- రెండు వారాలు రాష్ట్రంలోనే కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్
- అఫిడవిట్లు సమర్పించిన వారికి క్రాస్ ఎగ్జామినేషన్!
- ఇంకా అఫిడవిట్ ఇవ్వని మాజీ సీఎస్ సోమేశ్ కుమార్
- కమిషన్ ముందు హాజరైన జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాశ్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం లిఫ్టుల్లో అవినీతి, అక్రమాలు, నాణ్యతా లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తన విచారణను వేగవంతం చేసింది. దర్యాప్తులో భాగంగా కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. విచారణ ఆలస్యం కాకూడదని ఆయన రెండు వారాలపాటు హైదరాబాద్లోనే ఉండి ఎంక్వైరీ చేయనున్నట్లు తెలిసింది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్‌కు 50కి పైగా అఫిడవిట్లను సమర్పించారు. ఇందులో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ అఫిడవిట్ దాఖలు చేయలేదని తెలిసింది. అఫిడవిట్ దాఖలు చేసిన వారికి మరోసారి సమన్లు జారీ చేయనున్నట్లు సమా చారం.
ఇక అఫిడవిట్లు దాఖలు చేసిన అధికారులను క్రాస్ ఎగ్జామినేషన్ కు జస్టిస్ పీసీ ఘోష్ పిలవనున్నారు. అందులో భాగంగా ప్రాజెక్టుకు అన్నీ తామే అని చెప్పుకున్న గత ప్రభుత్వ పెద్దలనూ విచారణకు పిలిచే అవకాశం ఉంది. విచారణలో భాగంగా పలువురు అధికారులు, ఇంజినీ ర్లు, ప్రైవేటు వ్యక్తులకు కమిషన్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ విచారణలో భాగంగా శనివారం హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లోని కమిషన్ ఎదుట హాజరయ్యారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. కమిషన్ అడిగిన ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్పానని తెలిపారు.
తెలంగాణ భవిష్యత్తు కోసమే అన్ని ప్రాజెక్టులను మాజీ సీఎం కేసీఆర్ రీడిజైన్ చేశారన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ కట్టాలని కేసీఆర్ అనుకున్నారని.. కానీ, మహారాష్ట్ర ఆ ప్రతిపాదనలకు ఒప్పుకోలేదని ఆయన ఆరోపించారు. వార్ధా నది బ్యారేజీ నిర్మాణం రూ.2,500 కోట్లతో పూర్తవుతుందని, తుమ్మిడిహెట్టికి రూ.7,500 కోట్లు ఖర్చు అవుతుందని కేసీఆర్ హయాంలో అంచనా వేశామని తెలిపారు. ‘వీ’ ఆకారంలో బ్యారేజీ కట్టడం సాధ్యం కాదు కాబట్టి కట్టలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగలేదని తాను కమిషన్ కు చెప్పానని, అయితే వాటిని అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని అడిగారని తెలిపారు. ఈనెల 26న సాక్ష్యాలతో సహా మళ్లీ కమిషన్ ఎదుట హాజరవుతానని ప్రకాశ్ వెల్లడించారు.