ఇన్వెస్ట్​ చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని మోసం

ఇన్వెస్ట్​ చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుందని మోసం
  • రూ.3 లక్షలు కాజేసిన సైబర్​ నేరగాడు

ధర్మసాగర్(వేలేరు), వెలుగు: హనుమకొండ జిల్లా వేలేరుకు చెందిన యువకుడు అత్యాశకు పోయి సైబర్  నేరగాడి వలలో చిక్కుకొని రూ.3 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన సయ్యద్  తాహీర్  ప్రైవేట్  ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజుల కింద అతడి మొబైల్ కు ఒక మెసేజ్  వచ్చింది. ఆ మెసేజ్ లో రూ.20 వేలు ఇన్వెస్ట్  చేస్తే రూ.40 వేలు వస్తాయని ఉంది. అది నమ్మిన తాహీర్  సదరు వ్యక్తికి రూ.20 వేలు పంపించాడు. వెంటనే తాహిర్ కు రూ.28 వేలు వచ్చాయి. డబ్బులు ఎక్కువగా రావడంతో తాహిర్  సదరు వ్యక్తిని నమ్మాడు. కొన్ని రోజుల తరువాత మళ్లీ రూ.70 వేలు కడితే లక్ష వస్తాయని చెప్పగా, డబ్బులు కట్టాడు. వెంటనే రూ. లక్ష క్రెడిట్  అయ్యాయి. ఇలా రూ.1.50 లక్షలు కట్టగా, రూ. 2 లక్షలు వచ్చాయి. ఆ తరువాత రూ.3 లక్షలు కట్టమని అడగగా, డబ్బులు కట్టినా తిరిగి రాలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకొని బుధవారం సైబర్  క్రైమ్  టోల్  ఫ్రీ నంబర్ కు కాల్  చేసి ఫిర్యాదు చేశాడు. సైబర్  క్రైమ్  వాళ్లు అకౌంట్ ను హోల్డ్ లో పెట్టారు. స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగా, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేశ్​ తెలిపారు.