భద్రాద్రిలో ఐఎన్​టీయూసీ హవా

  • ఉత్కంఠగా సాగిన కౌంటింగ్​
  • కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్​వద్ద ఉద్రిక్తత

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేట్, కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు ఏరియాల్లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఐఎన్​టీయూసీ సత్తా చాటింది. ఇల్లెందు ఏరియా సింగరేణిలోనే అత్యధికంగా పోలింగ్​శాతం నమోదైంది. 

కొత్తగూడెంలో ఉద్రిక్తత.. 

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో భాగంగా ఇల్లెందు ఏరియాలో 614 ఓట్లకు గానూ 604(98.37శాతం) ఓట్లు నమోదయ్యాయి. కార్పొరేట్ పరిధిలో 1,191 ఓట్లకు గానూ 1,146(96.14శాతం)ఓట్లు, కొత్తగూడెం ఏరియాలో 2,326 ఓట్లకు గానూ 2, 207(94.88శాతం)ఓట్లు, మణుగూరు ఏరియాలో 2, 450 ఓట్లకు గానూ 2,378(97.06శాతం)ఓట్లు నమోదయ్యాయి.  కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​లోని  ఏర్పాటు చేసిన పోలింగ్​ బూత్​ వద్ద ఐఎన్​టీయూసీ ఎన్నికల ఇన్​చార్జి

అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రచారం నిర్వహిస్తున్నారంటూ ఏఐటీయూసీ, సీఐటీయూ ఆధ్వర్యంలో నాయకులు నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులకు, యూనియన్​ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. 

మణుగూరు ఏరియాలో రెండు ఓట్లతో..

మణుగూరు ఏరియాలో రెండు ఓట్లతో ఐఎన్​టీయూసీ విజయం సాధించింది. ఐఎన్​టీయూసీ, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్​ మధ్య ప్రతి రౌండ్​లో ‘నువ్వా.. నేనా’ అన్నట్టుగా ఓట్ల లెక్కింపు సాగింది. ఐఎన్​టీయూసీకి 778 ఓట్లు రాగా ఏఐటీయూసీకి 776, టీబీజీకేఎస్​కు 728 ఓట్లు వచ్చాయి.  

ఉత్కంఠగా కౌంటింగ్..

ఇల్లందు ఏరియాలో కౌంటింగ్​ ఉత్కంఠగా కొనసాగింది. ఐఎన్​టీయూసీ, ఏఐటీయూసీ  మధ్య ఓట్ల లెక్కింపు టెన్షన్​ పెట్టించాయి. ఏఐటీయూసీపై 47 ఓట్ల మెజార్టీతో ఐఎన్​టీయూసీ విజయం సాధించింది. కొత్తగూడెం కార్పొరేట్​ ఏరియాలో బీఎంఎస్​పై ఐఎన్​టీయూసీ విజయం సాధించింది. 

సంబురాల్లో లీడర్లు 

ఐఎన్​టీయూసీ నేతలు సంబరాలు చేసుకున్నారు. కొత్తగూడెం హెడ్డాఫీస్​ ఎదుట అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, నాయకులు ఆళ్ల మురళి, ప్రభాకర్​, తూమ్​ చౌదరి, చీకటి కార్తీక్​, దేవి ప్రసన్న, ఇల్లెందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య, యూనియన్​ నేత జగన్నాథం టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. 

ఏ యూనియన్​ఎన్నిసార్లు.. 

ఇదిలా ఉండగా ఇల్లెందు ఏరియాలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఐదు సార్లు ఐఏటీయూసీ, ఒకసారి టీబీజీకేఎస్​, ప్రస్తుతం ఐఎన్​టీయూసీ విజయం సాధించాయి. కొత్తగూడెం కార్పొరేట్​లో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఇఫ్టూ, టీఎన్​టీయూసీ, ఏఐటీయూసీ ఒక్కోసారి విజయం సాధించగా ఐఎన్​టీయూసీ మూడు సార్లు విజయం సాధించింది.