
- నిందితులకు కఠిన శిక్ష పడేలా, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్న ఐజీ
నాగర్‌కర్నూల్, వెలుగు : నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఊరుకొండలో మహిళపై లైంగిక దాడి ఘటనపై విచారణ వేగంగా సాగుతోంది. ఘటన జరిగిన ప్రాంతాన్ని మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఘటన జరిగిన తీరును డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నాగార్జున ఐజీకి వివరించారు. అనంతరం ఐజీ మాట్లాడుతూ విచారణలో ఆందోళన కలిగించే అంశాలు బయటపడ్డాయన్నారు. ఊరుకొండ ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చిన మహిళ, ఆమె బంధువు సమాచారాన్ని ఆలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మహేశ్ నిందితులకు చెప్పారన్నారు.
తర్వాత ఏడుగురు వ్యక్తులు మద్యం, గంజాయి మత్తులో వచ్చి మహిళపై లైంగిక దాడి చేయడమే కాకుండా బంగారం, డబ్బు తీసుకున్నారని తెలిపారు. సమాచారం అందగానే పోలీసులు ఆలయ పరిసరాల్లోని సీసీ ఫుటేజీలను పరిశీలించి, నిందితుల కాల్ డేటా, సంఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నారన్నారు. లైంగికదాడికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టును కోరుతామన్నారు. ఈ ఏడుగురు నిందితులు గతంలోనూ ఇదే తరహా నేరాలకు పాల్పడినట్లు తెలిసిందన్నారు. ఆలయానికి వచ్చిన భక్తులను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసిన ఘటనలు వెలుగుచూశాయన్నారు. మైనర్లను టార్గెట్ చేసి డబ్బుల వసూలు చేశారని, అయితే పోక్సో కేసుకు భయపడి వారిని ఏం చేయకుండా వదిలేశారన్నారు.
ఆలయాల వద్ద భద్రత కల్పిస్తాం
దేవాలయాల వద్ద భక్తులకు భద్రత కల్పించేందుకు ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, ఆలయ కమిటీలు, పోలీసులు కలిపి పనిచేస్తారని ఐజీ చెప్పారు. శ్రీశైలం హైవేపై వెళ్లే టూరిస్టుల రక్షణ కోసం ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సహకారంతో పెట్రోలింగ్ చేపడతామని తెలిపారు. ఆలయాల వద్ద సీసీ కెమెరాలు, మైక్ అనౌన్స్‌మెంట్లు, పెట్రోలింగ్, పోలీస్ పికెటింగ్ ఏర్పాటుకు ఆదేశాలిస్తామన్నారు. అలాగే ఆలయాలకు వచ్చే బాలికలు, యువతులు, మహిళలు స్వీయ క్రమశిక్షణ పాటించాలని సూచించారు. ఊరుకొండ ఆంజనేయస్వామి ఆలయ పరిసరాల్లో మద్యం అమ్మకాలు జరగకుండా చూస్తామన్నారు.
నిందితులను కఠినంగా శిక్షిస్తాం : ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి
ఊరుకొండ ఆలయం సమీపంలో మహిళపై లైంగికదాడి జరిగిన ప్రాంతాన్ని మంగళవారం జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తామన్నారు. ఆంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లే చర్యలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.