నిందితులు విదేశాల్లో..కేసులు పెండింగ్​లో!

నిందితులు విదేశాల్లో..కేసులు పెండింగ్​లో!
  •     ముందుకు సాగని ఫోన్‌‌ ట్యాపింగ్‌‌, గొర్రెల స్కామ్‌‌ కేసులు
  •     లుక్​అవుట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
  •     పెండింగ్​లో రెడ్ కార్నర్‌‌ నోటీసులు 
  •     నిందితులు ఇండియాకు వస్తేనే విచారణ కొనసాగే చాన్స్​ 

హైదరాబాద్‌‌, వెలుగు : బీఆర్ఎస్​హయాంలో జరిగిన ఫోన్‌‌ ట్యాపింగ్‌‌, గొర్రెల స్కామ్‌‌ కేసుల్లో విచారణ ముందుకు సాగడం లేదు. ఈ కేసుల్లో  కీలక నిందితులైన ఎస్‌‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ మాజీ ఎండీ శ్రవణ్‌‌రావు, గొర్రెల కాంట్రాక్టర్లు మొహిద్దీన్‌‌, ఇక్రమ్‌‌ ఖాన్‌‌ విదేశాల్లో షెల్టర్ తీసుకుంటున్నారు. వారిని తిరిగి ఇండియాకు రప్పించడంలో పోలీసుల ప్రయత్నాలు ఫలించడంలేదు. 

రెండు కేసుల్లో లుక్‌‌ అవుట్ నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు. ఇక బ్లూ కార్నర్, రెడ్‌‌ కార్నర్‌‌‌‌ నోటీసుల కోసం సీబీఐకి ప్రపోజల్స్​పంపించినా అవి పెండింగ్ లో పడ్డాయి. 

కీలక నిందితుల్లేక ఆగిన దర్యాప్తులు.. 

కాంగ్రెస్​అధికారంలోకి వచ్చాక బయటపడ్డ ఫోన్​ట్యాపింగ్​కేసు దర్యాప్తును ఈ ఏడాది మార్చిలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలోని స్పెషల్​ఇన్వెస్టిగేషన్​టీమ్​చేపట్టింది. ఎస్ఐబీ లాగర్ రూమ్ ధ్వంసం కేసులో మొదట డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ అరెస్ట్ చేసి విచారించగా నాటి ఇంటెలిజెన్స్​చీఫ్​ప్రభాకర్ సహా మాజీ అడిషనల్ డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సిటీ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పాత్ర బయటపడింది. వీరంతా అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ప్రభాకర్‌‌‌‌ రావు ఆధ్వర్యంలో ఫోన్​ట్యాపింగ్​చేసినట్టు తేలింది. 

నాటి పీసీసీ అధ్యక్షుడు  రేవంత్‌‌రెడ్డి సహా ప్రముఖ రాజకీయ నాయకులపై సీక్రెట్​ఆపరేషన్​ చేశారనే ఆరోపణలు వచ్చాయి. బీఆర్ఎస్​హయాంలో జరిగిన ఉప ఎన్నికలు, అసెంబ్లీ ఎలక్షన్స్​ టైంలో ఆ పార్టీ గెలుపు కోసం ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థుల ఫోన్లను ట్యాప్​చేసి, వాళ్ల డబ్బులను సీజ్ చేసినట్టు దర్యాప్తులో తేలింది. దీంతో ప్రభాకర్ రావును ఏ1గా చేర్చి విచారణ ప్రారంభించారు. ఈ కేసులో ఓ మీడియా సంస్థ మాజీ ఎండీ శ్రవణ్​రావు  ఏ6గా ఉన్నారు. మిగిలిన నిందితులంతా తాము ప్రభాకర్​రావు ఆదేశాల మేరకే ఫోన్​ట్యాపింగ్​చేశామని ఒప్పుకోవడం, ప్రభాకర్​రావు అమెరికాలో ఉండడంతో దర్యాప్తు అక్కడే ఆగిపోయింది.

ఇక బీఆర్‌‌‌‌ఎస్‌‌ హయాంలోనే చేపట్టిన గొర్రెల పంపిణీ స్కీమ్‌‌లో భారీ అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఎలాంటి గొర్రెలు కొనకుండా, గొల్లకుర్మలకు పంచకుండా నాటి బీఆర్ఎస్​నేతలు, దళారులు, ఆఫీసర్లు కలిసి వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారు. పంపకాల్లో తేడాతో నిందితులే ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో ఈ స్కామ్​బయటపడింది. 

గొర్రెల కొనుగోలు కోసం కొండాపూర్‌‌‌‌లోని లోలోనా ది లైవ్ కంపెనీకి అప్పటి ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇవ్వగా, ఆ సంస్థకు చెందిన సయ్యద్ మొయిద్‌‌తో పాటు పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్, కేశవసాయి కలిసి అక్రమాలకు పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. ఇందులో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీ కల్యాణ్ పాత్ర కూడా ఉన్నట్టు తేల్చారు. ఏసీబీ రంగంలోకి దిగి దాదాపు రూ.650 కోట్లు గోల్ మాల్ అయినట్టు తేల్చింది. 

లుక్‌‌ అవుట్ దగ్గరే ఆగిపోయినయ్​..

ఏదైనా కేసుల్లో నిందితులపై లుక్‌‌ అవుట్‌‌ సర్క్యులర్స్(ఎల్‌‌ఓసీ) జారీ చేస్తే విదేశాలకు వెళ్లిన నిందితులు ఇండియాకు వచ్చిన వెంటనే ఆయా ఎయిర్‌‌‌‌పోర్టుల్లో ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుంటారు. ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌లోని డిటెన్షన్ సెంటర్‌‌‌‌లో నిర్బంధిస్తారు. లుక్‌‌ అవుట్‌‌ సర్క్యులర్‌‌‌‌లో ఇచ్చిన వివరాల ఆధారంగా సంబంధిత ఏసీపీలకు సమాచారమిస్తారు. 

తర్వాత నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఇలాంటి కేసుల్లో నిందితులు తమంత తాముగా ఇండియాకు వస్తే అరెస్ట్​ చేయడం తప్ప.. వేరే అవకాశం లేదు. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రభాకర్ రావు ఈ ఏడాది జూన్‌‌ 26న ఇండియాకు తిరిగి రావల్సి ఉన్నా.. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులకు చికిత్స తీసుకుంటున్నానని,  అందువల్లే ఇండియాకు రాలేకపోతున్నానని తన న్యాయవాదుల ద్వారా కోర్టుకు విన్నవిస్తూ అక్కడే ఉండిపోయారు. 

బ్లూ, రెడ్‌‌ కార్నర్ నోటీసుల కోసం ప్రపోజల్స్.. ​ 

విదేశాల్లో ఉంటున్న నిందితులను ఇండియాకు రప్పించేందుకు ఇంటర్‌‌‌‌పోల్‌‌ ద్వారా బ్లూ కార్నర్, రెడ్‌‌ కార్నర్ నోటీసులు జారీ చేస్తుంటారు. దీనివల్ల మన దేశంతో ఒప్పందం ఉన్న దేశాలు.. వాళ్ల దేశంలో నిందితులు ఉన్నట్టయితే వారిని పట్టుకుని మన దేశానికి పంపిస్తాయి. ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ కేసులో నిందితులు అమెరికాలో ఉండగా, గొర్రెల స్కామ్ నిందితులు దుబాయిలో షెల్టర్‌‌‌‌ తీసుకుంటున్నారు. వీరిని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు మొదట్లో సీరియస్​గా ప్రయత్నాలు చేశారు. 

బ్లూ కార్నర్, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేందుకు నిందితులపై అభియోగాలకు సంబంధించి ఆధారాలు తప్పనిసరి కావడంతో జులైలో నాంపల్లి కోర్టులో చార్జ్ షీట్‌‌ ఫైల్​చేశారు. తర్వాత సీఐడీ ద్వారా ఇద్దరిపై రెడ్‌‌కార్నర్ నోటీసులు ఇవ్వాలంటూ సీబీఐకి ప్రపోజల్స్ పంపించారు. ప్రస్తుతం రెడ్ కార్నర్ నోటీసులకు సంబంధించిన అంశం సీబీఐ వద్ద పెండింగ్‌‌లో ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నామని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.