మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో ఫిబ్రవరి18న ఎస్‌బీఐ ఏటీఎంను అంతరాష్ట్ర దొంగల ముఠా ధ్వంసం చేసి సినీ ఫక్కీలో రూ. 28 లక్షల దొంగతనం చేసి పరారైంది. బుధవారం మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రం జోద్ పూర్ జిల్లా పలోడి ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఘని మరికొంత మందితో కలిసి కారులో వచ్చి గ్యాస్ కట్టర్ తో కేవలం గంట20 నిమిషాల్లో నే ఏటీఎం దొంగతనం చేశాడు.
ఇతడిపై రాష్ట్రంలో పలు ఏటీఎం దొంగతనం కేసులు, వివిధ పోలీసు స్టేషన్ లలో చీటింగ్ కేసులు నమోదు అయినట్లు పేర్కొన్నారు. అబ్దుల్ ఘనిని ఏ1 నిందితుడిగా కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా అంతరాష్ట్ర ఏటీఎం దొంగలను పట్టుకున్న సీఐ రవి కుమార్, ఎస్ఐ తిరుపతి, ఇతర పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ అభినందించారు. కార్యక్రమంలో గార్ల ఎస్ఐ జీనత్ కుమార్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.