- కసరత్తు చేస్తున్న ఆర్ అండ్ బీ
- తొలిదశలో కొడంగల్, మధిర సహా 28 నియోజకవర్గాల్లో నిర్మాణం
- రెండు ప్రాంతాల్లో పర్యటించిన ఆర్కిటెక్ట్ ప్రతినిధులు
- త్వరలో డిజైన్, బడ్జెట్ ప్రతిపాదనలు అందజేత
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి ఈ నెలలోనే టెండర్లు పిలిచేందుకు ఆర్ అండ్ బీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డిజైన్లు, భవనాల నిర్మాణ డిజైన్ల తయారీ, నిర్మాణ వ్యయం ఆర్కిటెక్చర్ బాధ్యతలను బెంగళూరుకు చెందిన మనోజ్ అసోసియేట్స్ కు ప్రభుత్వం అప్పగించింది.
తొలి దశలో కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ స్కూళ్లను నిర్మించనుండగా నిర్మాణ బాధ్యతలను ఆర్ అండ్ బీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ రెండు ప్రాంతాలను ఆర్కిటెక్ట్ కంపెనీ ప్రతినిధులు పరిశీలించినట్లు ఆర్ అండ్ బీ అధికారులు చెబుతున్నారు. ఇక్కడ భూమిని టెస్ట్ చేయడం, గురుకులాల బిల్డింగ్ లు, అడ్మినిస్ర్టేటివ్ బ్లాక్, కిచెన్, డైనింగ్ హాల్, పార్కింగ్, గార్డెనింగ్, గ్రౌండ్ వంటి వాటిని ఎక్కడ నిర్మించాలన్న అంశాలపై ప్లాన్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
వీటిని త్వరలో ఆర్ అండ్ బీకి ఆర్కిటెక్ట్ కంపెనీ అందచేయనుంది. అనంతరం బడ్జెట్ పై ఫైనాన్స్ డిపార్ట్ మెంట్కు ఒక్కో స్కూల్కు కంపెనీ అందించిన వివరాలను అధికారులు పరిశీలించి అడ్మినిస్ర్టేటివ్ శాంక్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులు ఈ నెలలోనే టెండర్లు పిలవనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు.
గురుకులాల నుంచి నిధులు..
అన్ని గురుకులాలను ఒకే క్యాంపస్ లో నిర్మిస్తుండగా ఈ నిధులను ఆయా శాఖల బడ్జెట్ ఫండ్స్ నుంచి ఖర్చు చేయనున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల నుంచి రూ. 25 కోట్ల నుంచి రూ. 30 కోట్ల చొప్పున అర్ అండ్ బీకి బదిలీ చేయనున్నారని ఉన్నతాధికారి తెలిపారు. ఏడాదిన్నర నుంచి రెండేళ్లలో పూర్తి చేసేలా టెండర్ దక్కించుకున్న కంపెనీకి ప్రభుత్వం గడువు ఇవ్వనుంది. కాగా, రాష్ట్రంలో తొలి దశలో 28 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
ః20 నుంచి 25 ఎకరాల్లో నిర్మించే ఈ స్కూళ్లకు రూ. 100 కోట్ల నుంచి రూ. 150 కోట్లు ఖర్చు చేయనున్నారు. దసరా రోజు సీఎం రేవంత్ రెడ్డి షాద్ నగర్ నియోజకవర్గంలో, మంత్రులు ఆయా జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శంకుస్థాపనలు చేశారు. వీటిపై ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వివరాలు తెలియజేశారు. ఈ 28 చోట్ల భూమిని ఇప్పటికే రెవెన్యూ శాఖ నుంచి తీసుకొని బోర్డులు ఏర్పాటు చేశామని కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.