హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను విచారించిన పోలీసులు.. తాజాగా మరో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేత, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను 2024, నవంబర్ 16వ తేదీన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దాదాపు రెండు గంటల పాటు జైపాల్ యాదవ్‌పై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు.
ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసు లో కీలక పరిణామం: విచారణకు హాజరైన మరో మాజీ ఎమ్మెల్యే..
ఈ కేసులో నిందితుడిగా ఉన్న తిరుపతన్నతో గల సంబంధాలపై జైపాల్ యాదవ్‌ను పోలీసులు ఆరా తీసినట్లు తెలిసింది. జైపాల్ యాదవ్‌ను 2 గంటల పాటు విచారించిన జూబ్లీహిల్స్ పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ ముగిసిన అనంతరం జైపాల్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. తిరుపతన్నకి తాను ఇచ్చిన రెండు ఫోన్ నెంబర్లు ట్యాపింగ్ అయ్యాయని.. దానిపై వివరణ ఇవ్వాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని జైపాల్ యాదవ్ తెలిపారు.
మాకు రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉండడంతో తిరుపతన్నకు ఇద్దరి నంబర్స్ ఇచ్చానని.. ఆ ఇద్దరికి అసలు రాజకీయాలతో సంబంధం లేదని చెప్పారు. ఓ కుటుంబ వివాదం పరిష్కారం కోసం అడిషనల్ ఎస్పీ తిరుపతన్న కలిశానని.. తిరుపతన్న మా సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో ఇద్దరం కలిసి ఆ కుటుంబ వివాదాన్ని పరిష్కరించామని తెలిపారు. ఇది పొలిటికల్కి సంబంధించిన ఇష్యూ కాదని ఆయన క్లారిటీ ఇచ్చారు.
విచారణ సందర్భంగా పోలీసులు కొన్ని ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించారని.. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. నెక్ట్స్ పోలీసులు ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తానని.. పూర్తిగా వారికి సహకరిస్తానని అన్నారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు అధికారులనే విచారించిన పోలీసులు.. ఇప్పుడు రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించడం స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రశ్నించగా.. నెక్ట్స్ ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.