మెదక్, వెలుగు: మెదక్ మండలం గుట్టకిందిపల్లి గ్రామంలో ఇద్దరు రైతులు బతికుండగానే డెత్ సర్టిఫికెట్లు తీసుకొని రైతు బీమా సొమ్మును కాజేసిన వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన పిట్ల శ్రీను, ఎలిగడి మల్లేశం బతికే ఉన్నప్పటికీ చనిపోయినట్లు సర్టిఫికెట్లు సృష్టించారు. ఆ సర్టిఫికెట్లతో వారి భార్యలు జ్యోతి, శేఖమ్మ రైతు బీమాకు అప్లై చేశారు. రైతు బీమా కింద రూ. 5 లక్షల చొప్పున మంజూరు కావడంతో ఆ డబ్బులను తీసుకున్నారు. ఈ వ్యవహారం ఏఈవో భార్గవి దృష్టికి రావడంతో ఆమె మెదక్ రూరల్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎస్సై మురళి మంగళవారం గుట్టకిందిపల్లి గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టగా శ్రీను, మల్లేశం బతికే ఉన్నట్లు గ్రామస్తులు తెలిపారు.
మాజీ సర్పంచ్ కొడుకుది కీలకపాత్ర
పిట్ల శ్రీను, ఎలిగడి మల్లేశం చనిపోయినట్లు సర్టిఫికెట్లు సృష్టించి రైతు బీమా కాజేసిన వ్యవహారంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ కొడుకు వెంకట్ కీలకపాత్ర పోషించినట్టు ప్రచారం జరుగుతోంది. రైతు బీమా కింద ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు మంజూరు కాగా, అందులో ఓ రైతు నుంచి రూ. 2.50 లక్షలు తీసుకున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పాటు గ్రామంలో పలువురికి పెన్షన్లు మంజూరు చేయిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.1,500 చొప్పున వసూలు చేసినట్టు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామ పంచాయతీ నిధుల వినియోగంలో సైతం అవకతవకలు జరిగాయని ఆరోపించారు. సంబంధిత అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గుట్టకిందిపల్లి గ్రామస్తులు కోరారు.
ఇండ్లకు తాళాలు వేసి పరార్
డెత్ సర్టిఫికెట్లు సృష్టించి రైతు బీమా కాజేసిన విషయం బయటపడడంతో పిట్ల శ్రీను, ఎలిగడి మల్లేశం కుటుంబసభ్యులు ఇండ్లకు తాళాలు వేసి గ్రామం నుంచి పరార్ అయ్యారు. మంగళవారం పోలీసులు విచారణ కోసం గ్రామానికి రాగా వారిద్దరి ఇండ్లకు తాళాలు కనిపించాయి. ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సర్పంచ్ కొడుక్ వెంకట్ సైతం గ్రామంలో లేకపోవడం గమనార్హం.
బూర్గుపల్లిలోనూ..
మెదక్, వెలుగు: మెదక్ మండలం హవేలి ఘనపూర్ మండలం బూర్గుపల్లిలోనూ ఓ రైతు చనిపోయినట్లు డెత్ సర్టిఫికెట్ తీసుకొని రైతు బీమా కాజేసినట్లు బయటపడింది. ఈ విషయంపై బూర్గుపల్లి క్లస్టర్ ఏఈవో స్వాతి మంగళవారం హవేలి ఘనపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన లెంక మల్లేశం అనే రైతు 2021 జనవరి 13న చనిపోయినట్లు ఆయన భార్య పద్మ డెత్ సర్టిఫికెట్ తీసుకుంది.
తర్వాత రైతు బీమా కోసం అప్లై చేయడంతో రూ.5 లక్షలు మంజూరు అయ్యాయి. ఈ విషయం బయటపడడంతో ఏఈవో పోలీసులకు ఫిర్యాదు చేసి, అక్రమానికి పాల్పడిన వారి చర్యల తీసుకోవాలని కోరారు. ఉమ్మడి మెదక్ మండలంలో రెండు రోజుల్లో మూడు ఘటనలు బయటపడడం చర్చనీయాంశమైంది. ఆఫీసర్లు పూర్తిస్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.