2015లో ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఇన్ ది మలయాళం ఇండస్ట్రీ’ అనే టైటిల్ వచ్చింది. అయితే నా వరకు డిజైరబులిటీ అంటే.. పర్సనాలిటీ, గుడ్ లుకింగ్ కాదు.
- తెలుగులో ‘గుండె జారి గల్లంతయ్యిందే’ సినిమాలో నటించా.
- తమిళంలో డెబ్యూ ‘తిల్లు మల్లు’ అనే సినిమా చేశా.
- ప్రస్తుతం తెలుగు తప్ప మిగతా భాషల్లో బిజీగా ఉన్నా.
ఇషా తల్వార్.. అంటే తెలుగు ఆడియెన్స్ గుర్తు పట్టకపోవచ్చు. కానీ..‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో శృతి పాత్రలో కనిపించిన క్యూట్ బ్యూటీ అంటే గుర్తొస్తుంది. ‘మీర్జాపూర్’ సిరీస్‌లో మాధురి యాదవ్ పాత్రలో ఆమె నటనకు బాలీవుడ్ ఫిదా అయింది. రీసెంట్గా ఇండియన్ ‘పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్‌లో రష్మి మాలిక్ పాత్రలో కనిపించింది. మలయాళీ ఇండస్ట్రీతో సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఇషా అక్కడ చేసిన ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంది. ఆ ఫేమ్‌తో బాలీవుడ్ అవకాశాల కోసం ట్రై చేసింది. కానీ బ్రేక్ రావడానికి చాలా కాలమే పట్టింది. పేరుకు బాలీవుడ్ నటి అయినా నటిగా గుర్తింపునిచ్చింది మాత్రం మలయాళ ఇండస్ట్రీనే అంటున్న ఇషా సినీ జర్నీలో ఉన్న మలుపుల గురించి...
‘‘మా స్వస్థలం ముంబై. సెయింట్ జేవియర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేశా. నాన్న ఫిల్మ్ బ్యాక్‌గ్రౌండ్ కావడంతో చిన్నప్పటి నుంచీ నాకు నటన అంటే ఆసక్తి. 2000 సంవత్సరంలో ‘హమారా దిల్ ఆప్కే పాస్ హై’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశా. 2004లో ‘టెరెన్స్ లెవిస్’ అనే డాన్స్ స్కూల్లో బ్యాలే, జాజ్, హిప్–హాప్, సల్సా వంటి రకరకాల డాన్స్‌లు నేర్చుకున్నా. తర్వాత డాన్స్ స్టూడియోలో ట్యూటర్‌గా పనిచేశా. నన్ను పూర్తిగా మార్చేసిన వ్యక్తి డాన్స్ కొరియోగ్రాఫర్ టెరెన్స్ లెవిస్. కథక్ ఐదేండ్లు నేర్చుకున్నా. టీచర్‌తో కలిసి స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇచ్చేందుకు బస్, రైళ్లలో వెళ్లేదాన్ని. అయితే నాకు రెమ్యూనరేషన్ ఏం ఇవ్వలేదు. నాక్కూడా తీసుకోవాలన్న ఆలోచన లేదు. టీచర్‌తో కలిసి డాన్స్ పర్ఫార్మెన్స్లకు వెళ్లడం నాకు చాలా ఇష్టంగా అనిపించేది. ఆ రోజులు గుర్తొస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే... ఇంట్లో కూర్చుని నా లైఫ్‌లో ఏం జరగట్లేదని బాధపడే కన్నా అది బెటర్ అనిపించింది.
ఆ తర్వాత నేను మోడలింగ్ చేశా. 40కి పైగా కమర్షియల్ యాడ్స్ చేశా. వాటిలో ‘పిజ్జా హట్, వివెల్ ఫెయిర్‌నెస్ క్రీమ్, కాయ స్కిన్ క్లినిక్, డులెక్స్ పెయింట్స్, ధాత్రి ఫెయిర్‌నెస్ క్రీమ్’ వంటి బ్రాండ్స్ ఉన్నాయి. హృతిక్ రోషన్‌తో కలిసి ‘జస్ట్ డాన్స్’ అనే మ్యూజిక్ వీడియోలో చేశా. హిందీ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలనేది నా కోరిక. అందుకు రెండేండ్లు చాలా కష్టపడ్డా. నా మొదటి సినిమా బాలీవుడ్లో రావాలని కలలు కన్నా. కానీ, అదీ జరగలేదు. అయితేనేం ఇప్పుడు నా సినీ కెరీర్ చాలా బాగుంది.
