తిరుపతిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం.. 11 మంది రోగుల మృతి

 తిరుపతిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం.. 11 మంది రోగుల మృతి
  • ధృవీకరించిన జిల్లా కలెక్టర్ 
  • మిగిలిన వారిని బతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు -కలెక్టర్ హరినారాయణ్
  • ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం

తిరుపతి: రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలిగింది. దీంతో 11 మంది కరోనా రోగులు మృతి చెందారు. మరికొందరి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉంది. అంతరాయం వాస్తవమేనని.. 11 మంది చనిపోయినట్లు జిల్లా కలెక్టర్ హరినారాయణ్ ధృవీకరించారు. మరికొంత మంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని.. వారికి సీఆర్పీసీ చేసి బతికించేందుకు వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.  ఆక్సిజన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు కంప్రెజర్ తగ్గడంతో సరఫరాకు అంతరాయం కలిగినట్లు చెబుతున్నారు. ప్రెషర్ పెరగడంతో ఆస్పత్రి కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది వాస్తవమేనని కలెక్టర్ ప్రకటించారు. ఆ కొద్దిసేపు రోగులు తీవ్రంగా ఇబ్బందిపడ్డారని.. 11 మంది చనిపోగా మిగిలిన వారి పరిస్థితి విషమంగా మారడంతో వైద్య సిబ్బంది సవాల్ గా తీసుకుని వారిని బతికించేందుకు శ్రమిస్తున్నారని కలెక్టర్ తెలిపారు. 
ఆస్పత్రిలో రోగుల బంధువుల ఆందోళన 
ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయిన విషయం తెలిసిన వెంటనే తమ వారి పరిస్థితి ఏమిటంటూ రోగుల బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. తమ వారు చికిత్స పొందుతున్న పక్కన బెడ్లపై రోగులు చనిపోవడం గుర్తించి వారు వైద్యులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. సరైన సమాచారం రాకపోవడంతో పెద్ద ఎత్తున కేకలు వేస్తూ నిరసనకు దిగారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులతో రోగుల బంధువుల వాగ్వాదాలతో ఆస్పత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత ఏర్పడింది. తమ వారు చనిపోవడానికి ఆక్సిజన్ లేకపోవడమేనని.. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఆస్పత్రి ఐసీయూ వార్డులో వస్తువులను రోగుల బంధువులు పగులగొట్టారు. దీంతో నర్సులు, డాక్టర్లు, సిబ్బంది పరుగులు తీశారు. కోపంగా ఊగిపోతున్న రోగుల బంధువులు నర్సులు. డాక్టర్లు, సిబ్బంది ఉన్న గదుల తలుపులు బద్దలు కొట్టేందుకు యత్నం చేయడంతో మరికొంత మంది వైద్య సిబ్బంది  కోవిడ్ ఆస్పత్రి నుంచి వెళ్లిపోయారు. తిరుపతి రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ సరఫరా లోపం పై సీఎం వైఎస్ జగన్ వెంటనే స్పందించారు. పూర్తి స్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతకు ముందే జిల్లా కలెక్టర్, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తదితరులు ఆస్పత్రిని సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు.