బై బ్యాక్ ఇన్వెస్ట్​మెంట్ ​పేరిట .. సువర్ణ భూమి’ రూ.200కోట్ల మోసం!

  • హైదరాబాద్​ సీసీఎస్​ను ఆశ్రయించిన బాధితులు

బషీర్ బాగ్, వెలుగు: అధిక లాభాలు అంటూ ఆశచూపి ‘సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్’ ఎండీ శ్రీధర్ బొలినేని, డైరెక్టర్ దీప్తి బొలినేని తమను మోసం చేశారని పలువురు హైదరాబాద్​సీసీఎస్ లో ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.200 కోట్లు వసూలు చేశారని ఆరోపించారు. బాధితుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలప్పర్స్ వెంచర్లపై ఇన్వెస్ట్ చేస్తే అధిక లాభాలు వస్తాయని నమ్మబలకడంతో ‘బై బ్యాక్ ఇన్వెస్ట్​మెంట్’ కింద రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు చెల్లించామని బాధితులు శ్రీకాంత్ శర్మ, కల్పన, వేణుగోపాల్, శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 

తాము 2021లో ఇన్వెస్ట్ చేశామని.. ఒప్పందం ప్రకారం 18 నెలల తర్వాత 24 శాతం వడ్డీతో చెల్లించిన మొత్తం రావాల్సి ఉందన్నారు. అయితే గడువు ముగిసి రెండేండ్లు దాటినా ఇంతవరకు స్పందన లేదని వాపోయారు. డబ్బు గురించి అడిగిన ప్రతిసారి దాటవేస్తూ వస్తున్నారని, ఆఫీసుల చుట్టూ తిప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఫీసులకు వెళ్లిన టైంలో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని పలువురు మహిళా బాధితులు వాపోయారు. 

ప్రముఖ సినీ హీరోలు సువర్ణ భూమిని ప్రమోట్ చేస్తుండడంతో నమ్మి మోసపోయామని చెప్పారు. తమలాంటి బాధితులు 200 మంది వరకు ఉన్నారని, రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల మోసం జరిగిందని ఆరోపించారు. రూ.35లక్షల రిటైర్మెంట్​బెనిఫిట్స్ ను సువర్ణభూమిలో ఇన్వెస్ట్​చేస్తే మోసం చేశారని రిటైర్డ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు వాపోయారు. ఆఫీసుల చుట్టూ తిరిగి అలిసిపోయానని, ఇటీవల గుండెపోటుకు గురికావడంతో డాక్టర్లు స్టెంట్లు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సువర్ణభూమి ఎండీ శ్రీధర్, డైరెక్టర్​ దీప్తిపై కేసు నమోదు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు.