
- హైడ్రాను ఉద్దేశిస్తూ హైకోర్టు వ్యాఖ్యలు
- మీరాలం ట్యాంక్ ఆక్రమణలపై విచారణ ముగింపు
హైదరాబాద్, వెలుగు: చెరువుల సంరక్షణ పేరుతో పేదలకు చెందిన నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని, ధనవంతులు, పలుకుబడి ఉన్న బడా వ్యక్తులకు చెందిన నిర్మాణాలను కూల్చి చూపాలంటూ హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యానించింది. ధనవంతులను ప్రత్యేకంగా చూస్తారని, వారికేమైనా ప్రత్యేక చట్టాలున్నాయా? అంటూ ప్రశ్నించింది. మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పత్రికల్లో ఫొటోలు వేయించుకోవడం కాదని, దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో బడాబాబులు చేపట్టిన నిర్మాణాలను తొలగించి చూపాలంది. మీరాలం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలుంటే తొలగింపునకు చర్యలు తీసుకోవచ్చంటూ ఆదేశాలు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లో సర్వే నెం.329/1, 329/2, 329/3లో ఉన్న 6.10 ఎకరాల స్థలానికి సంబంధించి వాల్టా చట్టం కింద తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ షామ్స్ ఫాతిమాఖాన్, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సి.వి. భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు అడ్వకేట్ వాదిస్తూ.. వక్ఫ్ బోర్డు సీఈఓ లేఖ ఆధారంగా తహసీల్దార్ నోటీసులు ఇవ్వడం చెల్లదన్నారు. ఆ స్థలం వక్ఫ్ బోర్డుకు చెందినదయితే సీఈఓ చర్యలు తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వ అడ్వకేట్ వాదిస్తూ.. మీరాలం ట్యాంకు ఆక్రమణల తొలగింపుపై ఉత్తర్వుల మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జాయింట్ సర్వే చేపట్టాలి..
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి స్పందిస్తూ.. ఒకప్పుడు హైదరాబాద్‌లో సరస్సులుండేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. చరిత్రను పరిశీలిస్తే నగరంలో 2,200 చెరువులుండగా ప్రస్తుతం180 కూడా లేవన్నారు. చెరువుల పరిరక్షణకు నిజాం ప్రత్యేక చట్టం తెచ్చారన్నారు.
ఇప్పుడు చెరువుల రక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటోందని, అయితే మురికివాడల్లో నిర్మాణాలపైనే కాకుండా పెద్దలు చేపట్టిన నిర్మాణాలనూ కూల్చివేసినపుడే ప్రజలకు మేలు చేసినట్లవుతుందన్నారు. మీరాలం ట్యాంకు ఆక్రమణలపై పిటిషనర్ అభ్యంతరాల నేపథ్యంలో నీటి పారుదల, రెవెన్యూ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని ఆదేశించారు. అది ప్రభుత్వ స్థలం అయితే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ అది వక్ఫ్ బోర్డుదని తేలితే ఆక్రమణల తొలగింపు బాధ్యతలను వక్ఫ్ బోర్డుకు వదిలేయాలని ఆదేశిస్తూ పిటిషన్‌పై విచారణను ముగించింది.