెడీ
- అవిశ్వాసం ప్రచారంతో బీఆర్ఎస్ అలర్ట్
- ముధోల్, ఖానాపూర్ లలో కూడా ఇదే సీన్
నిర్మల్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో నిర్మల్ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. మొన్నటివరకు అధికార బీఆర్ఎస్ పార్టీలో కొనసాగిన పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. నిర్మల్, ముథోల్ సెగ్మెంట్లలో బీజెపీ, ఖానాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేలుగా గెలిచారు. జిల్లాలోని మూడు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఘోర పరా భవాన్ని ఎదుర్కొంది. దీంతో పార్టీలోని చాలామంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు తమ భవిష్యత్తుపై అంతర్మథనంలో మునిగిపోయారు.
నిర్మ ల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ తో పాటు మరికొంతమంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల వీరు హైదరాబాద్ లో ప్రముఖులతో చర్చలు జరిపినట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ ప్రచారాన్ని ఖండించడమే కాకుండా మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ లోనే కొనసాగుతారంటూ ప్రకటించారు. అయితే మున్సిపల్ చైర్మన్ తో పాటు 15 మంది కౌన్సిలర్లు మాత్రం ఇప్పటికీ పార్టీ మారే అంశంపై సీరియస్ గా మంతనాలు సాగిస్తున్నారు.
ఇదిలా ఉండగా దాదాపు ఐదుగురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు మాత్రం కాంగ్రెస్ ను కాదని ఎమ్మెల్యే నేతృత్వం వహిస్తున్న బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారని వార్తలు వినబడుతున్నాయి. అయితే అధికార పార్టీలో చేరితే నిధులు, అభివృద్ధి పనుల మంజూరు విషయంలో ఎలాంటి ఆటంకాలు ఉండవని వారు చెబుతున్నారు. అభివృద్ధి పనులు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంటుందని మున్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు ఆశిస్తున్నారు.
ఖానాపూర్ లో కూడా మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్ పై కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. దీంతో వారు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇదే జరిగితే నిర్మల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగలనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
బీజేపీ వైపు మరికొంతమంది..
నిర్మల్ లో బీజేపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు సాగిస్తున్నారు. స్థానికంగా ఎమ్మెల్యే ప్రాబల్యం ఉండనున్న కారణంగా ఆ పార్టీలో చేరితేనే తమ పనులు పూర్తవుతాయని పలువురు కౌన్సిలర్లు భావిస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులతో దాదాపు ఐదుగురు కౌన్సిలర్లు చర్చలు జరిపారన్న ప్రచారం జరుగుతోంది.
వీరంతా కాంగ్రెస్ ను విభేదించి బీజేపీలో చేరేందుకు ముందుకు వస్తుండడంతో ఆ పార్టీ నేతలు వీరి చేరికలను ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. మరో వారం పది రోజుల్లో నిర్మల్ జిల్లాలో రాజకీయ సమీకరణలు మారిపోయే అవకాశాలు లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల్లోనే పార్టీలు మారేందుకు నాయకులు సిద్ధమవుతుండడం అంతటా చర్చనీయాంశంగా మారుతుంది.
కాంగ్రెస్ తో కొనసాగుతున్న మంతనాలు...
నిర్మల్, ఖానాపూర్ కు చెందిన మున్సిపల్ చైర్మన్ , వైస్ చైర్మన్ తో పాటు పలువురు కౌన్సిలర్లు ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగిస్తున్నారు. అయితే నిర్మల్ ము న్సిపల్ చైర్మన్ తో పాటు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ డీసీసీ ప్రెసిడెంట్ శ్రీహరి రావు మాత్రం ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని లీడర్లు పేర్కొంటున్నారు. దీంతో వీరంతా ప్రత్యామ్నాయంగా పార్టీలోని మరో ఇద్దరు జిల్లా స్థాయి సీనియర్ నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇటీవలే హైదరాబాద్లో వీరంతా సమావేశమై చేరిక విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం నిర్మల్ నియోజకవర్గం లో హాట్ టాపిక్ గా మారింది.