- కొర్లపహాడ్ GMR టోల్ ప్లాజా అధికారులకు గ్రామస్తుల అల్టిమేటం
- చావు బతుకుల మధ్య ఉన్న వెంకన్నను ఆదుకోవాలి: ఇనుపాముల గ్రామస్తుల డిమాండ్
నల్గొండ జిల్లా: కేతెపల్లి మండలం కొర్లపహాడ్ జీఎంఆర్ టోల్ ప్లాజా కార్యాలయం ముందు ఇనుపాముల గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఇనుపాముల గ్రామం దగ్గర అండర్ పాస్ సమస్యని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. అండర్ పాస్ సరిగా నిర్మించకపోవడంతో గ్రామస్తులు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
అండర్ పాస్ దగ్గర గాయపడిన వెంకన్న అనే గ్రామస్తుడు ప్రస్తుతం హైదరాబాదులో చికిత్స పొందుతూ చావుబతుకుల మధ్య ఉన్నాడని.. ఆయన కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులదేనన్నారు. అండర్ పాస్ సరైన ప్లాన్ ప్రకారం నిర్మించక పోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదన్నారు. వర్షాలు పడినప్పుడల్లా చెరువులు అలుగుపోసి అండర్ పాస్ వరద నీటితో నిండిపోతుందని.. దీని వల్ల తరచూ ప్రమాదాలు జరిగి జనం ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అండర్ పాస్ సమస్యను 48 గంటల్లో పరిష్కరించాలని.. లేకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని.. అవసరమైతే జైలుకు వెళ్లేందుకైనా గ్రామస్తులంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.