హైకోర్టు జడ్జి, ఆయన భార్య ఫోన్లనూ ట్యాప్​ చేశారు

హైకోర్టు జడ్జి, ఆయన భార్య ఫోన్లనూ ట్యాప్​ చేశారు
  • ఏ ఒక్కరినీ గత బీఆర్ఎస్​ సర్కార్ వదల్లేదు
  • హైకోర్టుకు తెలిపిన దర్యాప్తు అధికారులు
  • విచారణ ఈ నెల 23కు వాయిదా

హైదరాబాద్, వెలుగు: ప్రతిపక్ష నేతలు, ప్రజా సంఘాల నాయకుల ఫోన్లతోపాటు హైకోర్టు జడ్జి, ఆయన భార్య ఫోన్లను కూడా గత బీఆర్​ఎస్​ సర్కార్​ ట్యాప్​ చేసిందని హైకోర్టుకు దర్యాప్తు టీమ్​ తెలిపింది. బీఆర్​ఎస్​ పెద్దల ఆదేశాలకు తగ్గట్టుగా ఎస్​ఐబీలోని నాటి అధికారులు ఈ వ్యవహారాన్ని నడిపించారని పేర్కొంది. ఫోన్​ ట్యాపింగ్​ వెనుక ఎవరెవరు ఉన్నారో, ఎందుకు చేశారో ఎస్‌ఐబీ మాజీ అధికారి భుజంగరావు వాంగ్మూలంలో వెల్లడించారని తెలిపింది. న్యాయమూర్తుల ఫోన్లను నాటి బీఆర్​ఎస్​ సర్కార్‌ ట్యాప్​ చేయించిందన్న కథనాలను ఇటీవల హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. 

ఇందులో భాగంగా బుధవారం చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాథే, జస్టిస్‌‌‌‌ టి.వినోద్​కుమార్​తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఫోన్​ ట్యాపింగ్​పై ఎంక్వైరీ జరుపుతున్న దర్యాప్తు అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించారు. హైకోర్టు న్యాయమూర్తి, ఆయన భార్య ఫోన్లను కూడా గత బీఆర్​ఎస్​ సర్కార్​ట్యాప్​ చేయించిందని పేర్కొన్నారు. నాటి ప్రతిపక్ష నేతలు రేవంత్‌‌‌‌రెడ్డి, ఆయన భార్య, కుటుంబ సభ్యుల ఫోన్లతోపాటు ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, తీన్మార్​ మల్లన్న, శివధర్‌‌‌‌రెడ్డి (ప్రస్తుత ఇంటెలిజెన్స్​ చీఫ్​), ఎ.ఆర్‌‌‌‌.శ్రీనివాస్, రాఘవేందర్‌‌‌‌రెడ్డి, ఎం.రమేశ్‌‌‌‌రెడ్డి, రోనాల్డ్‌‌‌‌ రోస్,  కె.వెంకటరమణారెడ్డి, ఎన్టీవీ నరేంద్రనాథ్‌‌‌‌ చౌదరి, మెఘా శ్రీనివాస్‌‌‌‌రెడ్డి తదితరుల ఫోన్లు ట్యాపింగ్​కు గురయ్యాయని తెలిపారు. 

ఫోన్​ ట్యాప్​తోనే రూ. 13 కోట్ల ఎలక్టోరల్​ బాండ్లు

ఫోన్​ ట్యాపింగ్​ ద్వారానే వ్యాపారవేత్త  శ్రీధర్‌‌‌‌రావు నుంచి బలవంతంగా బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు రూ. 13 కోట్ల ఎలక్టోరల్​బాండ్లను కొనుగోలు చేయించారని.. దీని వెనుక బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్సీ నవీన్‌‌‌‌రావు ఉన్నారని కోర్టు దృష్టికి దర్యాప్తు అధికారులు తీసుకెళ్లారు. కేటీఆర్, నవీన్‌‌‌‌రావు ఇతర బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ అగ్రనేతల ఆదేశాల మేరకు ప్రభాకర్‌‌‌‌రావు సైబరాబాద్‌‌‌‌ పోలీసులపై ఒత్తిడి తెచ్చి..శ్రీధర్‌‌‌‌రావుపై క్రిమినల్‌‌‌‌ కేసులు పెట్టించారని, బీఆర్​ఎస్​కు రూ.13 కోట్ల ఎలక్టోరల్‌‌‌‌బాండ్లను శ్రీధర్‌‌‌‌రావు కొనుగోలు చేసినా ఆయనకు వేధింపులు తప్పలేదని పేర్కొన్నారు.

ప్రభాకర్​రావును విచారించాల్సి ఉంది

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసులోని నిందితులు ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ డేటాతోపాటు ఎస్‌‌‌‌ఐబీకి సంబంధించిన 62 హార్డ్‌‌‌‌డిస్క్‌‌‌‌లను ధ్వంసం చేశారని దర్యాప్తు అధికారులు దాఖలు చేసిన కౌంటర్​లో పేర్కొన్నారు. మావోయిస్టు సంబంధ సమాచారాన్ని కూడా ధ్వంసం చేశారని, దేశఅంతర్గత భద్రతకు ప్రమాదం వాటిల్లేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఐన్యూస్‌‌‌‌ నిర్వాహకుడు శ్రవణ్‌‌‌‌రావుతోపాటు నవీన్‌‌‌‌రావు సూచనలతోనే పలువురి ఫోన్లను ప్రణీత్‌‌‌‌రావు టీం ట్యాప్‌‌‌‌ చేసిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దర్యాప్తు అసంపూర్తిగా ఉందని, దీన్ని కొనసాగించడానికిగాను విదేశాల్లోని ప్రభాకర్‌‌‌‌రావు, శ్రవణ్‌‌‌‌రావును విచారించాల్సి ఉందని చెప్పారు. వారిని రప్పించేందుకు ప్రయత్నాలు చేపట్టినట్లు వివరించారు. అంతేగాకుండా వారిద్దరి పాస్‌‌‌‌పోర్టుల జప్తుకు చర్యలు తీసుకోవాలని ప్రాంతీయ పాస్‌‌‌‌పోర్టు అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు.  

ఇంప్లీడ్​ కోసం సిద్దిపేట వాసి పిటిషన్​

ఇదే కేసులో తనను ప్రతివాదిగా చేర్చుకోవాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన మహమ్మద్‌‌‌‌ హయతుద్దీన్‌‌‌‌ ఇంప్లీడ్‌‌‌‌ పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. హయతుద్దీన్‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ వ్యవహారంలో పిటిషనర్‌‌‌‌ కూడా బాధితుడేనన్నారు. పిటిషనర్‌‌‌‌ నాడు బీఆర్​ఎస్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండటంతో పిటిషనర్‌‌‌‌తోపాటు ఆయన కేసులు వాదించిన న్యాయవాదులు, విచారించిన న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్‌‌‌‌ చేస్తున్నారని అప్పట్లోనే డీజీపీ నుంచి పోలీసుల వరకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు.  

పిటిషనర్‌‌‌‌ ఫోన్‌‌‌‌ను ట్రాక్‌‌‌‌ చేసి, అతడి కదలికలను పసిగట్టి బెదిరించిన దారుణాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఈ ఈ కేసులో హయతుద్దీన్‌‌‌‌ను ప్రతివాదిగా చేర్చాలన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. ఇది సుమోటో పిటిషన్‌‌‌‌ అని, ప్రతివాదిగా చేర్చాలనే వ్యవహారంపై తదుపరి విచారణలో తేల్చుతామని చెప్పింది. 

గాలి అనిల్​, కాసాని ఫోన్లూ ట్యాప్​ చేయాలనుకొని..!

2023 నవంబర్‌‌‌‌ 2న కొన్ని ఫోన్‌‌‌‌ నంబర్లను ట్యాప్‌‌‌‌ చేయాలంటూ అనుమతుల కోసం సర్వీస్‌‌‌‌ ప్రొవైడర్లకు నాడు నిందితులు లేఖ రాశారని దర్యాప్తు అధికారులు తెలిపారు. సాధారణంగా ఏ ఏ ఫోన్‌‌‌‌ నంబర్లను ఇంటర్‌‌‌‌సెప్ట్‌‌‌‌ చేశారనే సమాచారాన్ని సర్వీస్‌‌‌‌ ప్రొవైడర్లు తిరిగి ఎస్‌‌‌‌ఐబీ ఐజీకి పంపిస్తుంటారు. ఈ క్రమంలోనే నవంబర్‌‌‌‌ 2నాటి అనుమతుల సమాచారాన్ని డిసెంబర్​ 4న ఎన్నికల ఫలితాల తర్వాత ఎస్‌‌‌‌ఐబీ ఐజీ కార్యాలయానికి అందాయని, అప్పటికే ప్రభాకర్‌‌‌‌రావు టీం ఎస్‌‌‌‌ఐబీని ఖాళీ చేసి వెళ్లిపోయిందని దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. 

అప్పట్లో నిందితులు ఫోన్​ ట్యాప్​ చేయాలనుకున్న మరికొంత మంది లిస్టులో గాలి అనిల్‌‌‌‌కుమార్, రామసహాయం సురేందర్‌‌‌‌రెడ్డి, కుందూరు రఘువీర్‌‌‌‌రెడ్డి, శ్రీనివాస్‌‌‌‌రెడ్డి మేరెడ్డి, స్వప్నిక మేరెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్, కొల్లె సరిత, మహేశ్‌‌‌‌కుమార్‌‌‌‌ గౌడ్‌‌‌‌ బొమ్మ, మానాల మోహన్‌‌‌‌రెడ్డి, ఏనుగు రవీందర్‌‌‌‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌‌‌‌రెడ్డి తదితరులు ఉన్నారని దర్యాప్తు టీమ్​ కోర్టు దృష్టికి తెచ్చింది.  విచారణను ఈ నెల 23కు హైకోర్టు వాయిదా వేసింది. ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ వ్యవహారంలో కౌంటరు దాఖలు చేయాలని భావిస్తే చేయొచ్చని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు తెలిపింది.