లీడర్ల అండదండలతో భూముల ఆక్రమణ

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : ప్రభుత్వ స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయి. గవర్నమెంట్​ ల్యాండ్​ ఖాళీగా కనిపిస్తే చాలు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం. ఇంటి నెంబర్లు తీసుకోవడం, ఆక్రమించుకోవడం కొత్తగూడెం పట్టణంలో కామన్​గా మారింది. కబ్జా చేసిన స్థలాల వద్దకు అధికారులు వెళ్లకుండా టీఆర్ఎస్​ ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలున్నాయి. కబ్జాదారులకు కొందరు రౌడీ షీటర్లు అండగా నిలవడంతో ఆక్రమణలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. 

ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జాకు స్కెచ్..

జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పట్టణంలో ప్రభుత్వ స్థలం ఖాళీగా కనిపిస్తే చాలు అక్రమార్కులు కబ్జా చేస్తున్నారు. ఇందుకోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, రౌడీ షీటర్ల సాయం  తీసుకుంటున్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఆక్రమించుకోవడం, అమ్ముకోవడం సర్వసాధారణంగా మారింది. స్థానిక నెహ్రూ బస్తీలో గవర్నమెంట్​ స్కూల్​కు సంబంధించిన రూ. 50 లక్షల విలువ చేసే స్థలంపై వీరు కన్నేశారు. బడి స్థలంలో ఇటీవల పునాది రాళ్లు వేశారు. 2 వేల గజాలకు పైగా ఉన్న ఈ స్థలాన్ని దశల వారీగా ఆక్రమించుకొనేందుకు ప్లాన్​ చేస్తున్నారు. నెహ్రూబస్తీలోని ఈ స్కూల్  18 ఏండ్లుగా కొనసాగుతోంది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఈ స్కూల్లో సుమారు 50 మంది స్టూడెంట్లు చదువుకునేవారు. ప్రస్తుతం 15 మంది మాత్రమే ఉన్నారు. సింగిల్ టీచర్​తో స్కూల్ నడుస్తోంది. దీంతో స్కూల్​లో స్టూడెంట్స్​ తక్కువగా ఉన్నారని, ఇక్కడ బడి​అవసరం లేదని కొందరు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంపై స్థానికులు ఇటీవల గ్రీవెన్స్​లో కలెక్టర్​కు ఫిర్యాదు చేశారు. స్కూల్​ ల్యాండ్​ కబ్జా చేస్తున్న విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు హెచ్ఎం తెలిపారు. అలాగే పట్టణంలోని రామా టాకీస్​ ఏరియాలో రూ. లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని అధికార పార్టీ కౌన్సిలర్​ అండదండలతో ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులకు ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదు. రామాటాకీస్​ రోడ్డు నుంచి హెడ్డాఫీస్​కు వెళ్లే దారిలో రూ. కోటి విలువైన ప్రభుత్వ భూమిని కూడా కొందరు ఆక్రమించారు. పట్టణంలోని విలువైన స్థలాలు  కబ్జా అవుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. అధికారులు స్పందించి ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కబ్జా కాకుండా చర్యలు తీసుకుంటాం..

కొత్తగూడెం నెహ్రూబస్తీలోని గవర్నమెంట్​ స్కూల్​ స్థలాన్ని కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటాం. ల్యాండ్​ను ఆక్రమించుకుంటే క్రిమినల్​ కేసులు పెడ్తాం. ఇప్పటికే స్థలం కబ్జా కాకుండా ఫెన్సింగ్​ వేశాం. - సోమశేఖర శర్మ, డీఈవో 

ఆ ల్యాండ్​ గవర్నమెంట్​దే..

నెహ్రూ బస్తీ స్కూల్​ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారనే విషయం నా దృష్టికి ఇటీవలే వచ్చింది. అధికారులను పంపించి వివరాలు సేకరించాం. ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. - రామకృష్ణ , తహసీల్దార్, కొత్తగూడెం