మొదటి అవకాశం
నేను ముంబైలో ఒక టీవీ కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నప్పుడు కేరళలో కూడా ఒకటి చేయాలని చెప్పారు. ‘సరే చేస్తా’ అన్నా. ఆ టీవీ కమర్షియల్ తీస్తున్న కెమెరామెన్ జోయెన్ ‘‘మేం ఒక సినిమా తీయాలనుకుంటున్నాం. నువ్వు ఆడిషన్ ఇవ్వు’’ అన్నారు. అలా నేను ఆడిషన్‌కి వెళ్లా. అందులో సెలక్ట్ కావడంతో హీరోయిన్ ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా పేరు ‘తట్టతిన్ మరయతు’. అందులో హీరో నివిన్ పౌలీకి జోడిగా నటించా. నా క్యారెక్టర్ పేరు ఆయేషా. ముస్లిం అమ్మాయి, హిందూ అబ్బాయితో ప్రేమలో పడితే..? అనే కాన్సెప్ట్. ఆ సినిమా నా కెరీర్‌ని ఒక్కసారిగా మలుపు తిప్పింది.
మలయాళంలో పెద్ద హిట్ అయింది. ఆ సినిమా చేసినప్పుడు భాష అర్థంకాక మలయాళంలో డైలాగ్స్ చెప్పడం చాలా కష్టంగా అనిపించేది. డైలాగ్ లైన్స్ గుర్తుండేవి కావు. ఈ సినిమా కోసం నాలుగు నెలలు వాయిస్ ట్రైనింగ్ తీసుకున్నా. మలయాళం నేర్చుకునేందుకు ఒక కోర్స్ కూడా చేశా. దాంతోపాటు డైలీ ఆడియో బైట్స్ వినేదాన్ని. వాటితోపాటు ఆ రోల్ కోసం గిటార్ వాయించడం కూడా నేర్చుకున్నా. ఆ సినిమా హిట్ కావడంతో నా కష్టానికి ప్రతిఫలం దక్కింది అనిపించింది. సినిమా హిట్ అవ్వడమే కాకుండా.. 2012లో టాప్ ఫైవ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
సినీ క్రిటిక్స్ ప్రశంసలు కూడా అందుకుంది. ఆయేషా క్యారెక్టర్ పక్కింటి అమ్మాయిలా ఉందని మంచి టాక్ వచ్చింది. డైరెక్టర్ వినీత్‌కి చాలా క్లారిటీ ఉంది. షూటింగ్‌కి ముందే స్క్రిప్ట్ ఇచ్చి ప్రిపేర్ అవ్వమనేవారు. టేక్‌కి ముందు ఏం చెప్పాలో? ఎలా యాక్ట్ చేయాలో సింపుల్‌గా చెప్పేవాళ్లు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కన్ఫ్యూజ్ చేసేవాళ్లు కాదు. ఇప్పటికి ఆ సినిమా వచ్చి పదకొండేండ్లు అవుతోంది.
కేరళతో అనుబంధం
నా మాతృభాష పంజాబీ. కానీ పంజాబీ కంటే మలయాళం బాగా మాట్లాడగలను. మలయాళంలో 14 సినిమాలు చేశా. చాలా ఏండ్లు కేరళలోనే ఉన్నా. ఫ్రీ టైంలో కేరళలోని డాన్స్ ఇనిస్టిట్యూట్‌కి వెళ్తా. అక్కడే ఆరు నెలలు ఉండి డాన్స్ క్లాస్‌లకు వెళ్తా. ట్రెడిషనల్‌గా యాక్టింగ్ కూడా నేర్పిస్తారు. నాట్యం, నవరసాలు వంటివాటి గురించి చెప్తారు. బాలీవుడ్లో వర్క్‌షాప్స్ అలా ఉండవు. సౌత్ ఇండస్ట్రీలో పనిచేయడం వల్ల చాలా నేర్చుకోగలిగా. అలాగే డైరెక్టర్స్, రైటర్స్ ఎలా పనిచేస్తారు? యాక్టర్స్‌ని ఎలా అప్రోచ్ అవుతారనే విషయాలు తెలుసుకున్నా. నిజం చెప్పాలంటే దక్షిణాదికి, ఉత్తరాదికి చాలా తేడా ఉంది. దక్షిణాదిలో డిసిప్లీన్ నేర్చుకున్నా. ఇప్పటికీ షూటింగ్లో ఉన్నప్పుడు ఫోన్ అస్సలు ముట్టుకోను. షూటింగ్‌కి వెళ్లే ముందు ఒక్కదాన్నే కూర్చుని మ్యూజిక్ వింటా.
