
హైదరాబాద్ సిటీ, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం ఐఎన్‌టీయూసీ అనుబంధ తెలంగాణ ఆటో డ్రైవర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఐడీ కార్డులు, యూనిఫాం పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి, టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ సిటీలోని ఆటో డ్రైవర్ల సమస్యలను గుర్తించి, వారికి అన్ని విధాల సాయం అందించాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఆటో డ్రైవర్లు పోలీసులతో సహకరించాలని, నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని తెలిపారు. శోభన్ రెడ్డి మాట్లాడుతూ ఈ అసోసియేషన్ ఆటో డ్రైవర్లకు ఐక్యత, భద్రత కల్పించడంలో ముందంజలో ఉందన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు సలీం, మహంకాళి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్ పాల్గొన్నారు.