తెలంగాణకు రూ.1000కోట్ల పెట్టుబడులు..సీఎం రేవంత్రెడ్డితో జపాన్ కంపెనీ ఒప్పందం

తెలంగాణకు రూ.1000కోట్ల పెట్టుబడులు..సీఎం  రేవంత్రెడ్డితో జపాన్ కంపెనీ ఒప్పందం

తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ కు చెందిన కంపెనీలు ముందుకు వచ్చాయి. జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డితో పలు కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.జపాన్ కు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజ మారుబెనీ కంపెనీ.. దాదాపు రూ.1000కోట్ల ప్రారంభ పెట్టుబడితో హైదరాబాద్ లోని ఫ్యూచర్ సిటీలో నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేయనుంది. గురువారం (ఏప్రిల్ 17) టోక్యోలో  ఆ కంపెనీ ప్రతినిధులను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు.  
దశలవారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచస్థాయి నెక్ట్స్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ది చేసేందుకు ప్రతిపాదనలు, అందుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్రతినిధులు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. జపాన్ కంపెనీలతో పాటు ఇతర మల్టీ నేషనల్ కంపెనీలు ఈ ఇండస్ట్రియల్ పార్క్ ను అభివృద్ధి చేస్తారు. దీంతో దాదాపు రూ. 5వేల కోట్లకు పైగా పెట్టుబడులు రానున్నాయి. 

ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలల్లో మారుబేని కంపెనీ పెట్టుబడులు పెట్టనుంది. విదేశీ పెట్టుబడులు, స్కిల్ డెవలప్ మెంట్ , ఉపాధి అవకాశాల సృష్టించాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా మారుబేని ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. 

మారుబేని కంపెనీ గురించి.. 

మారుబేని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410 కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్తు, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్ లీజింగ్,  రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్ మరియు మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ అగ్రగామిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. 

మారుబేని కంపెనీ తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపటం పట్ల సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఫ్యూచర్ సిటీలో మొదటి ఇండస్ట్రియల్ పార్క్ ఇదే. మారుబేని కంపెనీ ప్రాజెక్టుతో దాదాపు 30వేల మందికి ప్రత్యక్ష , పరోక్ష ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అన్నారు.