హైదరాబాద్: ఇటీవల ఆర్టీసీ సిబ్బందిపై దాడులు పెరిగిపోయాయి. మొన్న పంజాగుట్టలో కండక్టర్ పై విద్యార్థులు దాడి చేశారు.. నిన్న బస్సులో డ్రైవర్ పక్కన బానె ట్ పై కూర్చోనివ్వడం లేదని.. మహిళా ఆమె కొడుకు కండక్టర్, డ్రైవర్ పై దాడి చేశారు. తాజాగా మోజాంజాహీ మార్కెట్ దగ్గర ముగ్గురు యువకులు ఆర్టీసీ బస్సు డ్రైవ ర్, కండక్టర్ పై దాడి చేశారు. బస్సు , తమ బైక్ పక్కనుంచి వెళ్లిందని గొడవపడి.. డ్రైవర్ ను చితకబాదారు.. అడ్డువచ్చిన మహిళా కండక్టర్ ను కిందపడేలా తోసేశారు.
ఆర్టీసీ బస్సు డ్రైవర్ , కండెక్టర్ పై ముగ్గురు యువకులు దాడి చేసిన ఘటన గురువారం బేగంబజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ దాడి ఘటనకు సంబంధించి బేగంబజార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్ డిపో 1 కు చెందిన ఆర్టీసీ బస్సు దిల్సుక్ నగర్ నుండి కర్ణాటక బీదర్ కు ప్రయాణికులతో వెళ్తుండగా... గౌలిగూడా ప్రాంతానికి చెందిన వంశీ(25) , రాహుల్ (27) , అనిరుధ్ (30) లు ఒకే బైక్ పై ఏంజె మార్కెట్ సిగ్నల్ వద్ద చేరుకోగానే .. వెనుక నుండి వచ్చిన ఆర్టీసీ బస్సు బైక్ కు తాకడంతో ముగ్గురు కిందపడిపోయారు. దీనితో ఒక్కసారిగా ఆవేశానికి గురైన యువకులు బస్సులోకి ఎక్కి డ్రైవర్ లక్ష్మయ్య పై దాడి చేశారు. అడ్డుకోడానికి వెళ్లిన కండెక్టర్ అంజమ్మ పై కూడా దాడికి పాల్పడ్డారు.
దీనితో డ్రైవర్ , కండెక్టర్ కు గాయాలు అయ్యాయి. వెంటనే అక్కడి నుండి యువకులు బైక్ పై పరారయ్యారు. దీనితో బాధిత డ్రైవర్ , కండెక్టర్ బేగంబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బేగంబజార్ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా యువకులు వంశీ , రాహుల్ ను అదుపులోకి తీసుకొని , వారిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. మరొక యువకుడు అనిరుద్ పరారీలో ఉన్నట్లు బేగంబజార్ సిఐ విజయ్ కుమార్ వెల్లడించారు.