అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​..దోపిడీ కేసును ఛేదించిన వైరా పోలీసులు

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్​..దోపిడీ కేసును ఛేదించిన వైరా పోలీసులు
  • రూ.37 లక్షల సొత్తు, రెండు కార్లు స్వాధీనం 
  • నలుగురు దొంగలు ఆంధ్ర, తమిళనాడుకు చెందినవారే
  • తెలంగాణతోపాటు 4 రాష్ట్రాల్లో చోరీ
  • పోలీస్​ డ్రెస్​లో వచ్చి కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీ
  • వివరాలను వెల్లడించిన ఖమ్మం సీపీ సునీల్ దత్

వైరా, వెలుగు: ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఇటీవల సంచలనం రేపిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురితోకూడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకొని, రిమాండ్ కు తరలించారు. ఆంధ్ర, తమిళనాడుకు చెందిన కరుడుగట్టిన ఈ నలుగురు నేరస్తుల నుంచి రూ. 37 లక్షల విలువచేసే బంగారం, రెండు కార్లను  స్వాధీనం చేసుకున్నారు.

వైరాలో మంగళవారం  ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ వివరాలను వెల్లడించారు. వైరాలో  ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలు ఇంటికి  గత నెల 12న నలుగురు దుండగులు తెలుపు రంగు షిఫ్ట్ డిజైర్ కారులో వచ్చారు. నలుగురి లో ఒకరు పోలీస్ యూనిఫామ్ ధరించి,  ఆమె కుటుంబ సభ్యుల గురించి ఆరా తీశారు.

నీ కొడుకు అక్రమంగా గంజాయి అమ్ముతున్నారని, మీ ఇంటిని ఒకసారి సోదా చేయాలని చెప్పి  వృద్ధురాలిని  తాళ్లతో కట్టేశారు. ఆమె నోటికి ప్లాస్టర్ వేసి బెడ్ పై పడేశారు. అనంతరం ఇంట్లోని బీరువాలో  ఉన్న నగదు, బంగారంతోపాటు వృద్ధురాలి ఒంటిపై ఉన్న ఆభరణాలను దోచుకొని అదే కార్​లో వెళ్లిపోయారు.  వైరా డీఎస్పీ రెహమాన్, సీఐ సాగర్ ఆధ్వర్యంలో పోలీసులు సీసీ కెమెరాల్లో లభించిన ఆధారాలతో కేసు విచారణ నిర్వహించారు.

నలుగురిపై ఆర్థిక, హత్యా నేరాలు

వైరాలో దోపిడీకి పాల్పడిన నలుగురు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు. వివిధ రాష్ట్రాల్లో ఆర్థిక, హత్యా నేరాలకు పాల్పడిన వారే. దోపిడీ కేసులో ఏ1 గా ఉన్న రాయపాటి వెంకయ్య అలియాస్ దొంగల వెంకన్నది ఏపీలోని పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేసనపల్లి. ఇతడిపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రంలో హత్య, దొపిడీ, దొంగతనం కేసులు 30 దాకా ఉన్నాయి.

ఈ కేసులో ఏ2 గా ఉన్న షేక్ నాగుల్ మీరాది ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురం గ్రామం. ఇతడిపై ఆంధ్ర, కర్నాటక రాష్ట్రాల్లో 10 కేసులు ఉన్నాయి. ఏ3 గా ఉన్న ముత్తురాజ మురుగేషన్ అలియాస్ ముత్తుది తమిళనాడులోని మాణిక్యం పాలెం గ్రామం. ఇతడిపై తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో 11 కేసులు ఉన్నాయి. ఏ4 గా ఉన్న విజయ్ కుమార్ ది తమిళనాడులోని వీరప్పన్ సత్రం గ్రామం. ఇతడిపై తమిళనాడులో 4 కేసులు ఉన్నాయి.

 వైరాలో దోపిడీకి పాల్పడిన తర్వాత ఈ నలుగురు కర్నాటక రాష్ట్రంలో కూడా ఓ ఇంట్లో బంగారు నగలు దొంగిలించారు. ఈ 2 కేసుల్లో 37 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నెమలి సమీపంలోని స్టేట్ బోర్డర్ చెక్ పోస్ట్ లో పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఈ నలుగురు పట్టుబడ్డారని, వారిని విచారించగా వైరా దోపిడీ కేసులో నిందితులుగా గుర్తించి రిమాండ్ కు తరలించినట్టు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు.