ఉద్యోగాల కుంభకోణంలో ముందుకు సాగని విచారణ

హనుమకొండ, వెలుగు:  గ్రేటర్​వరంగల్ మున్సిపల్​కార్పొరేషన్​లో జరిగిన ఉద్యోగాల కుంభకోణంలో విచారణ ముందుకు సాగడం లేదు. గ్రేటర్​వరంగల్ ఎలక్షన్స్​కు ముందు సఫాయి కార్మికుల నియామకం కోసం ఆఫీసర్లు ఓ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వగా.. ఆ సంస్థ అనుమతికి మించి ఎక్కువ సిబ్బందిని నియమించింది. ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు వసూలు చేసి సఫాయి పోస్టులు అప్పగించగా..  చివరికి జీతాలు, పీఎఫ్​, ఈఎస్ఐ చెల్లింపుల్లో గందరగోళం కారణంగా విషయం బయటకు వచ్చింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాంట్రాక్ట్ సంస్థ అదనపు సిబ్బందిని  తీసేయగా.. అప్పులు తెచ్చి డబ్బులు కట్టిన వాళ్లంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఇటు ఉద్యోగం రాక, అటు అప్పులు పెరిగిపోతుండటంతో బాధితులు న్యాయం కోసం ఆఫీసర్లు, స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఉద్యోగాల కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన వ్యక్తులతో పాటు కాంట్రాక్టర్లు, ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఆ విషయాన్ని గాలికొదిలేశారనే ఆరోపణలున్నాయి. ఉద్యోగాల కుంభకోణంలో కేవలం ఒకే వ్యక్తిని బాధ్యుడిని చేసి చేతులు దులిపేసుకున్నారనే విమర్శలున్నాయి.

అసలేం జరిగింది?

జీడబ్ల్యూఎంసీలో సరిపడా శానిటేషన్​ స్టాఫ్​ లేకపోవడంతో కొత్తగా  452 మంది ​సిబ్బందిని నియమించేందుకు  2021లో అప్పటి మేయర్​గుండా ప్రకాశ్​అధ్యక్షతన జరిగిన కౌన్సిల్​మీటింగ్​ తీర్మానం మేరకు ఓ కాంట్రాక్ట్ సంస్థకు టెండర్​ఇచ్చారు. ఆ సంస్థ గ్రేటర్​ ఆఫీసర్లు సూచించిన ప్రకారం 452 మందిని నియమించాల్సి ఉండగా..  కొందరు ఆఫీసర్లు, లీడర్లతో  కుమ్మక్కై 54 మందిని అదనంగా రిక్రూట్​ చేసింది. ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తామని నమ్మబలకడంతో  మోరీలు క్లీన్​ చేయడం, రోడ్లు సాఫ్​ చేసే నౌకరీలకు కూడా డిగ్రీలు, పీజీలు చదివిన చాలామంది ఆసక్తి చూపారు.  వారి అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఒక్కొక్కరి నుంచి రూ.3 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు వసూలు చేశారు. ఆ తరువాత పర్సంటేజీలు పంచుకుని సిబ్బందికి విధులు అప్పగించారు. 2021 మార్చిలో ఈ నియామకం జరగగా.. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున నాలుగైదు నెలలు చెల్లించారు. 

అర్ధంతరంగా తొలగింపు

అనుమతికి మించి సిబ్బందిని నియమించుకున్న కాంట్రాక్ట్ సంస్థ 506 మందిని డ్యూటీలోకి తీసుకుని, అందరినీ నాలుగైదు నెలలపాటు కొనసాగించింది. సమర్థంగా పని చేస్తున్నారంటూ అదనంగా తీసుకున్న  సిబ్బందికి కూడా ఆజాదీకా అమృత్​ మహోత్సవంలో భాగంగా జీడబ్ల్యూఎంసీ నుంచి అఫీషియల్​గా ప్రశంసాపత్రాలు సైతం అందజేశారు. కాగా సిబ్బందికి వేతనాలు అందకపోవడం, పీఎఫ్​, ఈఎస్ఐ విషయంలో బాధితులు ఆందోళన చేయడంతో విషయం కాస్త బయటపడింది. 2021 సెప్టెంబర్​లో గ్రేటర్​కమిషనర్ గా ప్రావీణ్య​ బాధ్యతలు తీసుకోగా.. కొద్దిరోజులకే విషయం ఆమె దృష్టికి వెళ్లింది.  452 మంది ఫైనల్​ లిస్ట్ రెడీ చేయాల్సిందిగా కమిషనర్​ ఆదేశించడంతో 2022 జనవరిలో 54 మందిని తొలగించారు. అప్పటినుంచి వారంతా మీడియేటర్లు, కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. కాంట్రాక్ట్​ సంస్థ ఇచ్చిన ఫైనల్​ లిస్ట్​లో ఉన్న పేర్లు కూడా తారుమారు చేసి తమను తొలగించారని  కొంతమంది బాధితులు ఆరోపిస్తున్నారు.

ముందుకు సాగని విచారణ

శానిటేషన్​సిబ్బంది నియామకంలో స్థానిక కార్పొరేటర్ల నుంచి అధికార పార్టీ నాయకులందరూ పైసలు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి. ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల నుంచి రూ.3.5 లక్షల వరకు వసూలు చేయగా.. దాదాపు రూ.10 కోట్ల వరకు చేతులు మారాయనే విషయం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కొద్దిరోజుల కిందటి వరకు కూడా తిరిగి ఉద్యోగాలు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పడంతో వేచి చూసిన బాధితులు కొంతమంది ఇటీవల భీమారం గ్రామానికి చెందిన సబ్​ కాంట్రాక్టర్​బొక్క ప్రవీణ్ పై కేసు పెట్టారు. లోకల్​పీఎస్​లో కంప్లైంట్​ఇస్తే వారు పట్టించుకోకపోవడంతో సీపీ ఆఫీస్​లో సంప్రదించారు. చివరకు నిందితుడిని పట్టుకున్న  పోలీసులు రిమాండ్​కు తరలించారు. ప్రవీణ్ తో పాటు ఇంకొందరు డబ్బులు తీసుకున్నారని బాధితులు ఆరోపిస్తుండగా.. కాంట్రాక్ట్ సంస్థపైగానీ, ఇందులో భాగం పంచుకున్న ఆఫీసర్లపైగానీ ఎలాంటి యాక్షన్​ లేకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. తెరవెనుక కొంతమంది పెద్దాఫీసర్లు, నేతలు ఉండటంతోనే పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో క్షేత్రస్థాయి విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు తగిన విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ప్రశంసా పత్రం ఇచ్చి..తొలగించారు

జీడబ్ల్యూఎంసీలో పీహెచ్​ వర్కర్​ ఉద్యోగం ఇస్తామని చెబితే  రూ.3 లక్షలు ఇచ్చా. డ్యూటీలోకి తీసుకున్న తర్వాత  రెగ్యులరైజ్​ చేస్తమని మరో రూ.50 వేలు తీసుకున్నరు. బాగా పని చేసినందుకు ప్రశంసాపత్రాలు కూడా ఇచ్చారు.  ఆ తరువాత కొద్దిరోజులకే తొలగించారు. దీనిపై తగిన విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలి.
- మట్టెడ ఉమాదేవి, హసన్​ పర్తి

పర్మినెంట్ చేస్తమన్నరు

ఉద్యోగం వస్తుందని మిత్తికి తీసుకొచ్చి రూ.3 లక్షలు కట్టిన. హసన్​పర్తికి చెందిన ఓ వ్యక్తికి డబ్బు ఇస్తే.. ఆయన మరో వ్యక్తికి ఇచ్చి కాంట్రాక్ట్ సంస్థ నుంచి అపాయింట్మెంట్​ ఆర్డర్  కాపీ కూడా ఇచ్చిండు. కొద్దిరోజులు పని చేసిన తరువాత లిస్ట్​ లో పేరు తొలగించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి నాతోపాటు మిగతా బాధితులకు కూడా న్యాయం చేయాలె. 
- జన్ను రంజిత్​, అంబేద్కర్​కాలనీ

విచారణ కొనసాగుతోంది

శానిటేషన్​ సిబ్బంది నియామకాల్లో కాంట్రాక్ట్ సంస్థ ఎక్కువ మందిని తీసుకున్నది వాస్తవమే. ఇదంతా గత ఆఫీసర్ల హయాంలో జరిగింది. అక్రమాలపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం కమిషనర్​ దృష్టిలో కూడా ఉంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. కాంట్రాక్ట్​ సంస్థ, ఇతర ఆఫీసర్ల తీరుపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. 
- డా.జ్ఞానేశ్వర్, మున్సిపల్​హెల్త్​ఆఫీసర్, జీడబ్ల్యూఎంసీ