రైతుకు ధీమా ఫసల్​ బీమా!

రైతుకు ధీమా ఫసల్​ బీమా!

తెలంగాణ ఏర్పడేనాటికి రైతుల దైన్యాన్ని గమనించినవారికి, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న మార్పులు కలా, నిజమా? అనే దిగ్ర్భమను కలిగిస్తున్నాయి. స్థూలంగా వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలతో, రైతులు అనుభవిస్తున్న వేదనను దూరంచేయడానికి తెలంగాణ తొలి ప్రభుత్వం ప్రయత్నించింది.  బక్కచిక్కిన రైతు పంట సాగుకోసం సాయం అందించే అద్భుతమైన  రైతుబంధు పథకం ప్రవేశపెట్టింది. కలసిరాని కాలాలతో కాడి-మేడి వదిలేయడానికి సిద్ధపడ్డ అన్నదాతలకు నాడు రైతుబంధు ఊపిరిపోసింది. 

రైతుకు నగదు బదిలీ అమలు అనేది దేశంలోనే మొదటిది. అయినా వ్యవసాయానికి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న అనేక సబ్సిడీలకు ఎగనామం పెట్టాయి. రుణాలపై వడ్డీ మాఫీ, ఎరువుల సబ్సిడీలు, పనిముట్ల సబ్సిడీ, ట్రాక్టర్​ సబ్సిడీ వంటి సబ్సీడీలన్నీ  పోయాయి. వాటి స్థానంలో రైతుబంధు వచ్చింది. ఏతావాతా తేలేదేమిటంటే, వ్యవసాయం చేసే రైతు కంటే, వ్యవసాయం చేయని భూయజమానులే రైతుబంధుతో లాభపడడం జరిగింది.  మోదీ నేతృత్వంలోని బీజీపీ సర్కారు  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనే నినాదంతో గద్దెనెక్కినా ఆ మేరకు ఆదాయాన్ని చూపెట్టలేకపోయింది.

 ఎనిమిదేండ్ల కిందట ప్రధాన మంత్రి పంటల బీమా పథకం తీసుకొచ్చింది. ఇది కూడా రాష్ట్రానికి ఓ విధంగా  అమలు చేస్తుండటం వల్ల రైతులకు అన్యాయం జరిగింది. తొలిసారిగా 2018 ఖరీఫ్  సీజన్లో  దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో అమలు చేశారు.  అప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వం కూడా 2016 నుంచి 2020 వరకు నిరవధికంగా అమలు చేయడం జరిగింది. హఠాత్తుగా తగ్గించిన ఫసల్ బీమా ప్రీమియం వాటాలపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేసినా కేంద్ర, రాష్ట్రాల మధ్య సఖ్యతలేక అమలుకు నోచుకోలేదు.

అనుకోని విపత్తుల కారణంగా నష్టాల ఊబిలో ఉన్న రైతులను ఆదుకోవడంలో సఫలం కాక అపవాదులు మోయాల్సి వచ్చింది. దేశంలో 90శాతం రైతులు ప్రకృతి వైపరీత్యాలతో అప్పుల విషవలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఊహించని పంట నష్టం వల్ల కంపెనీలకు చెల్లించిన అదనపు ప్రీమియం కంటే కూడా నష్ట పరిహారం చెల్లించే పరిస్థితి వచ్చింది. 

పంటనష్టం అంచనాలో అశాస్త్రీయ విధానాలు

నాలుగేండ్లలో ఆయా రైతులు వేసిన పంటలకు కేసీఆర్ ప్రభుత్వం 2,416 కోట్ల ప్రీమియం బీమా సంస్థలకు చెల్లించింది. పంట నష్టాన్ని అంచనా వేయడంలో అనుసరిస్తున్న విధానాలు అశాస్త్రీయంగా ఉన్నందున బీమా పూర్తిగా రైతులకు అందలేదు. తెలంగాణలో పంట నష్టం కింద ఆయా ఇన్సూరెన్సు సంస్థలు చెల్లించింది 1,871 కోట్లు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం కంపెనీలకు రూ.544 కోట్లు  అదనంగా చెల్లించాల్సి వచ్చింది. విధి విధానాలు సరిగ్గా రూపొందించని కారణంగా పంట నష్టం రైతులకు అందడం లేదనే విమర్శ ఉంది.

కేంద్ర ప్రభుత్వం 50:50పెట్టుబడిని అకస్మాత్తుగా 20శాతం తగ్గించినందుకు భారంగా భావించి  కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకం నుంచి వైదొలిగింది.  ప్రకృతి  కన్నెర్ర చేసిన కారణంగా మూడు సంవత్సరాలు రైతుల పంటకు బీమా లేకపోవడం వల్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. బీమా చేయించని పంటలు దెబ్బతిన్నప్పుడు పరిహారం అందక అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటున్న రైతుల్లో 10శాతం వరకు సన్నకారు రైతులే ఉంటున్నారు.

పంటల బీమా పథకాల అమలులో అనేక లోపాలు ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా కేంద్రం ఆ దిశగా దృష్టి సారించడం లేదు. 2023లో  కేవలం 17 రాష్ట్రాలకే పరిమితం అయ్యింది. రాజకీయాలకు చోటు ఇవ్వకుండా ప్రతికూలతను తట్టుకునే విధంగా అన్నదాతలకు అండగా నిలిచేందుకు పీఎంఎఫ్​బీవైలో  రేవంత్ ప్రభుత్వం తిరిగి చేరడం ఉత్తమమని భావించింది. దేశంలో అమలు అవుతున్న రైతుల పంటల బీమా పథకాల్లో పారదర్శకత లోపించిందనే విమర్శ ఉంది.

మూడొంతులు చిన్న, సన్నకారు రైతులు

రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు మూడొంతులకు పైగా ఉన్నారు.  విపత్తు కారణంగా పంట కోల్పోతే సర్వం కోల్పోయినట్టే. మళ్లీ పంట సాగు చేయాలంటే వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిందే. అందుకోసం ముందు జాగ్రత్తగా నేడు రేవంత్ ప్రభుత్వం విపత్తుల కారణంగా చేతికొచ్చిన పంట నష్టపోతే ప్రభుత్వానికి భారం కాకూడదని గ్రహించింది.  ముందుచూపుతో  రైతులకు దన్నుగా నిలిచి వ్యవసాయరంగాన్ని బలోపేతం చేయడం కోసం  ధ్వంసం అయిన పంటకు బీమా అందించేందుకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన అందించేందుకు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.  ప్రకృతి విపత్తుల నుంచి సకాలంలో రైతులను అప్రమత్తం చేయడంలో వాతావరణ శాఖ విఫలం అవుతున్నది.  

Also Read: విప్ అంటే కొరడాలు ఝుళిపించడమే

అసలు రైతులకు అన్యాయం

భూస్వాములను బతికిచ్చేందుకు రాళ్లకు, రప్పలకు రోడ్లకు రైతు బంధు ఇచ్చినట్టే,  వేయని పంటలకు ఆయా నాయకుల పలుకుబడితో  పరిహారం ఇప్పించడం వల్ల అసలు రైతులకు అన్యాయం జరుగుతోంది. ఫసల్​ బీమాతో వచ్చే ఖరీఫ్ సీజన్​లో పంటలు నష్టపోయినప్పుడు రైతులకు ప్రయోజనం కలుగుతుంది. తెలంగాణ పునర్నిర్మాణంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం రైతు కమిషన్, రైతు కేంద్రిత విధానాలు ఒక్కొక్కటిగా ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా సీఎం రేవంత్ భరోసా  కల్పిస్తున్నారు.

ఈ పథకం ద్వారా పంటల బీమా మార్గం సుగమం అయ్యింది.  కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రైతుకు భరోసా అందించేవిధంగా కసరత్తు చేస్తోంది. తాళపు చెవిని రైతు చేతిలో పెట్టే  ప్రయోగం ' రైతు కమిషన్' సఫలమైతే విప్లవమేనని శాస్త్రవేత్తల అభిప్రాయం.  ఇన్నాళ్లు  కేంద్ర, రాష్ట్రాల సమన్వయం కొరవడటం వల్లనే పంటల బీమా పథకాల అమలు కాకపోవడం అన్నదాతలకు శాపంగా పరిణమించింది.

డాక్టర్ సంగని మల్లేశ్వర్,కాకతీయ విశ్వవిద్యాలయం