వర్క్‌షాప్‌లు..స్పెషల్ క్లాస్‌లు
యాక్టింగ్ వర్క్‌షాప్‌లకు ఇప్పటికీ వెళ్తుంటా. కాలేజీ చదువు అయినప్పటి నుంచీ గీతాంజలి కులకర్ణి వర్క్‌షాప్‌కి రెగ్యులర్‌గా వెళ్లేదాన్ని. డాన్స్ నేర్చుకున్నాక ‘‘డాన్స్ ఇక చాలు. నేను యాక్టర్ అవ్వాలి. యాక్టింగ్ నేర్చుకోవాల”ని డిసైడ్ అయ్యా. టీవీ కమర్షియల్స్ చేయాలనుకున్నా. కానీ, అవి చాలా టైం పట్టేవి. దాంతో ఇప్పుడు వాటి మీద ఇంట్రెస్ట్ తగ్గింది. డబ్బింగ్ చెప్పేటప్పుడు వాయిస్ క్లారిటీగా ఉండేందుకు వాయిస్ క్లాస్‌లకు వెళ్లేదాన్ని. మొదట్లో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం అనిపించేది. స్కూల్లో చదివే రోజుల నుంచే నా గొంతుని చాలామంది ఎగతాళి చేసేవారు. ఇప్పటికీ నా వాయిస్ విని చాలామంది ఆశ్చర్యపోతారు. నాకు ఆ విషయం నెమ్మదిగా అర్థమై.. అలాంటి సిచ్యుయేషన్స్ ఎదురైనప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకున్నా.
వెబ్ సిరీస్‌ల గురించి..
‘‘మీర్జాపూర్’’ వెబ్‌సిరీస్ చేసేవరకు డబ్బింగ్ చెప్పడానికి చాలా భయపడేదాన్ని. షూటింగ్ అప్పుడు డైలాగ్స్ చదివి గుర్తు పెట్టుకోవడం కూడా కష్టంగా ఉండేది. తెలుగు, తమిళం అప్పటికప్పుడు ఏదో చదివి చెప్పేదాన్ని. మీర్జాపూర్ చేసేటప్పుడు నాలుగు నెలల ముందే స్క్రిప్ట్ నాకు ఇచ్చారు. ముంబైలో నాకు ఒక యాక్టింగ్ టీచర్ ఉంది. తనతో కలసి నాలుగు నెలలు ప్రాక్టీస్ చేశా. అది నా మాతృభాష కాబట్టి ఎక్కడా తడబడకుండా చెప్పాలని డిసైడ్ అయ్యా. ఆ నాలుగు నెలల కష్టమే ఇప్పుడు ఉపయోగపడుతోంది. ఈ మధ్యనే ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ సిరీస్‌లో కనిపించా. ఆ పాత్రకి ప్రశంసలు వస్తున్నాయి. ఇప్పటివరకు నేను చేసిన రోల్స్‌లో బాగా నచ్చిన వాటిలో ఇది ఒకటి.
స్టార్డమ్ వచ్చినా..
నా మొదటి సినిమా తర్వాత నేను పెద్ద స్టార్ అయిపోయా. ముంబై వచ్చాక ఆడిషన్స్‌కి వెళ్లా. కానీ, అవకాశాలు రాలేదు. అయినా నేను వెనక్కి తగ్గలేదు. రోజుకి నాలుగైదు ఆడిషన్స్ ఇచ్చేదాన్ని. నాన్న ఇండస్ట్రీలో పనిచేసేటప్పుడు ఉన్న వాతావరణం... నేను ఇండస్ట్రీలోకి వచ్చేసరికి మారిపోయింది. సిస్టమ్ మారిపోయింది. కాస్టింగ్ డైరెక్టర్స్ ద్వారా ఆడిషన్స్‌కి వెళ్లాలి. కాబట్టి ఈ సిస్టమ్ గురించి నాన్నకి అంతగా తెలియదు. అందుకే ఆయన నాకు ఆ విషయంలో ఎప్పుడూ హెల్ప్ చేయలేదు. నేనే సొంతంగా ఆడిషన్స్‌కి వెళ్లేదాన్ని. అప్పట్లో సోషల్ మీడియా గురించి కూడా నాకు అంతగా తెలియదు. తెలిసిందల్లా ఒక్కటే ట్రై చేస్తుండడం. కాన్ఫిడెన్స్ కోల్పోకుండా ఉండడం. అలా ఉన్నప్పుడే ఎంత కష్టపడితే.. అంత మంచి రిజల్ట్ వస్తుంది అని నేను నమ్ముతా.
నాన్న అంటే..
నాన్న వినోద్ తల్వార్ ఫిల్మ్ మేకర్. కానీ మా ఇంట్లో సినిమాల గురించి ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్లం కాదు. నేను ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఒకసారి నాన్నతో కలిసి సెట్‌కి వెళ్లా. కెమెరా అసిస్టెంట్‌గా వర్క్ చేశా. నాన్న ఎప్పుడూ ఏదో ఒకటి చెప్తూ ఉండేవాళ్లు. కొన్నాళ్లు విన్నా. కానీ, తర్వాత నుంచి మా ఇద్దరి ఆలోచనా విధానాలు వేరుగా ఉన్నాయని అర్థమైంది. అప్పట్నించీ ఆయన చెప్పేది వినేదాన్ని. డెసిషన్ మాత్రం నా సొంతంగా తీసుకునేదాన్ని. ఒకవేళ నేను మిస్టేక్ చేస్తే ఇంటికొచ్చి ఏడుస్తా. ఎవరి నిర్ణయాలకు వాళ్లే బాధ్యులు అని నమ్ముతా. అంతేకానీ పక్కవాళ్లను నిందించను.