యూరియా కొరత ఉందంటూ తప్పుడు రిపోర్టు.. మరికొంతమంది అధికారులపైనా వేటు పడే చాన్స్​ 

నల్గొండ జిల్లాలో యూరియా కొరత రిపోర్టుల అంశంపై ఉన్నతాధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో బాధ్యులైన అధికారులపై వేటు వేశారు. నల్లగొండ జిల్లాలో ఇటీవల పలు మండలాల్లో యూరియా కొరత ఉందని రైతులు ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. అయితే... ఎలాంటి యూరియా కొరత లేదని 14 వేల మెట్రిక్‌ టన్నుల యూరియా స్టాక్‌ ఉందంటూ వ్యవసాయశాఖ కమిషనర్‌కు జిల్లా అధికారులు నివేదిక ఇచ్చారు.

అధికారుల సమన్వయ లోపంతో రైతులు ఆందోళనలు చేశారంటూ జిల్లా కలెక్టర్ తమ నివేదికలో తెలిపారు. డీఏఓతో కలిసి జిల్లా కలెక్టర్‌ సొసైటీలు, డీలర్లు, వ్యాపారుల వద్ద ఉన్న యూరియాను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేవలం రెండు వేల మెట్రిక్‌ టన్నుల యూరియానే ఉన్నట్లు గుర్తించి.. నివేదిక అందించడం విషయంలో నిర్లక్ష్యం వహించి.. రైతులను ఇబ్బందులకు గురి చేశారని అధికారులపై వేటు వేశారు. అంతేకాదు.. తప్పుడు నివేదికలు అందించిన దేవరకొండ ఏడీఏ వీరప్ప, జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయ టెక్నికల్‌ ఏవో పి. గిరిప్రసాద్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ రవికుమార్‌ను సస్పెండ్‌ చేశారు. దీనిపై వ్యవసాయశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం తప్పుడు రిపోర్టుల అంశంపై ఉన్నతాధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. మరి కొంతమందిపైనా వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.