పరిచయం : నా ఇమేజ్​ని మార్చింది ఆ రెండే .. శరద్ కేల్కర్

 పరిచయం : నా ఇమేజ్​ని మార్చింది ఆ రెండే .. శరద్ కేల్కర్

సంజయ్​దత్, పవన్​ కళ్యాణ్ వంటి బడా హీరోలకు పోటాపోటీగా ఉండే విలన్​ పాత్రలు వేయాలన్నా.. బాహుబలిలాంటి ఒక బిగ్గెస్ట్ సినిమాను యానిమేషన్​  వర్షన్ చేస్తే.. అందులో ప్రభాస్​ పాత్ర అమరేంద్ర బాహుబలికి డబ్బింగ్ చెప్పాలన్నా.. తన్హాజీలాంటి బయోపిక్​లో ఛత్రపతి శివాజీ పాత్రలో నటించాలన్నా.. డైరెక్టర్లకు కనిపించిన ఒకే ఒక యాక్టర్ శరద్ కేల్కర్. ఇలా తాను చేసిన ఒక్కో ప్రాజెక్ట్​ ఒక్కో మైలురాయిగా నిలిస్తే.. దానికి భిన్నంగా నిజ జీవితంలో జీరో బ్యాంక్​ బ్యాలెన్స్​ ఉన్నప్పుడు బరువు బాధ్యతలతో సతమతమయిన సామాన్యుడినని గుర్తుచేసుకుంటాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. కష్టపడుతూనే ఉండాలి. హార్డ్​ వర్క్​ వల్ల వచ్చే ఫలితం చాలా నేర్పిస్తుంది అంటాడు శరద్. ప్రస్తుతం ‘డాక్టర్స్’ అనే వెబ్ సిరీస్​తో రియల్​ లైఫ్​లో డాక్టర్లు ఎలా ఉంటారనే అంశాన్ని ఓటీటీ ఆడియెన్స్​కు చూపించారు. ఈ సందర్భంగా శరద్ కేల్కర్ గురించి ఇంట్రెస్టింగ్ సంగతులివి. 

శరద్​ కేల్కర్​.. బాలీవుడ్ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్, ప్రొడ్యూసర్​ కూడా. మధ్యప్రదేశ్​లోని గ్వాలియర్​కు చెందిన శరద్​.. అక్కడే ఎంబీఏ పూర్తి చేశాడు. యాక్టింగ్​లోకి రాకముందు ప్రొఫెషనల్, ఫిజికల్ ఇన్​స్ట్రక్టర్​గా ఉండేవాడు.  శరద్​ గ్రాసిమ్​ మిస్టర్​ ఇండియా కాంటెస్ట్​ 2002 టైటిల్ గెలిచాడు. యాక్టింగ్ మొదలుపెట్టాక ‘పతీ పత్నీ అవుర్ వో, రాక్​–ఎన్​– రోల్ ఫ్యామిలీ’ అనే టీవీ షోలకు హోస్ట్​గా కూడా చేశాడు. ‘సింధూర్ తేరే నామ్​ కా’ అనే సీరియల్​లో నటిస్తున్న టైంలో నటి కీర్తితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2005లో వాళ్లిద్దరూ పెండ్లి చేసుకున్నారు. అలా సీరియల్​తో స్టార్ట్ అయిన కెరీర్​ సినిమాలతో మలుపు తిరిగింది. ​

సినిమా కెరీర్​

2013లో ‘రామ్​ – లీలా’ సినిమాలో నటించాడు. ఆ తర్వాతి ఏడాది ‘లాయి భారి’ అనే సినిమాలో మెయిన్​ విలన్​గా నటించాడు. ఆ సినిమాలో మరాఠీ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్​ గ్రాసింగ్ ఫిల్మ్​గా నిలిచింది. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. మెయిన్​ విలన్​ పాత్రలోనే కొన్ని సినిమాలు చేశాడు. అలా తెలుగులోనూ అవకాశం వచ్చింది. ‘సర్దార్​ గబ్బర్ సింగ్’ సినిమాలో మెయిన్ విలన్​గా భైరవ్​ సింగ్​ పాత్రలో నటించాడు.  అలాగే హిందీలో ‘భూమి’ అనే సినిమాలో సంజయ్​దత్​కు ఉండే పాత్రలో నటించి మెప్పించాడు. అంతేకాదు.. శరద్​ బయోపిక్​లలోనూ నటించాడు. ‘తన్హాజీ’ సినిమాలో శివాజీగా ఆ పాత్రకు జీవం పోశాడు. 

ఇంతకుముందు ‘సంఘర్ష్​ యాత్ర’ సినిమాలో రాజకీయ నాయకుడైన గోపీనాథ్​ ముండే పాత్రలో నటించాడు. ఈ ఏడాది ‘శ్రీకాంత్’​ అనే సినిమాలో శ్రీకాంత్ బొల్లా పాత్రలో నటించి మెప్పించాడు. దాంతోపాటే ‘అయలాన్’ సినిమాతో తమిళంలోనూ అడుగుపెట్టాడు. నటనతోపాటు ప్రొడ్యూసర్​గా మారి మరాఠీలో ‘ఇడక్ : ది గోట్’ అనే సినిమా తీశాడు. అది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్​లో ప్రదర్శించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. 

ఇవన్నీ ఒక ఎత్తైతే.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్​తో ఓటీటీలోకి శరద్​ ఎంట్రీ ఇవ్వడం, హాలీవుడ్, ఇండియన్​​ సినిమాలు, వెబ్​ సిరీస్​లకు డబ్బింగ్​ చెప్పడం వంటివి మరో ఎత్తు. ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’​, ‘బాహుబలి : క్రౌన్​ ఆఫ్​ బ్లడ్’​ ప్రాజెక్ట్​లలో రావణ, అమరేంద్ర బాహుబలి పాత్రలకు డబ్బింగ్ చెప్పాడు. ప్రస్తుతం హిందీ, మరాఠీ సినిమాలతోపాటు వెబ్​ సిరీస్​లలోనూ నటిస్తున్నాడు. లేటెస్ట్​గా వచ్చిన ‘డాక్టర్స్’ అనే వెబ్​ సిరీస్​లో ఇషాన్​ పాత్రలో నటించాడు. అయితే, ‘‘ఎన్ని సినిమాలు, సీరియల్స్, వెబ్​ సిరీస్​లు చేసినా నా ఇమేజ్​ను మార్చింది మాత్రం రెండు ప్రాజెక్ట్​లే. అవే ‘బాహుబలి : క్రౌన్​ ఆఫ్​ బ్లడ్’​, ‘తన్హాజీ’ ప్రాజెక్ట్​లు’’ అంటాడు శరద్. 

బాహుబలికి డబ్బింగ్​..

ప్రతి ఒక్కరి లైఫ్​లో సక్సెస్​కి ముందు స్ట్రగుల్స్ ఉన్నట్టే శరద్​ లైఫ్​లోనూ ఉన్నాయి. ఈ విషయం గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘దాదాపు మూడేండ్లపాటు స్ట్రగుల్ అయ్యాను. 2003లో నేను నా ఫస్ట్ షో చేస్తున్నప్పుడు చాలా ఎగ్జైటింగ్​గా ఫీలయ్యాను. కానీ అప్పటికి నాకు యాక్టింగ్​ అస్సలు తెలియదు. చెప్పాలంటే.. ఒక సీన్​ పర్ఫెక్ట్​గా రావడానికి దాదాపు 30 – 40 టేక్​లు తీసుకునేవాడిని. అప్పుడు నాకు సాయం చేసేవాళ్లు ఎవరూ లేరు. 

డైలాగ్స్ చెప్పడం రాక ఇబ్బంది పడేవాడిని. ఒకరోజు రాత్రి నా పాత్రను వేరే వాళ్లకు ఇచ్చేశారు కూడా. ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. ఆ తర్వాత చాలాకాలానికి నాకు మంచి అవకాశం వచ్చింది. ఏదీ ఈజీగా రాదు అని అప్పుడే నేను రియలైజ్​ అయ్యాను. ఆ మోటివేషన్​తోనే హార్డ్​ వర్క్​ని నమ్ముతుంటాను. ఇప్పటికీ కంటిన్యూగా ఎఫర్ట్​ పెడుతూనేఉంటాను. 

అలాగే నా లైఫ్​లో మరొకటి జరిగింది. నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న టైంలో నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. వాటన్నింటినీ చూసుకోవాలంటే నాకు ఆదాయం కావాలి. ఆ సమయంలో నాకు బాహుబలి డబ్బింగ్ చెప్పే అవకాశం వచ్చింది. మొదట్లో డైలాగులు చెప్పడం రాక, ప్రాజెక్ట్​ పోయిన నాకు నా వాయిస్ ద్వారా మరో అవకాశం లభించింది” అని చెప్పాడు శరద్. 

అభిప్రాయం మారిపోవచ్చు

డాక్టర్ల జీవితంలో నిజంగా ఏం జరుగుతుందో చాలా అరుదుగా చూస్తుంటాం. ‘డాక్టర్స్’ వెబ్​ సిరీస్ చూసిన తర్వాత మెడికల్ ప్రొఫెషన్ మీద ప్రజల అభిప్రాయం మారిపోవచ్చు. డాక్టర్లను పొగడొచ్చు లేదా విమర్శించొచ్చు. ఇది ముఖ్యంగా యంగ్ జనరేషన్​ చూడాల్సిన సిరీస్​. చెప్పాలంటే వాళ్లను మెడిసిన్ చదవాలని ఇన్​స్పైర్​ చేస్తుంది కూడా. 

ఈ సిరీస్​ షూటింగ్ జరుగుతున్నప్పుడు రియల్ డాక్టర్స్ ప్రతి రోజు సెట్​లో ఉండేవాళ్లు. వాళ్లు మమ్మల్ని చిన్న చిన్న డీటెయిల్స్​ కూడా పోకుండా గైడ్ చేసేవాళ్లు. అది మెడికల్ భాష అయినా, చేసే ప్రక్రియలైనా లేదా డాక్టర్స్​ని చూపించే విధానమైనా.. చివరికి ఎడిటింగ్​ ప్రాసెస్​లో కూడా వాళ్లు ఇన్వాల్వ్​ అయ్యారు. 
ఈ సిరీస్​లో నేను న్యూరోసర్జన్ పాత్రలో నటించా. ఇద్దరు డాక్టర్లు నాకు ట్రైనింగ్ ఇచ్చారు. మెడికల్ భాష దగ్గర నుంచి బిహేవియర్ వరకు అన్నీ చెప్పేవాళ్లు. ఆ ట్రైనింగ్ కష్టంగా ఉండేది కానీ, మేం ఆ ప్రాసెస్​ని చాలా ఎంజాయ్​ చేశాం. 

ఏదో ఒక పని దొరక్కపోదు! 

చిన్నప్పుడు అందరిలాగే నేనూ యాక్టర్ అవ్వాలనుకున్నా. కానీ, నటుడిగా స్థిరపడాలనే కోరిక మాత్రం లేదు. చదువు పూర్తి చేశాక, ఒక ప్రయత్నంలాగ ఒక వర్క్​ చేశాను. కానీ అది వర్కవుట్ కాలేదు. దాంతో నాకు రెండు డిగ్రీలు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా పని దొరుకుతుంది అని నమ్మాను. అప్పటికీ నటించాలనే ప్లాన్​ లేదు. కానీ, ఒక షో చేశాను. అది నా జీవితంలోనే మర్చిపోలేనిది. దాని తర్వాత ‘సాథ్ ఫెరె’తో నా జర్నీ స్టార్ట్ అయింది. ఆ ప్రాజెక్ట్​ నా క్లోజ్​ ఫ్రెండ్​ది. 

అలా నేను ఆడిషన్ ఇవ్వడం, సెలక్ట్ అవ్వడం జరిగిపోయాయి. షో రావడానికి మాత్రం కొంత టైం పట్టింది. ఆ మధ్యలో నేను పెండ్లి కూడా చేసుకున్నా. కానీ ఈ సీరియల్​లో నటిస్తున్నప్పుడు నా ఫ్రెండ్స్ నన్ను నిరుత్సాహపరిచేవాళ్లు. అయితే నేను వాళ్లకు ఒక్కటే చెప్పేవాడిని. నేను దీనికి కమిట్ అయ్యాను. పూర్తి చేసేవరకు విడిచిపెట్టను అని. ఆ సీరియల్ నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది.