- మైలార్ దేవ్ పల్లి డివిజన్ లో అత్యధికంగా 1,749 ఓట్లు తిరస్కరణ
- నోటాకు 29,107 ఓట్లు
- కొన్ని డివిజన్లలో గెలుపోటములపై రిజెక్టెడ్, నోటా ఓట్ల ఎఫెక్ట్
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. ఏకంగా 80,889 ఓట్లు చెల్లకుండా పోయాయి. బ్యాలెట్ పేపర్‌పై ఎక్కువ చోట్ల ముద్ర వేయడం, పెన్నులు, ఇతర మార్కర్లతో రాయడం, అసలు ఓటు ముద్ర వెయ్యకుండా ఖాళీగా ఉంచడం వంటివాటి కారణంగా రిజెక్ట్ అయినట్టు ఎలక్షన్ అధికారులు ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లు ఉండగా ప్రతి డివిజన్లో కూడా వందల సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి. దీంతోపాటు కొందరు ఓటర్లు నోటాకు ఓటేశారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన రిజల్ట్స్‌ను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.
ఎంఐఎం గెలిచిన చోట్ల ఎక్కువగా..
రిజెక్టెడ్ ఓట్లను పరిశీలిస్తే మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో అతి ఎక్కువగా 1,749 ఓట్లు చెల్లకుండా పోయాయి. బంజారాహిల్స్ లో తక్కువగా126 ఓట్లు చెల్లలేదు. ఈ డివిజన్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ సమీప బీజేపీ క్యాండిడేట్పై కేవలం 781 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ డివిజన్లో 805 ఓట్లు నోటాకు పడగా.. 126 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. అంటే ఈ రెండూ కూడా ఫలితాలపై ప్రభావం చూపాయి. అలాగే గాజుల రామారం టీఆర్ఎస్ క్యాండిడేట్‌కు మొత్తంగా 13,267 ఓట్లు వస్తే.. ఓడిపోయిన కాంగ్రెస్ క్యాండిడేట్ కు 12,830 ఓట్లు పడ్డాయి. కేవలం 437 ఓట్లే తేడా. ఇక్కడ రిజెక్ట్ అయిన ఓట్లు 1,110 కాగా.. నోటాకు పడినవి 208. ఇక మొత్తంగా చూస్తే.. ఎంఐఎం గెలిచిన డివిజన్లలో ఎక్కువ సంఖ్యలో ఓట్లు రిజెక్ట్ అయ్యాయి.
ఈవీఎం ఉంటే రిజెక్ట్ ఉండదు
సాధారణంగా ఈవీఎంలతో ఓటింగ్ నిర్వహిస్తే ఓట్లు రిజెక్ట్ కావడం అనే సమస్య ఉండదు. బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు తిరస్కరణకు చాన్స్ ఎక్కువ. ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అదే జరిగింది. బ్యాలెట్ పేపర్‌పై క్యాండిడేట్ల గుర్తుల దగ్గర.. ఈసీ అధికారులిచ్చే స్వస్తిక్ స్టాంపింగ్సరిగ్గా వేయాలి. అలాకాకుండా వేలి ముద్ర, మార్కింగ్, పెన్నుతో టిక్ చేయడం, రెండు, మూడు బాక్సులలో స్టాంపింగ్చేయడం, సంతకాలు, ఇతర రాతలు రాయడం వంటివి చేస్తే ఓటు చెల్లదు. కొందరు ఓటు ముద్ర వేయకుండా బ్యాలెట్ పేపర్ ను ఖాళీగానే ఉంచేస్తారు. అది చెల్లని ఓటు అవుతుంది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కొన్ని పోలింగ్ బూతుల్లో స్వస్తిక్ గుర్తు బదులు మరొక స్టాంప్‌ను వినియోగించారు. ఆ ఓట్లను కూడా రిజెక్ట్ చేశారు.
బంజారాహిల్స్‌లో నోటాకు ఎక్కువగా..
గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 74.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 34 లక్షల మంది ఓట్లు వేశారు. పోలైన ఓట్లలో 2.4 శాతం రిజెక్ట్ అయ్యాయి. నోటాకు 29,107 ఓట్లు (0.9 శాతం) పడ్డాయి. రెండూ కలిపితే.. లక్షా 9 వేల ఓట్లు (3.3 శాతం ఓట్లు) ఏ క్యాండిడేట్కూ పడలేదు. అసలు గ్రేటర్ ఓటర్లు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకోవడం లేదని.. ఒకవేళ క్యాండిడేట్లు ఎవరూ నచ్చకపోతే నోటాకైనా ఓటేయాలన్న ప్రచారం జరిగింది. కొందరు లీడర్లు కూడా అట్లాంటి ప్రకటనలు చేశారు. దీంతో నోటాకు ఓట్లు పెరిగాయని ఎలక్షన్ కమిషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఐటీ, బిజినెస్ పర్సన్స్, డబ్బున్నవాళ్లు ఎక్కువగా ఉండే బంజారా హిల్స్ డివిజన్లో అత్యధికంగా నోటాకు 805 ఓట్లు పడ్డాయి. అతి తక్కువగా శాస్ర్తిపురం డివిజన్ లో 31 ఓట్లు పడ్డాయి. మజ్లిస్ పార్టీ గెలుపొందిన సంతోష్ నగర్, రియాసత్ నగర్, కంచన్‌బాగ్, బార్కాస్, చాంద్రాయణగుట్ట, ఉప్పుగూడ తదితర డివిజన్లలోనూ నోటాకు తక్కువ ఓట్లు వచ్చాయి.