పరిచయం : ఓటీటీలో  వెరైటీ రోల్స్​ 

పరిచయం : ఓటీటీలో  వెరైటీ రోల్స్​ 

చాలావరకు నటీనటుల్ని​ స్క్రీన్​ నేమ్స్​తోనే గుర్తుపెట్టుకుంటారు ఆడియెన్స్. మొదట్లో ఏ క్యారెక్టర్​ బాగా సక్సెస్​ అవుతుందో ఆ పేరు గుర్తుండిపోతుంది. ఈమె పేరు కూడా అంతే.అసలు పేరు శ్వేత త్రిపాఠి శర్మ. కానీ, ఆడియెన్స్​కి మాత్రం ‘గోలు గుప్తా’ అంటే తెలుస్తుంది. మీర్జాపూర్​ వెబ్​ సిరీస్​లో చేసిన  క్యారెక్టర్​ పేరే గోలు గుప్తా. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న వెబ్​ సిరీస్​లో కూడా గోలు గుప్తా క్యారెక్టర్​ ఉంది. రీసెంట్​గానే మూడో సీజన్ రిలీజ్ అయ్యి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. శ్వేత త్రిపాఠి ఉరఫ్​ గోలు గుప్తా జర్నీ గురించి ఆమె మాటల్లోనే...

‘‘మాది ఢిల్లీ. నాన్న ఐఏఎస్ ఆఫీసర్. అమ్మ టీచర్​గా పనిచేసి రిటైర్ అయింది. చిన్నప్పుడు అండమాన్​ అండ్ నికోబార్ ఐల్యాండ్​లో కొన్నాళ్లు ఉన్నాం. తర్వాత ముంబైకి వెళ్లిపోయాం. అండమాన్​లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేశా. ప్రతి వారం ఐల్యాండ్స్​కు పిక్నిక్​కి వెళ్లేవాళ్లం. నా చదువు విషయానికొస్తే.. సెకండరీ ఎడ్యుకేషన్​ వరకు న్యూఢిల్లీలో చదివా. ఆ తర్వాత నేషనల్ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఫ్యాషన్​ టెక్నాలజీలో ఫ్యాషన్​ కమ్యూనికేషన్ డిగ్రీ చేశా. 2018లో యాక్టర్, ర్యాపర్​ అయిన చైతన్య శర్మని పెండ్లి చేసుకున్నా. 

లాయర్ అవ్వాలనుకున్నా

నటనలోకి అడుగుపెట్టకముందు సొసైటీలో మార్పు తీసుకొచ్చేందుకు లాయర్ కావాలనుకున్నా. బయటకు వచ్చి మాట్లాడలేని వాళ్లకు నేను గొంతుక అవ్వాలనుకున్నా. న్యూస్ పేపర్ చదివేటప్పుడు కొన్ని వార్తలు నా మీద బాగా ఎఫెక్ట్​ చూపించేవి. మాట్లాడడానికి నోరు రాక, బలం లేక, బలగం లేక ఉన్న వాళ్ల కోసం నిలబడాలి అనుకునేదాన్ని. కానీ లోలోపల ఎక్కడో నటించాలనే చిన్న కోరిక ఉండేది. నాన్న ఐఏఎస్​, అమ్మ టీచర్, నా సిస్టర్​ థియేటర్​ ఆర్ట్స్​ చేస్తోంది. సమ్మర్​లో సరదాగా నా సిస్టర్​తో కలిసి థియేటర్ వర్క్​షాప్స్​కి వెళ్లేదాన్ని. 


అలా వెళ్లినప్పటికీ నా మైండ్​లో నటనకు సంబంధించి ఎలాంటి గోల్స్ ఉండేవి కావు. కొన్నిసార్లు పలానాది చేయాలనే లక్ష్యం ఉండకపోవడమే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటప్పుడు ఏది హ్యాపీగా అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్లొచ్చు కదా!

ఓటీటీలో డిఫరెంట్ రోల్స్

నా ఫోకస్​ స్టోరీ, నేను చేసే క్యారెక్టర్ మీదే ఉంటుంది. నేను ఎంచుకునే కథలు కాస్త వేరుగా ఉంటాయి. అదెలాగంటే.. సామాన్యమైన వ్యక్తులు ఎక్స్​ట్రార్డినరీ ఫీట్లు చేస్తుంటారు. ఆ లైన్​లో ఉండే కథలంటే నాకు ఇష్టం. అవకాశం వచ్చిన క్యారెక్టర్స్ చేస్తున్నా. అన్ని రకాల క్యారెక్టర్స్ సినిమాల్లో రావు. కానీ ఓటీటీలో ఆ ఛాన్స్​ ఉంటోంది. ఓటీటీలో ఒకే రకమైన పాత్రలు కాకుండా రకరకాల పాత్రలు వస్తుంటాయి. ఇలాంటి పాత్రలే చేయాలని నేను అనుకోను. హెవీ డ్రామా, కాంప్లికేటెడ్​ క్యారెక్టర్స్ ఉన్న స్క్రిప్ట్స్​ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది.

ఓటీటీ ప్లాట్​ఫామ్​లో నాకు అలాంటి పాత్రలు వస్తున్నాయి. నేను చేసిన సినిమాల్లో, వెబ్​సిరీస్​ల్లో ‘ఇలాంటి పాత్ర ఎందుకు చేసింది?’ అని ఆడియెన్స్​కి అనిపించొచ్చు. కానీ నేను ఫలానా రోల్​ చేస్తున్నాను అంటే అది ఎందుకు చేస్తున్నా అనేదానికి ఒక లెక్క ఉంటుంది. ఉదాహరణకు ‘కాలకూట్​’ అనే వెబ్​సిరీస్​లో నేను నటించడానికి కారణం వ్యవస్థలో టాక్సిక్​గా మారిన పురుషాధిక్యత. ఎదుటి వాళ్లను చాలా ఈజీగా జడ్జ్​ చేయడం వంటి అంశాలు. అలాంటి స్క్రిప్ట్స్​లో నటించడం నాకు ఇంట్రెస్ట్. 

మీర్జాపూర్ విషయానికొస్తే...

‘మీర్జాపూర్’​ వెబ్​ సిరీస్​లో నటించిన అందరికీ అది చాలా స్పెషల్. ఎందుకంటే మేం అనుకున్నదానికంటే హైట్స్​కి తీసుకెళ్లారు ఆడియెన్స్. సిరీస్​ని సూపర్ హిట్ చేశారు. అంతగా రీచ్​ వచ్చిన ఈ సిరీస్​ రెండో సీజన్​ చేయాలి  అన్నప్పుడు మామీద రెస్పాన్సిబిలిటీ పెరిగింది. దాన్ని ఒత్తిడి అనుకోకుండా బాధ్యతగా తీసుకున్నా. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని బాగా ప్రేమిస్తే, దాన్ని వాళ్లకు తిరిగి ఇవ్వాలి. అప్పుడు ఇంకా ఎక్కువ పొందగలం. మీర్జాపూర్​ సీజన్ 3 విషయానికొస్తే.. షూటింగ్​ టైం అంతా సరదాగా గడిచిపోయింది.


ఎప్పటికప్పుడు ఆడియెన్స్​ని సర్​ప్రైజ్​ చేయాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎప్పుడూ ఒకేలా కనిపిస్తే ఎలా? మన చుట్టూరా ఎన్నో ఎమోషన్స్​ ఉంటాయి. అలా ఏ ఎమోషన్​ ఎవరికి కనెక్ట్​ అవుతుందో తెలియదు కదా! అందుకే నేను పలు రకాల ఎమోషన్స్​ ఉన్న పాత్రల మీద ఎక్కువ ఫోకస్ చేస్తా. యాక్టర్​గా నేను ఎన్నో జీవితాలను ఎక్స్​పీరియెన్స్ చేస్తా. అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా ట్రావెలింగ్​ అంటే నాకు చాలా ఇష్టం. దానివల్ల రకరకాల అభిరుచులు, కల్చర్స్, ఫుడ్ వంటి ఎన్నో విషయాలు తెలుస్తాయి. ఈరోజు నేనిలా ఉండడానికి కారణం నేను చిన్నప్పట్నించీ చేసిన ట్రావెలింగ్​. మా ఆయనకి కూడా ట్రావెలింగ్ అంటే ఇష్టం. అందుకే ఫ్రీ టైం దొరికితే టూర్​ వేస్తుంటాం ఇద్దరం కలిసి. 

అవకాశం బట్టి కెరీర్​

విక్కీ కౌశల్ గర్ల్​ఫ్రెండ్​గా ‘మసాన్​’లో నటించా. అందులో నా పాత్ర పేరు జెనియా ఖాన్. అప్పటినుంచి నాకు ఒక ఐడెంటిటీ వచ్చింది. టాటా స్కై, మెక్​ డొనాల్డ్స్, వొడాఫోన్ వంటి బ్రాండ్స్​ అడ్వర్టైజ్​మెంట్స్​లో కనిపించా. ‘ఫెమినా’ అనే మహిళా పత్రికకు ఫొటో ఎడిటర్​గా కూడా పనిచేశా.  సిట్​కామ్ ‘క్యా మస్త్ హై లైఫ్​’లో చేయడానికి ముందు ముంబైలో ‘పిక్సియాన్ ట్రైలర్ హౌస్​’ అనే పోస్ట్​ ప్రొడక్షన్​ హౌస్​లో పనిచేశా. సొంతంగా ‘ఆల్ మై టీ ప్రొడక్షన్స్’ అనే థియేటర్ కంపెనీ నడుపుతున్నా. ‘బిందాస్’​ అనే మ్యూజిక్​ ఛానెల్​తో కలిసి వర్క్ చేశా.

ఆ తర్వాత తమిళంలో ‘మెహందీ సర్కస్’​ అనే సినిమా అవకాశం వచ్చింది. ‘మీర్జాపూర్​’ సిరీస్​లో అవకాశం వచ్చింది. ‘గాన్ కేశ్​’ అనే సినిమాలో అలోపేషియా వ్యాధి వల్ల జుట్టు కోల్పోయిన యువతిగా, ఆత్మస్థైర్యం కోల్పోయిన డాన్సర్​ రోల్​ చేశా. టీవీఎఫ్​ ‘ట్రిప్లింగ్’​లో నటించా. అందులో నా పాత్రకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ‘లాఖోం మే ఏక్​’ సీజన్​2లో డాక్టర్​ శ్రేయాగా లీడ్​ రోల్​ చేశా. సినిమా, ఓటీటీ అని తేడా లేకుండా ఎందులో అవకాశం వస్తే అది చేస్తున్నా.

- ప్రజ్ఞ