- ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి
యాదగిరిగుట్ట, వెలుగు : వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు కృషి చేస్తానని ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని రెడ్డి సత్రంలో మంగళవారం జరిగిన పబ్లిక్ హెల్త్(పీహెచ్), మెడికల్ ఎంప్లాయిస్ యూనియన్(ఎంఈయూ) సంఘం 55వ రాష్ట్ర మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై ప్రశ్నించే హక్కు లేకుండా అణిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించినప్పుడే అది ప్రజాప్రభుత్వం అవుతుందని..
ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం సమానపనికి సమాన వేతనం ఇవ్వాలని, 317, 142 జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం తమ యూనియన్ నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ఇక వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఈసీఎన్ఎంలు, ఏఎన్ఎంలు, ఆశావర్కర్లు, ఎన్ఎచ్ఎం కాంట్రాక్టు సిబ్బంది, 104 ఉద్యోగులు, పేషెంట్ కేర్ ఉద్యోగుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు.
ఈ మహాసభల్లో పీహెచ్, ఎంఈయూ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యాంసుందర్, ఉద్యోగ సంఘాల నాయకులు పాపయ్య గౌడ్, సరస్వతి, సత్యనారాయణ గౌడ్, గోవింద్ రెడ్డి, వేణుగోపాల్ గౌడ్, భోగ ప్రకాశ్, మోగరాల శ్రీనివాస్, రామేశ్వరి, నిర్మల, రామారావు, భూషణ్, గాంధీ, జమాలుద్దీన్, మల్లికార్జున్, మధుమోహన్, జ్ఞానేశ్వర్, సుదర్శన్ గౌడ్, కృష్ణమోహన్ గౌడ్ తదితరులు ఉన్నారు.