ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి .. సీఎం రేవంత్​కు ఐఎన్టీయూసీ విజ్ఞప్తి

ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించండి .. సీఎం రేవంత్​కు ఐఎన్టీయూసీ విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఐఎన్టీయూసీ (ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్) కోరింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి సోమవారం లేఖ రాశారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ప్రవేశపెట్టిన వెల్ఫేర్ కమిటీలను రద్దు చేసి యూనియన్లను అనుమతించాలన్నారు. 

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఎలక్ట్రిక్ బస్సుల పథకంలో మార్పులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. 2017 వేతన సవరణ అలవెన్స్ లను పెంచి, వడ్డీతో సహా చెల్లించాలని, సీసీఎస్ కు పాలక మండలి ఎన్నికలు జరిపించాలన్నారు. ఆర్టీసీలో రెగ్యులర్ ఉద్యోగాలను భర్తీ చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలను అందేలా చూడాలని  సీఎం రేవంత్ కు రాసిన లేఖలో సంజీవ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. 

పీసీసీ చీఫ్​ను కలిసిన ఐఎన్టీయూసీ, ఎస్ డబ్ల్యూఎఫ్ నేతలు

ఐఎన్టీయూసీ, ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్ డబ్ల్యూఎఫ్)యూనియన్ నేతలు సోమవారం గాంధీ భవన్ లో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కలిశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, గుర్తింపు సంఘాలకు ఎన్నికలు వంటి ప్రధాన డిమాండ్ల అమలుకు కోసం కృషి చేయాలని కోరారు. మహేశ్ గౌడ్ కు ఎస్ డబ్ల్యూఎఫ్ నేతలు రాజిరెడ్డి, అబ్రహం, సాయిరెడ్డి, శంకరయ్య, నగేశ్, వినాయక రెడ్డి తదితరులు వినతి పత్రం ఇచ్చారు. వారి సమక్షంలోనే రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ తో ఫోన్ లో మహేశ్ మాట్లాడారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.