- నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన
- ఆధారాలు నేరుగా ఇవ్వాలన్న జస్టిస్
- వాస్తవాలు బయటికి వచ్చే అవకాశం
హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లపై విచారణ మొదలైంది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ రంగంలోకి దిగింది. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లలో అవకతవకలపై విచారణ ప్రారంభించింది.
2014 నుంచి జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ సంఘం బహిరంగ ప్రకటన విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు, అవగాహన ఉన్న వివరాలు ఎవరికైనా తెలిస్తే పది రోజుల్లో తెలియజేయాలని కోరింది. 2014లో బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీస్‌గఢ్ డిస్కమ్స్ నుంచి విద్యుత్ సేకరణకు సంబంధించి అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన సమాచారం తెలియజేయాలని కోరింది.
థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంపై..
భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సూపర్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించడం.. రెండేళ్లలో పూర్తి కావాల్సిన నిర్మాణానికి 7 ఏళ్లు తీసుకోవడంపై వివరాలు ఇవ్వాలని కమిషన్ కోరింది. డిస్కమ్‌లపై భారం పడేలా బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌ను దామరచర్లలో నిర్మించడానికి కారణాలు తెలపాలని కోరింది. బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను పాటించకుండా, నామినేషన్ ప్రాతిపదికన కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందం కుదర్చుకోవడంపై సాక్ష్యాలు ఉంటే తెలపాలని పేర్కొంది.
మెయిల్ చేయండి
కరెంటు కొనుగోలులో అవకతవకలు, బిడ్డింగ్ ప్రక్రియకు సంబంధించిన ఆధారాల ఉంటే ఈ-మెయిల్ ద్వారా తెలుపాలని కమిషన్ కోరింది. బీఆర్కే భవన్‌కు పోస్టు ద్వారా కూడా పంపవచ్చని తెలిపింది.ఎలాంటి సమాచారమైనా పరిశీలించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పింది. టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తుల నుంచి సమాచార సేకరణ కోసం బహిరంగ విచారణ నిర్వహిస్తామని జస్టిస్ నర్సింహారెడ్డి తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు సైతం బహిరంగ విచారణలో పాల్గొని తమ వద్ద ఉన్న సమాచారాన్నిఅంద జేయవచ్చునని చెప్పారు. వ్యక్తిగత దూషణలకు, రాజకీయ విమర్శలకు తావులేకుండా విచారణ నిర్వహిస్తామని, ఇందుకు సహకరించాలని కోరారు.