- నల్గొండలో ‘దురస్తు’ కథా సంకలనం ఆవిష్కరణ
నల్గొండ అర్బన్, వెలుగు : కథలు సమకాలీన సామాజిక చరిత్రను ముందు తరాలకు అందిస్తాయని, కథ నడుస్తున్న చరిత్రకు పతిబింబమని ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. ఆదివారం స్థానిక నాగార్జున ప్రభుత్వ కాలేజీలో తెలంగాణ కథా సంకలనం ‘దురస్తు’ను ఆయన ఆవిష్కరించారు. నల్లగొండ కథా పాఠశాల ఆధ్వర్యంలో డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ తెలంగాణ కథా రచయితలు ఆత్మగౌరవంతో తమ కథలను ప్రకటిస్తుండడం హర్షణీయమన్నారు.
ముఖ్యఅతిథి మేరెడ్డి యాదగిరి రెడ్డి మాట్లాడుతూ తెలుగు కథకు పుట్టినిల్లు నల్లగొండ అని, తర్వాత కాలంలో ఈ నేలపై తెలుగు కథ గొప్పగా వికసించిందన్నారు. డాక్టర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ నేల నుంచి ఎన్నో గొప్ప కథలు వచ్చాయన్నారు. పగడాల నాగేందర్ మాట్లాడుతూ దశాబ్ద కాలంగా తెలంగాణ కథను తమ సంపాదకత్వంలో వెలుగులోకి తెస్తున్న సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్ ను అభినందించారు.
పెరుమాళ్ల ఆనంద్ మాట్లాడుతూ నల్లగొండ కథా పాఠశాల ద్వారా ఇంతటి ప్రతిష్టాత్మకమైన గ్రంథాన్ని ఆవిష్కరించడం హర్షణీయమన్నారు. డాక్టర్ సాగర్ల సత్తయ్య, డాక్టర్ బెల్లి యాదయ్య, భూతం ముత్యాలు, డాక్టర్ ఉప్పల పద్మ, మునాస్ వెంకట్, అంబటి వెంకన్న, హనీఫ్, చందు, తులసి, తండు కృష్ణ కౌండిన్య, స్కైబాబా, విశ్రాంత ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్, పుప్పాల కృష్ణమూర్తి, అలుగుబెల్లి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.