
- రెండు వేర్వేరు కేసులో 9 మందిపై కేసు నమోదు
- మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు వెల్లడి
మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ, సూర్యాపేట జిల్లాలో రేషన్ బియ్యం తక్కువ ధరకు కొని అక్రమ రవాణా చేసి అమ్ముతున్న అంతరాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మిర్యాలగూడలో డీఎస్పీ రాజశేఖర రాజు మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు.
ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం జమ్మిచెట్టు బజారుకు చెందిన మందపాటి నరేందర్.. సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకుని రేషన్ బియ్యం కొనుగోలు చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన అప్పారావుతో కలిసి రేషన్ బియ్యాన్ని రాష్ట్రసరిహద్దు వాడపల్లి మీదుగా ఏపీకి తరలిస్తున్నారు. ఈనెల 21న మిర్యాలగూడ మండలం కొత్తగూడెం వద్ద పోలీసులు తనిఖీలు చేస్తుండగా బొలెరో, లారీ అనుమానాస్పదంగా వెళ్తున్నాయి. ఆపి లారీలో (66) క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకుని డ్రైవర్ దేవరకొండ అమ్మోరును అదుపులోకి తీసుకున్నారు.
అతడు తెలిపిన వివరాల మేరకు మందపాటి నరేందర్ తో పాటు అదే జిల్లా దాచేపల్లి మండలం ఇందిరానగర్ కు చెందిన మాదినేటి చంద్రశేఖర్, అప్పారావు ఉన్నట్లు చెప్పాడు. అంతేకాకుండా నాగార్జునసాగర్ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద మరో రేషన్ అక్రమ రవాణా ముఠా పట్టుబడింది.
ఏపీలోని రెంటచింతలకు చెందిన నెమలి నాగిరెడ్డి, నారాయణ, ఓంకార్ రెడ్డి, మధు.. చలకుర్తికి చెందిన సైదిరెడ్డి, నెల్లికల్ వాసి శ్రీధర్ రెడ్డితో కలిసి రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నారు. రెండు వేర్వేరు కేసుల్లో మాదినేటి చంద్రశేఖర్, నెమలి నాగిరెడ్డి, దమ్మ మధును అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్టు డీఎస్పీ తెలిపారు. ముఠా సభ్యులు, ప్రధాన సూత్రధారులపై వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసినట్టు చెప్పారు. మందపాటి నరేందర్, ఇతరులు పరారీలో ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు.