ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్లు ఎక్కువైపోయారు. ఎంచక్కా ఫొటోలు, వీడియోలు షేర్ చేసుకుని సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెంచుకోవచ్చు అనుకుంటారు చాలామంది. అది ఓకే కానీ సోషల్ మీడియాలో పర్సనల్ డాటా సేఫ్టీగా ఉందా? లేదా? అనేది కూడా చూసుకోవాలి. మరీ ముఖ్యంగా టీనేజర్లు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే టీనేజర్ల సేఫ్టీ కోసం ఇన్స్టాగ్రామ్ కొన్ని లిమిట్స్ తీసుకొచ్చింది. వాటిని ఎనేబుల్ చేసుకుంటే సేఫ్‌గా ఎంజాయ్ చేయొచ్చు.
పద్దెనిమిదేండ్ల లోపు వాళ్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో టీన్ అకౌంట్స్ (instagram teen accounts) ఆప్షన్ తెచ్చింది. టీనేజర్ల సేఫ్టీ కోసమే ఈ ఆప్షన్ అని చెప్పింది మెటా. అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియాలలో ఇది ఇప్పటికే ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసే18 ఏండ్ల లోపు పిల్లలకు టీన్ అకౌంట్స్ ఇస్తారు. ఆ వయసు పిల్లలకు ఇప్పటికే ఉన్న అకౌంట్స్‌ను 60 రోజుల్లోపు టీన్ అకౌంట్లుగా మార్చేస్తారు. ఈ టీన్ అకౌంట్స్‌లో పిల్లలకు సంబంధించిన సేఫ్టీ ఉంటుంది. దీంతోపాటు పేరెంటల్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. ఈ అకౌంట్స్ డిఫాల్ట్‌గా ప్రైవేట్ మోడ్‌లో ఉంటాయి.
ఈ అకౌంట్స్ ఉన్న వాళ్లకి ఇప్పటికే ఫాలో లేదా కనెక్ట్ అయిన అకౌంట్స్ నుంచి మాత్రమే మెసేజ్‌లు వస్తాయి. వాళ్లు మాత్రమే ట్యాగ్ చేయగలరు. సెన్సిటివ్ కంటెంట్‌ను కంట్రోల్ చేస్తుంది. 16 ఏండ్ల లోపు వయసు ఉన్న యూజర్లు డిఫాల్ట్ సెట్టింగ్స్ మార్చుకోవాలి అనుకుంటే కనుక పేరెంట్స్ పర్మిషన్ తప్పనిసరి. అంటే పిల్లలు వాడే ఇన్‌స్టా అకౌంట్‌పై పేరెంట్స్ నిఘా పెట్టొచ్చు. ఇవి ఆల్రెడీ డిఫాల్ట్ ప్రైవేట్ అకౌంట్స్‌గా ఉంటాయి. కాబట్టి కొత్తగా ఎవరైనా మైనర్లు ఆ అకౌంట్‌ను ఫాలో అవ్వాలి అనుకుంటే ఆ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేయకపోతే కంటెంట్ చూడలేరు. అంతేకాదు.. డైరెక్ట్ మెసేజ్‌లు, కామెంట్లలో అసభ్యకర పదాలేవైనా ఉంటే వాటిని ఆటోమేటిక్‌గా ఫిల్టర్ చేస్తుంది ఇన్‌స్టా.
రోజుకి 60 నిమిషాలకు పైగా వాడితే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ నోటిఫికేషన్లు ఆపేసి (ఆఫ్) ఉంటే ఆటోమెటిక్‌గా స్లీప్ మోడ్‌లోకి వెళ్తుంది. అలాగే రాత్రి పది నుంచి ఉదయం ఏడు గంటల వరకు మెసేజ్‌లకు ఆటో రిప్లయ్‌లు వస్తుంటాయి. ఈ సెట్టింగ్స్ మార్చాలనుకుంటే పేరెంట్స్ పర్మిషన్ కావాలి. అందుకోసం ‘పేరెంటల్ సూపర్ విజన్’ మోడ్‌ని పర్మిట్ చేయాలి. పిల్లలు ఎంత సేపు ఇన్‌స్టా చూడాలనేది తల్లిదండ్రుల చేతిలో ఉంటుంది. అలాగే ఎవరు మెసేజ్ చేస్తున్నారు? ఎవర్ని ఫాలో అవుతున్నారు? వంటివి కూడా తల్లిదండ్రులకు తెలిసిపోతుంది.