50 కి.మీ. తిరిగి వెళ్తున్న తెలంగాణ, మహారాష్ట్ర పబ్లిక్
నాడు మహారాష్ట్రకు లింక్ అవుతుందన్న సీఎం కేసీఆర్
ఇప్పుడు గేట్లు పెట్టి మరీ కాపలా కాస్తున్నరు
కనీసం టూ వీలర్లకూ పర్మిషన్ ఇవ్వని ఆఫీసర్లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించింది. మూడు చోట్లా వెహికల్స్రాకపోకల కోసం బ్యారేజీలపై డబుల్ లేన్ రోడ్లు వేసింది. అప్పటి మహారాష్ట్ర, ఏపీ సీఎంలు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్జగన్మోహన్రెడ్డిలతో కలిసి 2019 జూన్ 21న సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్మండలం అంబట్పల్లి వద్ద గోదావరి నదిపై రూ.2,680 కోట్లతో కట్టిన మేడిగడ్డ రోడ్ కమ్ బ్యారేజీ ఏకంగా1,632 మీటర్ల పొడవు ఉన్నది. 16.17 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ఈ బ్యారేజీ కారణంగా మహారాష్ట్ర వైపు సుమారు 300 ఎకరాల భూములు ముంపునకు గురయ్యాయి. బ్యారేజీపై నిర్మించే రోడ్డు అంతరాష్ట్ర రహదారిగా సేవలందిస్తుందని అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తెలియచేయడంతో వారంతా సంతోషంగా భూములిచ్చారు. ఇన్నాళ్లూ బ్రిడ్జి లేకపోవడంతో 50 కిలోమీటర్ల దాకా చుట్టూ తిరిగివచ్చేవాళ్లమని, ఇక తమ కష్టాలు తీరుతాయని భావించారు.
50 కిలోమీటర్ల దూర భారం..
మేడిగడ్డ బ్యారేజీకి తెలంగాణ వైపు అంబటిపల్లి, మేడిగడ్డ, సూరారం, పలిమెల తదితర సుమారు 10 గ్రామాలు, మహారాష్ట్ర వైపు పోచంపల్లి, నడికూడ, చింతరేవుల, సోమన్ పల్లి తదితర 18 గ్రామాల వరకు ఉన్నాయి. గోదావరికి అటు ఇటు ఉన్న గ్రామాల్లోని ప్రజలంతా దాదాపు తెలుగు మాట్లాడేవారే. వీరి మధ్య పెళ్లి సంబంధాల ద్వారా దగ్గరి బంధుత్వాలున్నాయి. ఇక మహారాష్ట్ర వైపు ఉన్న ప్రజలు ప్రతి అవసరానికి తెలంగాణ వైపు బోర్డర్లోని మహదేవపూర్ మండలం పై ఆధారపడతారు. కిరాణా సరుకులు మొదలుకొని వైద్యం, విద్య, తదితర అవసరాలకు వస్తుంటారు. మహదేవ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగే డెలివరీల్లో 30 శాతం నుంచి 40 శాతం వరకు మహారాష్ట్ర మహిళలే ఉంటారు. ఇన్నాళ్లూ ఆయా గ్రామాల ప్రజలు చుట్టూ తిరిగి కాళేశ్వరం మీదుగా వచ్చేవారు. 50 నుంచి 80 కిలోమీటర్ల దాకా ఎక్కువ ప్రయాణించాల్సి వచ్చేది. మేడిగడ్డ బ్యారేజీ పైన ఉన్న అంతర్రాష్ట్ర రహదారిని ఓపెన్ చేస్తే ఈ దూరం ఐదు కిలోమీటర్లకు తగ్గిపోతుంది.
ఆ రెండు చోట్ల ఓకే.. ఇక్కడ నో..
అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై వెహికల్స్రాకపోకలకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయని రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ బ్యారేజీపై మాత్రం ఎవరూ వెళ్లకుండా గేట్లు ఏర్పాటు చేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు అటు.. ఇటూ తెలంగాణ ప్రాంతమే ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. బ్యారేజీ దాటితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకే ప్రవేశిస్తుండడంతో బ్యారేజీలు స్టార్టయినప్పటి నుంచి ఈ రోడ్లపై నిరంతరంగా వెహికల్స్నడుస్తున్నాయి. కానీ మేడిగడ్డ బ్యారేజీ విషయానికొచ్చేసరికి అటువైపు మహారాష్ట్ర ఉండటంతో ఇక్కడ అధికారులు గేట్లు వేసి మరీ రోడ్డును మూసేశారు.
మావోయిస్టుల భయమా?
మేడిగడ్డ బ్యారేజీపై వెహికల్స్తిరిగితే గేట్లకు సంబంధించిన కరెంట్వైర్లతోపాటు, ఇతర ఎలక్ట్రికల్, ఇంజినీరింగ్పరికరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని, అందుకే వెహికల్స్‌కు పర్మిషన్ ఇవ్వట్లేదని ప్రాజెక్టు ఇంజినీర్లు, పోలీసులు అంటున్నారు. కానీ అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ఉన్న రోడ్లపై వెహికల్స్తిరిగితే రాని ప్రమాదం ఇక్కడ ఎందుకు వస్తుందని పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. వెహికల్స్‌కు పర్మిషన్ ఇస్తే పొరుగు రాష్ట్రం నుంచి మావోయిస్టులు ఎక్కడ తెలంగాణలోకి ప్రవేశిస్తారో అనే భయంతోటే మూసేసినట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని అటు పోలీసులు.. ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫీసర్లు ఒప్పుకోవట్లేదు. అది నిజం కానప్పుడు వెంటనే మేడిగడ్డ రోడ్డు తెరవాలని మహారాష్ట్ర– తెలంగాణ బార్డర్‌లోని ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం భూపాలపల్లి జిల్లా కాటారం డీఎస్పీ కిషన్‌ను మహారాష్ట్రలోని పలు గ్రామాల ప్రజలు కలిసి వినతిపత్రాలు అందించారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రోడ్లపై వెహికల్స్అనుమతించాలని రెక్వెస్ట్ చేశారు.
మేడిగడ్డను రోడ్ కమ్ బ్యారేజీగా నిర్మిస్తున్నామని, పూర్తయితే ఇంటర్‌స్టేట్ రోడ్డుగా మారి, తెలంగాణ– మహారాష్ట్ర గ్రామాల మధ్య ట్రాన్స్పోర్ట్మెరుగుపడుతుందని స్వయంగా సీఎం కేసీఆర్చెప్పారు. కానీ మేడిగడ్డ బ్యారేజీ పూర్తయి ఏడాదిన్నర పూర్తికావస్తున్నా ఈ రోడ్ కమ్ బ్యారేజీని ఇంకా తెరుస్తలేరు. సేఫ్టీ పేరుతో గేట్లు పెట్టి మరీ కాపలా కాస్తున్నరు. కనీసం టూవీలర్లకు సైతం పర్మిషన్ ఇవ్వకపోవడంతో తెలంగాణ, మహారాష్ట్ర నడుమ రాకపోకలు లేక ఇరు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు. ప్రాజెక్టు కోసం తమ భూములను త్యాగం చేశామని, కానీ బ్యారేజీ పూర్తయ్యాక రోడ్డు మీద వెళ్లనీయకపోవడం అన్యాయమని మహారాష్ట్రీయులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే..
కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీపై పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను పూర్తిగా నిలిపివేశాం. టూ వీలర్లకు కూడా అనుమతివ్వడం లేదు. పై నుంచి వచ్చిన ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం.
– రమణారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్ట్చీఫ్ ఇంజినీర్, భూపాలపల్లి
ప్రజలు తెరవాలని కోరుతున్నరు
మేడిగడ్డ బ్యారేజీపై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫీసర్లు మాత్రం రెండు వైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. పోలీసుల నిఘా కూడా ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.
– బోనాల కిషన్, కాటారం డీఎస్పీ
For More News..