రాజన్న సిరిసిల్ల,వెలుగు : సిరిసిల్లలోని సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ జరిగి రెండు నెలలైనా విచారణ ముందుకు సాగడంలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిందా.. లేదంటే దీనివెనుక ఏదైనా కుట్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది నవంబర్ 12న దీపావళి నాడు సెస్ ఆఫీసు మొదటి అంతస్తులోని పర్చేస్ గదిలో మంటలు చెలరేగి విలువైన ఫైళ్లు కాలిబూడిదయ్యాయి. దీపావళి సందర్భంగా సెస్ ఆఫీసులో పూజలు నిర్వహించారు.
నంతరం ఎన్నడూ లేనివిధంగా పటాకులు కాల్చారు. ఈ సందర్భంగా ఫస్ట్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. ఫైర్ యాక్సిడెంట్లో 2007 నుంచి ఇప్పటి వరకు కొనుగోలు చేసిన విద్యుత్ సామగ్రి వివరాలున్న ఫైల్స్, మిగితా సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. ప్రమాదం జరిగిన మర్నాడు సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైర్మన్ , ఎండీ, ఇతర డైరెక్టర్ లేకుండానే పూజలు చేయడం, రెండు నెలలైనా విచారణ కొలిక్కి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
మొదటి నుంచీ అవినీతి ఆరోపణలు..
1970లో ప్రారంభమైన సెస్ 54 ఏండ్లుగా ఈ ప్రాంతవాసులకు విద్యుత్ సేవలందిస్తోంది. 2.50 లక్షల మంది వినియోగదారులు, కోట్లలో టర్నోవర్ ఉన్న సంస్థ క్రమంగా అవినీతి ఆరోపణలతో అభాసుపాలవుతోంది. ముఖ్యంగా 2007 నుంచి 2011 మధ్యకాలంలో చైర్మన్‌గా ఉన్న చిక్కాల రామారావు హయాంలో జరిగిన కొనుగోళ్లపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు కూడా ఆయనే చైర్మన్ కావడం, అదే సమయంలో మంటలు చెలరేగి పాత ఫైల్స్ కాలిపోవడంతో అనుమానాలు కలుగుతున్నాయి. 2011లో చిక్కాల పదవీకాలం ముగిసిన తర్వాత .. పాలక వర్గం అవినీతిపై విచారణ జరిపించాలని అప్పుడు పర్సన్ ఇన్చార్జిగా ఉన్న జాయింట్ కలెక్టర్ అరుణ్ కుమార్ ఎన్సీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కు లెటర్ రాశారు.
ఎంక్వైరీస్ ఎస్ఈ క్రిష్ణయ్య బృందం విచారణ ప్రారంభించింది. పాలకవర్గం హైకోర్టునుంచి స్టే తేవడంతో ఎంక్వైరీ నిలిచిపోయింది. ఆ తర్వాత జేసీ అరుణ్ కుమార్ విజిలెన్స్ విచారణ జరిపించాలని వ్యవసాయ, సహకార శాఖ ముఖ్య కార్యదర్శికి కూడా లెటర్ రాశారు. ముఖ్యమైన ఫైల్స్ ఇవ్వాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు సెస్ ఎండీకి లేఖ రాశారు. ఎందుకోగాని ఆ తర్వాత విజిలెన్స్ దాన్ని పట్టించుకోలేదు. తాజాగా జరిగిన అగ్నిప్రమాదంలో కాలిపోయిన వాటిలో అప్పటి ఫైల్స్కూడా ఉన్నాయి. ఆఫీసులోని అన్ని రూంలలో సీసీ కెమెరాలున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందన్నది సీసీ పుటేజ్ బట్టి నిర్ధారించే వీలున్నా పోలీసులు టెక్నికల్ కారణాలతో విచారణ సాగదీస్తున్నట్టు అనుమానిస్తున్నారు. పర్చేజ్, ఎక్స్ పెండేచర్ సెక్షన్ అధికారుల సహకారంతో కావాలనే ఫైల్స్, రికార్డులు కాల్చివేశారన్న ఆరోపణలూ వ్యక్తమవుతున్నాయి.