
హైదరాబాద్: బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో జొరబడి హల్చల్ చేసిన అగంతకుడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పాతబస్తీ ప్రాంతంలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సౌత్ జోన్ పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ఉన్న మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఆదివారం తెల్లవారుజామున ఓ దొంగ చొరబడ్డాడు. గుర్తు పట్టకుండా ముఖానికి మాస్క్, వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌస్, బ్యాగ్ వేసుకుని వచ్చాడు. సుమారు గంటన్నర పాటు ఇంట్లోనే గడిపిన దొంగ.. సీసీ కెమెరాలు కూడా స్విచ్ ఆఫ్ చేశాడు.
జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56లో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఇల్లు ఉంది. ఇంటికి వాచ్మన్ ఉండగా, పని మనుషులు వేరే గదిలో పడుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో కిచెన్ కిటికీ తలుపుకు ఉన్న అద్దాన్ని తొలగించిన దుండగుడు.. లోపలికి ప్రవేశించాడు. వెంటనే అక్కడున్న సీసీ కెమెరాలు ఆఫ్ చేశాడు. సుమారు గంట ఇరవై నిమిషాల పాటు ఇంట్లో కలియ తిరిగి కొన్ని కప్ బోర్డులు, డ్రాలు తీసి ఏదో వెతికాడు. ఏమీ దొరక్కపోవడంతో తిరిగి వెళ్లిపోయాడు.
ఉదయం లేచిన వాచ్మన్.. ఇల్లు గందరగోళంగా కనిపించడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇంట్లోని సీసీ కెమెరాలు చెక్ చేశారు. ఎంట్రీ, ఎగ్జిట్ సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఓపెన్ ప్లాట్ నుంచే దుండగుడు ఇంట్లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. గతంలో ఇంట్లో పనిచేసిన వ్యక్తిగా భావిస్తున్నామని, వస్తువులేవీ చోరీకి గురికాలేదన్నారు.
ALSO READ : హైదరాబాద్లో కిడ్నాప్ కలకలం: వడ్డీ వ్యాపారిపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు
కారు డ్రైవర్ పెండ్యాల లక్ష్మణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంట్లో శబ్దం రావడంతో లక్ష్మణ్ లోపలికి వెళ్లి చూడగా ఎవరూ కనిపించలేదని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఉండే లైన్లోనే డీకే అరుణ ఇల్లు ఉండగా, ఇక్కడ పోలీసుల పహారా ఎక్కువగానే ఉంటుంది. అయినా.. దుండగుడు ఎంపీ ఇంట్లోకి చొరబడటం చర్చకు తావిచ్చింది.